Immadi Ravi: ‘ఐ బొమ్మ’ ఇమ్మడి రవి అరెస్టుతో అంతర్జాతీయ పైరసీ సామ్రాజ్యం కూలిపోయినట్లేనా?

Immadi Ravi: భారత్‌కు దూరంగా, ఫ్రాన్స్, కరేబియన్ దీవులు వంటి విదేశాలలో నివాసం ఉంటూ, అత్యంత రహస్యంగా ఈ పైరసీ నెట్‌వర్క్‌ను నిర్వహించేవాడు ఇమ్మడి రవి.

Immadi Ravi

భారతీయ సినీ పరిశ్రమను ముఖ్యంగా తెలుగు, హిందీ, తమిళ చిత్రాల బాక్సాఫీస్ వసూళ్లను లక్షల కోట్ల మేర నష్టపరిచిన ‘ఐ బొమ్మ’ (iBomma) అనే భారీ పైరసీ వెబ్‌సైట్ యొక్క ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవి(Immadi Ravi).. ఎట్టకేలకు నవంబర్ 15, 2025న హైదరాబాద్‌లో అరెస్టు కావడం నిజంగా సంచలనం క్రియేట్ చేసింది.

డిజిటల్ పైరసీ చరిత్రలో ఇది ఒక కీలక మలుపుగా పరిగణించబడుతోంది. ఫ్రాన్స్, కరేబియన్ దీవుల వంటి విదేశాల నుంచి ఒక అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను నడుపుతున్న ఈ నిందితుడిని, హైదరాబాద్‌లోని CCS పోలీసులు వ్యూహాత్మకంగా పట్టుకోవడం ఈ కేసులో అత్యంత నాటకీయ పరిణామంగా చెబుతూ వస్తున్న వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.

ఇంతకీ ఎవరు ఈ ఇమ్మడి రవి(Immadi Ravi)? అంటే.. ఇమ్మడి రవి(Immadi Ravi).. ‘ఐ బొమ్మ’ అనే పైరసీ వెబ్‌సైట్‌కు యాజమాని అలాగే నిర్వాహకుడు కూడా. ఇతను ముఖ్యంగా భారత్‌కు దూరంగా, ఫ్రాన్స్, కరేబియన్ దీవులు వంటి విదేశాలలో నివాసం ఉంటూ, అత్యంత రహస్యంగా ఈ పైరసీ నెట్‌వర్క్‌ను నిర్వహించేవాడు. కేవలం తెలుగు సినిమాలే కాక, హిందీ, తమిళ చిత్రాలు , వెబ్ సిరీస్‌లను విడుదలైన తక్కువ సమయంలోనే పైరసీ చేసి, ఉచితంగా స్ట్రీమింగ్ చేస్తూ వచ్చాడు.

Immadi Ravi

తనపైరసీ కార్యకలాపాల ద్వారా చలనచిత్ర పరిశ్రమకు ఆర్థికంగా, వసూళ్ల పరంగా భారీ నష్టాన్ని కలిగించాడు. ఇతని ప్రధాన లక్ష్యం తక్కువ కాలంలో ఎక్కువగా డబ్బు సంపాదించడమే. అయితే, కొన్ని వర్గాల విశ్లేషణ ప్రకారం, ఇతను “సినిమా సరదా కోసం చేస్తాను” అని చెప్పడం గమనార్హం. అయినా కూడా, ఈ చర్యలు చట్ట విరుద్ధమని పోలీసులు స్పష్టం చేశారు.

ఇమ్మడి రవి(Immadi Ravi) తనను ఎవరూ పట్టుకోలేరని, పోలీసులకు సవాల్ విసిరిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే, హైదరాబాద్ CCS పోలీసులు ఈ సవాలును స్వీకరించి, నెలల తరబడి నిఘా, అంతర్జాతీయ సహకారం, హైటెక్ డిజిటల్ ఫోరెన్సిక్స్ పద్ధతులను ఉపయోగించారు. సుదీర్ఘ దర్యాప్తు తర్వాత, ప్రత్యేక సైబర్ పోలీస్ బృందం ఫ్రాన్స్‌లో రవి ఆచూకీని కనిపెట్టి, నవంబర్ 14, 2025న అతన్ని హైదరాబాద్‌కు తీసుకురాగానే కూకట్‌పల్లి CCS పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్టు చేశారు. ఈ అరెస్టు డిజిటల్ నేరాలను అరికట్టడంలో పోలీసుల సామర్థ్యాన్ని బలపరిచింది.

