Telangana MLA Defection Case
తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు (Telangana MLA Defection Case) తుది దశకు వచ్చేసింది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇటీవలే స్పష్టం చేసింది. దీనికి జనవరి 30లోపు తేల్చాలని స్పష్టం చేయడంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ వ్యవహారానికి ముగింపు పలికేందుకు సిద్ధమయ్యారు.
10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఏడుగురికి ఇప్పటికే క్లీన్ చిట్ వచ్చింది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరికెపూడి గాంధీ, కాలె యాదయ్య, తెల్లం వెంకట్రావ్, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, పోచారం శ్రీనివాస్‌రెడ్డిలు పార్టీ మారారనడానికి తగిన ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టం చేశారు. దీంతో మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో సంజయ్ , కడియం శ్రీహరి , దానం నాగేందర్ ఉన్నారు. వీరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
దీనిలో భాగంగానే దానం నాగేందర్ కు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. జనవరి 30న క్రాస్ ఎగ్జామినేషన్ కు అటెండ్ కావాలని ఆదేశించారు. సుప్రీంకోర్టు విధించిన తుది గడువు కూడా అదే రోజు కావడంతో ఏం నిర్ణయం తీసుకుంటారో అన్నది ఆసక్తికరంగా మారింది.
మరో ఎమ్మెల్యే సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్ ముగిసినా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అలాగే కడియం శ్రీహరిని కూడా ఇంకా క్రాస్ ఎగ్జామిన్ చేయలేదు. అయితే కడియం మాత్రం స్పీకర్ కు వివరణ ఇచ్చారు. తాను బీఆర్ఎస్‌లోనే కొనసాగుతున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదని ఆయన స్పీకర్ కు ఇచ్చిన వివరణలో స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో దానం నాగేందర్ ది మిగిలిన వారితో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంది. దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారు.
ఫిరాయింపు కేసుకు సంబంధించి గులాబీ పార్టీకి ఇదే అంశం కీలకమైన ఆధారంగా మారింది. గతంలో పలుసార్లు తాను కాంగ్రెస్ లోనే ఉన్నట్టు దానం చెప్పారు. ఇప్పుడు స్పీకర్ విచారణకు హాజరై క్రాస్ ఎగ్జిమినేషన్ లో దానం అదే చెబుతారా.. లేక ఇంకేం వివరణ ఇస్తారనేది చూడాలి. ఒకవేళ కాంగ్రెస్ లోనే ఉన్నానని దానం ఒప్పుకుంటే అనర్హత వేటు పడుతుంది. అది జరగక ముందే తాను రాజీనామా చేయాలని దానం నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.
Shani Trayodashi:జనవరి 31న శని త్రయోదశి..దీని విశిష్టత ఏంటి ? ఆరోజు ఏం చేయాలి?
