Feed the Need
హైదరాబాద్‌లోని ‘ఫీడ్ ది నీడ్(Feed the Need)’ కమ్యూనిటీ రిఫ్రిజిరేటర్లు ఒకప్పుడు గొప్ప ఉద్దేశంతో మొదలయ్యాయి. ఆకలితో ఉన్న పేదలకు ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో జీహెచ్‌ఎంసీ , ఆపిల్ హోమ్ ఫర్ ఆర్ఫన్ కిడ్స్ సంస్థ సంయుక్తంగా వీటిని ఏర్పాటు చేశాయి. కానీ ప్రస్తుతం, నగరంలోని దాదాపు 35 చోట్ల ఉన్న ఈ రిఫ్రిజిరేటర్లు ఎక్కువగా ఖాళీగా కనిపిస్తున్నాయి. ఒక మంచి ఆలోచన, కానీ ఎందుకు ఆదరణ పొందలేకపోతోంది?
ఒకప్పుడు గొప్ప మానవతావాద ఆలోచనకు చిహ్నంగా నిలిచిన ‘ఫీడ్ ది నీడ్(Feed the Need)’ ఫ్రిడ్జ్ బాక్సులు ఇప్పుడు శిథిలావస్థకు చేరాయి. జూబ్లీ బస్‌స్టాండ్ లాంటి రద్దీ ప్రాంతాల్లో కూడా, తుప్పుపట్టి, లోపల చెత్తా చెదారంలో నిండిన ఈ బాక్సులు చూస్తే ఎవరికైనా బాధ కలుగుతుంది. ఒకప్పుడు ఇవి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి ఒక వేదికగా ఉండేవి. కానీ, ఇంతమంచి ఆలోచన ఎందుకు విఫలమైందన్న ప్రశ్న వినిపిస్తోంది.
ఈ బాక్సుల వైఫల్యానికి ప్రధాన కారణం సరైన నిర్వహణ లేకపోవడమే. జీహెచ్‌ఎంసీ వీటిని ఏర్పాటు చేసినా, వాటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయడం, నిర్వహించడం పట్ల పూర్తిగా నిర్లక్ష్యం చూపించింది. ప్రజలు మంచి ఉద్దేశంతో ఆహారం పెట్టినా అవి పాడవడం, మరీ చల్లగా ఉండటం వంటి పనుల వల్ల వాటిని ఎవరూ ఉపయోగించుకోలేకపోయారు.
ప్రజలలో అవగాహన లోపం..ఈ ఫీడ్ ది నీడ్(Feed the Need) ప్లేసుల గురించి చాలా మందికి తెలియదు. అవి ఎక్కడ ఉన్నాయి, వాటిని ఎలా ఉపయోగించాలి అనే విషయాలపై సరైన ప్రచారం లేదు. చాలామంది వాటిని చూడకపోవడమే కాదు, వాటి ఉద్దేశ్యం గురించి కూడా అవగాహన లేదు. దీనివల్ల ప్రజలు వీటిని ఉపయోగించడం మానేశారు.
నైతిక సమస్యలు, మానసిక అడ్డంకులు…మనుషుల మనస్తత్వాలు కూడా ఈ వైఫల్యానికి ఒక కారణం. కొంతమంది ప్రజలు ఇలాంటి పబ్లిక్ ప్రిడ్జ్‌లలో వస్తువులు పెట్టడానికి సిగ్గు పడొచ్చు లేదా ఇబ్బందిగా భావించవచ్చు. అసలు తాము ఇలా ఇచ్చిన ఆహారాన్ని తింటున్నారా లేదా అక్కడ పెట్టేబదులు తెలిసిన వారికి ఇస్తే మంచిది కదా అన్న ఫీల్ కూడా రావొచ్చు. అలాగే, నిధులు, పర్యవేక్షణ విషయంలో ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఈ కార్యక్రమం ముందుకు సాగలేదు.
‘ఫీడ్ ది నీడ్(Feed the Need)’ మంచి ఆలోచనే. కానీ, సరైన అమలు, పర్యవేక్షణ లేకపోవడం వల్ల విఫలమయ్యాయి. ఈ సమస్యలను సరిదిద్ది, ఈ బాక్సులను తిరిగి ఉపయోగంలోకి తీసుకురాగలిగితే, అవి నిజంగా అవసరంలో ఉన్నవారికి గొప్ప సహాయంగా మారతాయి. ఇది కేవలం ఒక ఆచరణ కాదు, అది మన సమాజంలో మానవత్వానికి నిలువుటద్దం.