T20
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ టీ ట్వంటీ(T20) ప్రపంచకప్ శనివారం నుంచే మొదలుకానుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగాటోర్నీలో 20 జట్లు పాల్గొంటున్నాయి. నెల రోజుల పాటు 55 మ్యాచ్ లు అభిమానులను అలరించబోతున్నాయి. ప్రతీరోజూ మూడు మ్యాచ్ లు జరగనుండగా.. సంచలనాలు సృష్టించేందుకు పసికూన జట్లు సిద్ధమయ్యాయి.
టైటిల్ ఫేవరెట్ రేసులో ఉన్న టాప్ టీమ్స్ టోర్నీలో దుమ్మురేపేందుకు రెడీగా ఉన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న టీమిండియా హాట్ ఫేవరెట్ గా కనిపిస్తోంది. అలాగే సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లను తేలిగ్గా తీసుకోలేం. అదే సమయంలో సంచలనాలకు చిరునామాగా మారిన ఆఫ్ఘనిస్తాన్ కూడా పెద్ద జట్లకు షాక్ ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.
ఎందుకంటే ఇది టీ ట్వంటీ(T20) ప్రపంచకప్ ఫార్మాట్. ఎవ్వరినీ ఫేవరెట్ గా చెప్పలేం. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలీదు. అందుకే పెద్ద జట్లతో చిన్న జట్ల మ్యాచ్ లను కూడా లైట్ తీసుకోలేని పరిస్థితి కనినిపిస్తోంది.
ఈ టోర్నీలో పాల్గొంటున్న 20 జట్లను గ్రూపునకు ఐదు చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించారు.
గ్రూప్ ఏలో భారత్, పాకిస్థాన్, నెదర్లాండ్స్, నమీబియా, యూఎస్ఏ… గ్రూప్ బీలో ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్ ….గ్రూప్ సీలో ఇంగ్లాండ్, వెస్ట్ ఇండీస్, ఇటలీ, నేపాల్, స్కాట్లాండ్ చోటు దక్కించుకోగా.. గ్రూప్ డిలో గ్రూప్ డీలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్ఘనిస్తాన్, కెనడా, యూఏఈ జట్లు ఉన్నాయి.
తొలిరోజు శనివారం మూడు మ్యాచ్ లు జరగనున్నాయి. పాకిస్థాన్, నెదర్లాండ్స్ మధ్య కొలంబో వేదికగా ఉ.11 గంటలకు జరిగే మ్యాచ్ తో వరల్డ్ కప్ షురూ అవుతుంది. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు వెస్టిండీస్, స్కాట్లాండ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా తలపడనున్నాయి. ఇక డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ రాత్రి 7 గంటలకు ముంబై వాంఖడే స్టేడియం వేదికగా యూఎస్ఏతో తలపడనుంది.
ఈ సారి టోర్నీ భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే బంగ్లాదేశ్ కు మద్ధతుగా పాక్ క్రికెట్ బోర్డు భారత్ తో మ్యాచ్ బహిష్కరించింది. టోర్నీలో మిగిలిన మ్యాచ్ లు ఆడతామనీ, భారత్ తో మ్యాచ్ రద్దు చేసుకుంటున్నట్టు పాక్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. ఈ విషయంలో ఐసీసీ పాక్ బోర్డుపై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. పాక్ బాయ్ కాట్ చేసినా సరే షెడ్యూల్ ప్రకారమే భారత జట్టు కొలంబోకు వెళ్లి ఐసీసీ ప్రోటోకాల్స్ పాటించనుంది.
టీ ట్వంటీ ప్రపంచకప్ గ్రూపుల వివరాలు :
గ్రూప్-ఎ : భారత్, పాకిస్థాన్, నెదర్లాండ్స్, అమెరికా, నమీబియా
గ్రూప్-సి : ఇంగ్లాండ్, వెస్టిండీస్, ఇటలీ, నేపాల్, స్కాట్లాండ్
గ్రూప్-డి : న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, యూఏఈ, అఫ్గానిస్థాన్, కెనడా
తొలిరోజు మ్యాచ్ లు :
పాకిస్థాన్ X నెదర్లాండ్స్ – ఉదయం 11 గంటలకు ( వేదిక – కొలంబొ)
వెస్టిండీస్ X స్కాట్లాండ్ – మధ్యాహ్నం 3 గంటలకు ( వేదిక – కోల్ కత్తా)
భారత్ X యూఎస్ఏ – రాత్రి 7 గంటలకు ( వేదిక -ముంబై )
