Kavitha: తెలంగాణ యాత్రకు కవిత రెడీ.. కేసీఆర్ ఫోటో లేకుండా కొత్త పొలిటికల్ జర్నీ

Kavitha: అక్టోబర్‌ చివరి వారంలో ఈ యాత్ర ప్రారంభించనున్నట్టు సమాచారం. తెలంగాణలోని మొత్తం 33 జిల్లాల్లోనూ యాత్ర కొనసాగేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

Kavitha

తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన కల్వకుంట్ల కవిత రాష్ట్రవ్యాప్త పర్యటనకు రెడీ అవుతున్నారు. తండ్రి కేసీఆర్ ఫోటో లేకుండానే ఆమె తెలంగాణ వ్యాప్తంగా యాత్ర చేసేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన కవిత(Kavitha) ఆ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ క్రమంలో హరీశ్ రావు, సంతోష్ కుమార్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు చేయడం కలకలం రేపింది.

తండ్రి కేసీఆర్ ను గౌరవిస్తూనే పార్టీని వీడుతున్నట్టు ప్రకటించిన కవిత(Kavitha) తెలంగామ అస్తిత్వం కోసం పోరాటం చేస్తానంటూ అప్పుడే చెప్పారు. గత కొన్ని రోజులుగా తన వెంట వచ్చే నేతలు, కార్యకర్తలతో వరుస సమావేశాలు ఏర్పాటు చేసారు. పనిలో పనిగా తెలంగాణ జాగృతి పేరుతో బతుకమ్మ వేడుకలు, ఇతర కార్యక్రమాలు కూడా నిర్వహించిన కవిత ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా పర్యటించేందుకు సిద్ధమయ్యారు. దీని కోసం రూట్ మ్యాన్ కూడా రెడీ చేసుకున్న కవిత(Kavitha) రేపు పూర్తి వివరాలు ప్రకటించబోతున్నట్టు తెలుస్తోంది.

Kavitha

అక్టోబర్‌ చివరి వారంలో ఈ యాత్ర ప్రారంభించనున్నట్టు సమాచారం. తెలంగాణలోని మొత్తం 33 జిల్లాల్లోనూ యాత్ర కొనసాగేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. తన తండ్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ ఫొటో లేకుండానే ఈ యాత్రను నిర్వహించాలని డిసైడ్ కావడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన ప్రొ.జయశంకర్ ఫోటో, తన ఫోటో మాత్రమే ఉండేలా పోస్టర్లు డిజైన్ చేసేందుకు ఆమె ఆదేశాలిచ్చారు. బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన తర్వాత రేవంత్ ప్రభుత్వంపైనా, కాంగ్రెస్ పైనా విమర్శలు చేస్తున్న కవిత కేసీఆర్ ఫోటో ఉంటే తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశముందని భావించినట్టు జాగృతి పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

పైగా కేసీఆర్ నీడ నుంచి బయటపడే ఉద్దేశం కూడా మరో కారణంగా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ యాత్రను పక్కా ప్లానింగ్ తో చేయబోతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ పోరాటంలో కీలకంగా వ్యవహరించి గుర్తింపుకు నోచుకోని పోరాటయోధులను, విద్యావేత్తలను కవిత కలవబోతున్నారు. అలాగే నిరుద్యోగులు, యువతను ఆకర్షించడమే లక్ష్యంగానూ యాత్ర కొనసాగబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే గ్రూప్ 1 పరీక్ష రద్దు విషయంలో ప్రభుత్వంపై మండిపడిన కవిత హైదరాబాద్ చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర ఆందోళనకు దిగిన విద్యార్థులు, నిరుద్యోగులకు సంఘీభావం తెలిపారు. మొత్తం మీద తెలంగాణ రాజకీయాల్లో కవిత యాత్ర చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Exit mobile version