Waste Plastic
హైదరాబాద్ మహానగరం విశ్వనగరంగా ఎంతగా ఎదుగుతుందో అంతే వేగంగా.. కాలుష్యానికి నిలయంగా మారుతుంది. అవును పెరుగుతున్న జనాభాలాగే హైదరాబాద్ నలువైపులా ప్లాస్టిక్ వ్యర్థాలు (Waste Plastic) పెరిగిపోతున్నాయి. అవును హైదరాబాద్‌లో రోజూ ఉత్పత్తి చేస్తున్న 8 వేల మెట్రిక్ టన్నుల చెత్తలో 14 శాతం కేవలం ప్లాస్టిక్‌దే అంటే ఈ సీరియస్‌నెస్ అర్ధం చేసుకోవచ్చు.
ఈ ప్లాస్టిక్ బాటిళ్లు, అల్యూమినియం ఫాయిల్స్ రోడ్లపై, నాలాల్లో పేరుకుపోయి నగర సౌందర్యాన్ని, పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాయి. 2025 నాటికి ఈ (waste plastic) ప్లాస్టిక్ వ్యర్థాల సంఖ్య 495 టన్నులకు చేరుకోవచ్చని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఈ భయంకరమైన సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వ సహకారంతో.. ఒక వినూత్నమైన టెక్నాలజీ ముందు తీసుకువస్తున్నారు . రివర్స్ వెండింగ్ మెషీన్స్ (reverse vending machine ) లేదా ప్లాస్టిక్ ష్రెడర్ యంత్రాలను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయాలని, దీనిపై అవగాహన కల్పిస్తున్నారు.
రివర్స్ వెండింగ్ మెషీన్స్ అంటే, ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లు, అల్యూమినియం ఫాయిల్స్, గాజు సీసాలను సేకరించే యంత్రాలు. మీరు ఒక ఖాళీ బాటిల్‌ను ఈ మెషీన్‌లో వేస్తే, అందులోని టెక్నాలజీ ఆ బాటిల్‌ను స్కాన్ చేసి, అది రీసైకిల్ చేయదగినదా కాదా అని గుర్తిస్తుంది. ఆ తర్వాత ఆ బాటిల్‌ను రీసైక్లింగ్ కోసం సిద్ధం చేస్తుంది.
ఈ మెషీన్‌లలో ప్లాస్టిక్ వ్యర్థాలు(plastic waste) వేసిన వారికి పర్యావరణ నిపుణులు క్యాష్‌బ్యాక్ లేదా కూపన్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. రీసైకిల్ చేసిన ప్లాస్టిక్‌ను కొత్త టీషర్ట్‌లు, టోపీలు వంటి వస్తువులను తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఒక కేజీ ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేస్తే దాదాపు 4.9 లీటర్ల నీరు, 2 లీటర్ల ఇంధనం ఆదా అవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
హైదరాబాద్‌లో RVMలు కొత్తవి కావు. 2021లోనే జీహెచ్‌ఎంసీ(GHMC) ఐజీఈఎస్-సీసీఈటీ సంయుక్త ఆధ్వర్యంలో కొన్ని మెషీన్లను ఏర్పాటు చేసింది. చార్మినార్ సర్కిల్‌లో ఒకటి, ఎంజీబీఎస్ వద్ద రెండు, అలాగే కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లలో మరికొన్ని మెషీన్‌లు పెట్టారు. కానీ, ఈ మెషీన్‌ల గురించి ప్రజలకు సరైన అవగాహన లేకపోవడం, సాంకేతిక సమస్యల వల్ల వీటిని ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయలేకపోయారు. అయితే, హైదరాబాద్‌లో ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యను తగ్గించడానికి మరిన్ని RVMలను ఏర్పాటు చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు.
దేశంలోని చాలా నగరాల్లో ఈ RVMలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. చెన్నై, ఢిల్లీ, నోయిడా, మంగళూరు, బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్ వంటి ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు. ప్రజలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడానికి ‘డిపాజిట్ రిటర్న్ స్కీమ్’ వంటి పథకాలను కూడా అమలు చేస్తున్నారు. దీని ద్వారా ఖాళీ బాటిల్‌ను మెషీన్‌లో వేసిన వారికి కూపన్లు, డిస్కౌంట్లు లేదా నగదు రూపంలో ప్రోత్సాహకాలు అందిస్తున్నారు.
Also Read: Dead Economy: డెడ్ ఎకానమీపై మోదీ ఆన్సర్ ఓకే ..మరి వాస్తవ పరిస్థితి ఏంటి?