KCR
తెలంగాణ రాజకీయాలను కొంతకాలంగా కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ఏకంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) ఇంటి తలుపు తట్టింది. దీంతో అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన హస్తాలే.. ఇప్పుడు చట్టం ముందు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది .
హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలో కేసీఆర్(KCR) వ్యక్తిగత సహాయకుడికి సిట్ అధికారులు నోటీసులు అందజేశారు. రేపు జనవరి 30న మధ్యాహ్నం మూడు గంటలకు ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్‌ను ప్రశ్నించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్, హరీష్‌రావు, సంతోష్‌రావు వంటి కీలక నేతలను విచారించిన సిట్.. ఇప్పుడు డైరక్టుగా మాజీ సీఎంను టార్గెట్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.
కేసీఆర్ పోలీస్ స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేదని, విచారణకు సహకరిస్తే సరిపోతుందని అధికారులు చెప్పినా సరే, ఈ పరిణామం వెనుక పెను రాజకీయ తుపాను దాగి ఉందనే చర్చ జరుగుతోంది.
మరోవైపు, ఈ ఫోన్ ట్యాపింగ్ నోటీసుల వ్యవహారాన్ని మాత్రం బీఆర్ఎస్ నేతలు రాజకీయ కక్షసాధింపు చర్యగా అభివర్ణిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే కేసీఆర్‌ను ఇబ్బంది పెడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. అయితే సిట్ దగ్గర ఉన్న పక్కా ఆధారాలే ఇప్పుడు కేసీఆర్ మెడకు చుట్టుకునేలా కనిపిస్తున్నాయి.
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియకుండా కానీ ఆయన కనుసన్నల్లో లేకుండా ఇంత భారీ స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ జరగడం అసాధ్యమనేది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వాదన. గతంలో మాజీ మంత్రి కేటీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలను కూడా కాంగ్రెస్ నేతలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఒకవేళ విచారణలో కేసీఆర్ ప్రమేయం ఉన్నట్లుగానీ గట్టి ఆధారాలు లభిస్తే, సిట్ తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది ఉత్కంఠ రేపుతోంది.
దీంతో కేసీఆర్‌ను అరెస్టు చేసే అవకాశం ఉందా అన్న సందేహాలు కూడా రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ అరెస్టు గనుక జరిగితే అది తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేయొచ్చు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక సాహసోపేతమైన అడుగు కావడమే కాకుండా, ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అరెస్టు జరిగితే బీఆర్ఎస్ శ్రేణులు రోడ్ల మీదకు వచ్చే అవకాశం ఉంది, ఇది శాంతి భద్రతల సమస్యకు కూడా దారితీయొచ్చు.
కేవలం నోటీసులతో సరిపెడతారో లేదా లోతైన విచారణ జరిపి కఠిన చర్యలకు ఉపక్రమిస్తారా అనేది రేపటి విచారణ తర్వాతే తేలుతుంది. ఒకవేళ కేసీఆర్ అరెస్టు గనుక జరిగితే, అది తెలంగాణలో బీఆర్ఎస్ మనుగడకే సవాల్‌గా మారొచ్చు . అలాగే సానుభూతి పవనాలు వీచేలా చేయొచ్చు.
ఏది ఏమైనా రేపు ఎర్రవల్లి ఫాంహౌస్‌లో జరిగే ఈ విచారణ తెలంగాణ రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోబోతోంది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నా, దీని వెనుక ఉన్న రాజకీయ సమీకరణలు మాత్రం ఎంతో లోతుగా కనిపిస్తున్నాయి.
