Beer
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మైక్రో బ్రేవరీల పాలసీ, రాష్ట్రంలోని క్రాఫ్ట్ బీర్ ప్రియులకు, హోటళ్లు, రెస్టారెంట్లకు శుభవార్తగా మారింది. ఈ కొత్త పాలసీ ప్రకారం, నిర్దిష్ట ప్రాంతాల్లో మైక్రో బ్రేవరీలు ఏర్పాటు చేసుకోవడానికి ఈజీగా అనుమతులు లభిస్తాయి. దీనితో వినియోగదారులు ఇకపై బీర్(Beer) కోసం వైన్స్ షాప్‌లకు వెళ్లాల్సిన అవసరం గణనీయంగా తగ్గుతుంది.
నూతన పాలసీ ప్రకారం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (TCUR) పరిధిలోని బోడుప్పల్, జవహర్‌నగర్, పీర్జాదిగూడ, బడంగ్‌పేట్, బండ్లగూడ జాగీర్, నిజాంపేట్, మీర్‌పేట్ వంటి ప్రాంతాలతో పాటు, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్, ఖమ్మం వంటి మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా మైక్రో బ్రేవరీలను ఏర్పాటు చేసుకోవచ్చు.
నిబంధనలు ఇవే… రెస్టారెంట్, హోటల్, బార్ లేదా క్లబ్ యజమానులు, లేదా స్టార్టప్ కోసం ఎదురుచూసేవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసే సంస్థలకు కనీసం 1,000 చదరపు అడుగుల స్థలం ఉండాలి. భవిష్యత్తులో ఈ స్థల పరిమితిని 300 చదరపు అడుగులకు తగ్గించే అవకాశం ఉంది. దరఖాస్తు ఫీజు రూ. 1 లక్ష (నాన్-రిఫండబుల్).
ఒక మైక్రో బ్రేవరీ రోజుకు గరిష్టంగా 1,000 లీటర్ల బీర్ ఉత్పత్తి చేయవచ్చు. అయితే, తయారు చేసిన బీర్(Beer)ను బాటిల్ చేసి బయట అమ్మడం పూర్తిగా నిషేధం. ఆ ప్రాంగణంలోనే వినియోగదారులకు అందించాలి.
దేశంలోని బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో మైక్రో బ్రేవరీలు ఇప్పటికే బాగా ప్రాచుర్యం పొందాయి. దీనికి ప్రధాన కారణం, యువతరం కృత్రిమ రసాయనాలు లేని, తాజా బీర్(Beer)ను కోరుకోవడం. తెలంగాణలో ఈ కొత్త పాలసీ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది ఫుడ్ అండ్ బెవరేజ్ రంగంలో కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుంది.
ప్రభుత్వం మద్యం సరఫరా తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పన్నుల రూపంలో ఆదాయం పెంచుకోవచ్చు.పట్టణ పర్యాటకానికి ఇది ఒక కొత్త అనుభూతిని అందిస్తుంది. తక్కువ పెట్టుబడితో స్టార్టప్ బ్రేవరీలను ప్రారంభించడానికి ఇది ఒక మంచి అవకాశం దొరికినట్లు అవుతుంది.
మొత్తానికి, ఈ కొత్త పాలసీ తెలంగాణలో కొత్త అర్బన్ లైఫ్ స్టైల్కు శ్రీకారం చుట్టింది. ఇది పెట్టుబడిదారులకు, వినియోగదారులకు కూడా లాభదాయకమైనది. తెలంగాణ ఎక్సైజ్ శాఖ నిబంధనలకు అనుగుణంగా ఎన్ని దరఖాస్తులు వచ్చినా అన్నింటికీ అనుమతులు ఇస్తామని స్పష్టం చేసింది. దీనితో తెలంగాణలో మైక్రో బ్రేవరీల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశం ఉంది.