NATO:వెనక్కి తగ్గిన డొనాల్డ్ ట్రంప్..గ్రీన్‌లాండ్ విషయంలో నాటోతో ఒప్పందం అందుకేనా?

NATO : నాటో తో కుదిరిన కొత్త ఫ్రేమ్ వర్క్ ఒప్పందం ప్రకారం, గ్రీన్‌లాండ్, ఆర్కిటిక్ ప్రాంత భద్రత విషయంలో అమెరికా , నాటో సభ్య దేశాలు కలిసి పనిచేయనున్నాయి

NATO

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , యూరోపియన్ దేశాల మధ్య గ్రీన్‌లాండ్ దీవి విషయంలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రస్తుతానికి సద్దుమణిగాయి. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌లాండ్‌ను అమెరికాకు అప్పగించాలన్న డొనాల్డ్ ట్రంప్ డిమాండ్‌ను యూరప్ దేశాలు వ్యతిరేకించడంతో, దానికి సమాధానంగా ఆయన ఆ దేశాల ఉత్పత్తులపై భారీగా సుంకాలు (Tariffs) విధిస్తానని హెచ్చరించారు.

అయితే, స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో నాటో( NATO) సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో జరిపిన చర్చల తర్వాత ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.

ఫిబ్రవరి 1వ తేదీ నుంచి యూరప్ దేశాలపై విధించాలనుకున్న 10 శాతం సుంకాలను ప్రస్తుతానికి రద్దు చేస్తున్నట్లు ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ అకౌంట్‌లో ప్రకటించారు.

నాటో( NATO)తో కుదిరిన కొత్త ఫ్రేమ్ వర్క్ ఒప్పందం ప్రకారం, గ్రీన్‌లాండ్, ఆర్కిటిక్ ప్రాంత భద్రత విషయంలో అమెరికా , నాటో సభ్య దేశాలు కలిసి పనిచేయనున్నాయి. ఈ ఒప్పందం అమెరికా జాతీయ భద్రతకు ఎంతో కీలకమని ట్రంప్ చెప్పుకొచ్చారు. గ్రీన్‌లాండ్‌పై తనకున్న ఆసక్తిని ఆయన దాచుకోలేదు, కానీ ఆర్థిక యుద్ధం కంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికే ట్రంప్ మొగ్గు చూపారు.

దావోస్ వేదికగా సుమారు 70 నిమిషాల పాటు ప్రసంగించిన ట్రంప్.. అమెరికా ఆర్థికంగా బలపడితేనే ప్రపంచం మొత్తం బాగుంటుందని అన్నారు. గ్రీన్‌లాండ్‌ను రక్షించే శక్తి కేవలం అమెరికాకే ఉందని మరోసారి చెప్పారు. ఈ చర్చల్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ,విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కీలక పాత్ర పోషించనున్నారు.

ప్రస్తుతానికి టారిఫ్ యుద్ధం ముగిసినా, గ్రీన్‌లాండ్‌ను తన వశం చేసుకోవాలన్న ట్రంప్ వ్యూహం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. రానున్న రోజుల్లో ‘గోల్డెన్ డోమ్’ వంటి ప్రాజెక్టుల ద్వారా అమెరికా అక్కడ తన ఉనికిని మరింత పెంచుకోనున్నట్లు తెలుస్తోంది.

NATO

ఎందుకంటే గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ కన్నేయడం వెనుక కేవలం భూభాగంపై వ్యామోహం కాదు.. దాని వెనుక మూడు బలమైన కారణాలు ఉన్నాయి.
మొదటిది భౌగోళిక వ్యూహం– రష్యా, చైనాలకు ఆర్కిటిక్ ప్రాంతంపై పట్టు చిక్కనీకుండా, అమెరికా తన రక్షణ వ్యవస్థను (క్షిపణి రక్షణ కేంద్రాలను) అక్కడ బలోపేతం చేయాలనుకుంటోంది.
రెండోది అపారమైన సంపద- మంచు కింద దాగి ఉన్న బొగ్గు, గ్యాస్, ఇనుము ,అత్యంత అరుదైన ‘రేర్ ఎర్త్’ ఖనిజాలపై ట్రంప్ కన్ను పడింది. గ్రీన్ ఎనర్జీకి ఈ ఖనిజాలు చాలా కీలకం అనే విషయం అమెరికాకు తెలుసు.

మూడోది వాణిజ్య మార్గాలు- గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచు కరుగుతుండటంతో, ఆర్కిటిక్ మీదుగా కొత్త షిప్పింగ్ మార్గాలు ఏర్పడుతున్నాయి. ఈ మార్గాలను తన ఆధీనంలో ఉంచుకోగలిగితే ప్రపంచ వ్యాపారాన్ని అమెరికా శాసించొచ్చు. అందుకే ట్రంప్ దీన్ని ఒక ‘రియల్ ఎస్టేట్ డీల్’ లాగా చూస్తూ, అమెరికాను ప్రపంచంలోనే తిరుగులేని శక్తిగా మార్చాలని ప్లాన్ చేస్తున్నారు.

Free Bus:తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్.. ఉచిత బస్సు కోసం ఆధార్ అక్కరలేదు..

Exit mobile version