Pawan Kalyan
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల సమయంలో రాజకీయాలు అనూహ్య మలుపు తిరుగుతున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)నేరుగా తెలంగాణ ఎన్నికల ప్రచార బరిలోకి దిగుతుండటమే రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ నెల 6న బీజేపీ అభ్యర్థుల తరపున పవన్ ప్రచారం చేయనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాంచందర్ రావుల విన్నపంతో పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణలో పవన్ ప్రభావం ఎంత?.. తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో,మరీ ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, ఖమ్మం, నల్గొండ , నిజామాబాద్ వంటి జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో జనసేనకు గణనీయమైన ఓటు బ్యాంక్ ఉంది.
సెటిలర్స్ ఓట్లు.. ఏపీ నుంచి వచ్చి తెలంగాణలోని పట్టణాల్లో స్థిరపడిన ఓటర్లపై పవన్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.
యువత క్రేజ్.. రాజకీయాలకు సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫ్యాన్ బేస్.. యువత ఓట్లను బీజేపీ వైపు మళ్లించే అవకాశం ఉంది.
బీజేపీ-జనసేన పొత్తు.. ఏపీ ఎన్నికలలో ఎన్డీఏ గవర్నమెంట్ రావడానికి పవన్ కళ్యాణ్ పాత్ర ఎంతో బీజేపీకి బాగా అర్ధం అయింది. దీంతోనే ఇప్పుడు అదే ఊపును మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగించాలని బీజేపీ భావిస్తోంది.
గత పంచాయతీ ఎన్నికల రికార్డులు చూస్తే:
ఇటీవల జరిగిన తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో జనసేన ప్రత్యక్షంగా పెద్ద సంఖ్యలో తమ అభ్యర్థులను నిలబెట్టలేదు. కానీ, ఉత్తర తెలంగాణ , ఖమ్మం జిల్లాలోని కొన్ని గ్రామాల్లో జనసేన మద్దతు ఉన్న అభ్యర్థులు సర్పంచులుగా గెలవడం ఒకరకంగా పెద్ద విజయమే అని చెప్పాలి.
ఆ ఎన్నికలలో ప్రధానంగా బీజేపీతో కలిసి కొన్ని చోట్ల కలిసి పనిచేశారు. అయితే, మున్సిపల్ ఎన్నికలనేవి ‘పట్టణ’ ఓటర్లకు సంబంధించినవి కాబట్టి, గ్రామాల కంటే పట్టణాల్లోనే జనసేన ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే.
కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి ఎదురవుతున్న గట్టి పోటీని తట్టుకోవడానికి బీజేపీకి ఒక బలమైన స్టార్ క్యాంపెయినర్ అవసరం. అందులోనూ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)వంటి పవర్ ఉన్న వ్యక్తి ప్రచారం చేస్తే అది తప్పకుండా బీజేపీకి ప్లస్ అవుతుంది.
ఇటు పవన్ ఎంట్రీతో బీజేపీ కార్యకర్తల్లోనూ ఉత్సాహం పెరుగుతుంది. అటు పవన్ ప్రచారం చేసే ప్రాంతాల్లో గ్యారంటీగా పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఏపీలో అధికారంలో ఉండి, తెలంగాణలో కేవలం ప్రచారం కోసం రావడం అనేది పవన్ కు ఒక సవాల్ వంటిదే.
ఫిబ్రవరి 13న వెలువడనున్న ఫలితాలే పవన్ కళ్యాణ్ ‘పవర్’ తెలంగాణలో ఎంతవరకు పనిచేసిందో తేల్చబోతున్నాయి. ఏది ఏమైనా, పవన్ ఎంట్రీతో మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు మరింత రసవత్తరంగా మారాయనడంలో మాత్రం సందేహం లేదు.
Epstein:ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రకంపనలు..సెక్స్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌లో డొనాల్డ్ ట్రంప్ పాత్ర ఎంత?