అరెస్టు తర్వాత, పోలీసులు ఇమ్మడి రవి (Immadi Ravi)పైరసీ నెట్‌వర్క్‌కు సంబంధించిన అత్యంత కీలకమైన ఆర్థిక మరియు డిజిటల్ సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు. రవి యొక్క వివిధ బ్యాంక్ ఖాతాలలో ఉన్న దాదాపు రూ. 3 కోట్లు వరకు పోలీసులు వెంటనే ఫ్రీజ్ చేశారు. పైరసీ కార్యకలాపాల ద్వారా సంపాదించిన ఆదాయ వనరులు, లావాదేవీల రికార్డులు , కుంభకోణానికి సంబంధించిన ఆధారాలను కూడా పోలీసులు సేకరించారు.

‘ఐ బొమ్మ’ పైరసీ వెబ్‌సైట్‌కు సంబంధించిన కీలకమైన సర్వర్లు, డిజిటల్ ఫైళ్లు, తాజా అప్‌లోడ్‌లు, డేటాబేస్ , మొత్తం పైరసీ నెట్‌వర్క్‌లోని వ్యాపార భాగస్వాములు, ఫ్రాంచైజీలు, ఇతర సహకారుల డిజిటల్ ట్రేస్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా, సోషల్ మీడియా గ్రూపులు , ఛానెల్‌ల ద్వారా పైరసీ సినిమాల ప్రమోషన్ , డిస్ట్రిబ్యూషన్‌కి సంబంధించిన వివరాలను కూడా సేకరించారు. ఈ సాక్ష్యాలన్నీ హైటెక్ డిజిటల్ ఫోరెన్సిక్స్ పద్ధతుల్లో లోతుగా పరిశీలించబడుతున్నాయి. ఇది ఈ భారీ పైరసీ నెట్‌వర్క్ వెనుక ఉన్న రహస్యాలను పూర్తి స్థాయిలో బయటపెట్టడంలో కీలకం కానుంది.

సినిమా పరిశ్రమ పైరసీ వలన లక్షల కోట్ల నష్టాన్ని ఎదుర్కొంది. బాక్సాఫీస్ వసూళ్లు దారుణంగా పడిపోయాయి. దీని ప్రభావం కొత్త చిత్రాల నిర్మాణంలో దిశాబద్ధతపై కూడా ప్రతికూలంగా ఉంది. ఇమ్మడి రవిపై భారత చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు ఉంటాయి. పైరసీ సంస్థలను నడిపినందుకు , ఇతనికి 3 నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష, భారీ జరిమానాలు విధించే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం అరెస్టు అయిన రవిని నాంపల్లి కోర్టుకు తరలించారు. ఈ కేసు యొక్క విచారణ ఇంకా కొనసాగుతోంది. పోలీసుల లక్ష్యం కేవలం రవిని అరెస్టు చేయడమే కాదు, ఈ అంతర్జాతీయ పైరసీ నెట్‌వర్క్‌లో భాగమైన ఇతర సహచరులను, ఆర్థిక మూలాలను కూడా పూర్తిగా నిర్మూలించడమే. ఈ కేసు సినిమా పరిశ్రమకు ఒక హెచ్చరికగా నిలిచి, భవిష్యత్తులో పైరసీ నిర్మూలనకు ,సినీ పరిశ్రమ రక్షణకు ప్రభుత్వ, పోలీసు చర్యలు మరింత బలోపేతం అవుతాయని ఆశించొచ్చు. ఇమ్మడి రవి అరెస్టు, సినిమా పైరసీపై అధికారులకు దక్కిన ఒక బలమైన విజయాన్ని సూచిస్తుంది.

మరోవైపు ఐ బొమ్మ’ ద్వారా ఇన్నాళ్లూ ఉచితంగా సినిమాలు చూసిన చాలామంది సామాన్యులు, రవి అరెస్టు పట్ల తమ నిరాశను మరియు అసంతృప్తిని సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరిచారు. ఇకపై కొత్త సినిమాలను ఉచితంగా చూసే అవకాశం కోల్పోయామని కొంతమంది కామెంట్లు చేశారు. రవి అరెస్టుతో అంతర్జాతీయ పైరసీ సామ్రాజ్యం కూలిపోతుందో.. లేక మరో రవి పుట్టుకొచ్చి మళ్లీ సినీ ఇండస్ట్రీకి, పోలీసులకు కొత్త సవాల్ విసురుతాడో చూడాలి మరి.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version