AP Government
ప్రజల ఆరోగ్యం, పోషకాహార లోపాన్ని నివారించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం(AP Government)లోని కూటమి ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా పేద ప్రజలకు రాగులు (Ragi) జొన్నలు (Jowar)ను ఉచితంగా సరఫరా చేయాలని నిర్ణయించింది.
ఇప్పుడు చాలామంది ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. ఒకప్పుడు పేదవారి ఆహారంగా చూసిన రాగులు, జొన్నలు వంటి సిరి ధాన్యాలు ప్రస్తుతం వాటిలోని అధిక పోషక విలువలు, పీచు పదార్థం (Fiber), తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (Diabetic Friendly) కారణంగా పట్టణ ప్రాంతాల్లో కూడా విపరీతంగా వాడుతున్నారు.
ఈ ధాన్యాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, పేద ప్రజలందరికీ ఈ పోషక బలాన్ని అందించడానికి ప్రభుత్వం ఈ (AP Government)నిర్ణయం తీసుకుంది. గతంలో, టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ తృణధాన్యాల పంపిణీ జరిగింది. ఇప్పుడు తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో, ఈ ఆరోగ్యకరమైన విధానాన్ని మరింత పటిష్టంగా కొనసాగించాలని నిర్ణయించింది.
సాధారణంగా, జాతీయ ఆహార భద్రతా పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) ద్వారా రాష్ట్రాలకు పీడీఎస్ అవసరాల కోసం రాగులు, జొన్నలను కేటాయిస్తుంది. అయితే, ప్రస్తుతం కేంద్రం నుంచి కేటాయింపులు లేకపోవడంతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ఈ తృణధాన్యాలను టెండర్ల ప్రక్రియ ద్వారా సేకరించి, కార్డుదారులకు ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా సరఫరా చేస్తోంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై కొంత ఆర్థిక భారం పడుతున్నా, ప్రజారోగ్యమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది.
ఈ పోషక ధాన్యాల పంపిణీని ప్రభుత్వం దశలవారీగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరిస్తోంది.ఇప్పటికే ఈ పథకం రాయలసీమ ప్రాంతంలో విజయవంతంగా అమలు అవుతోంది. అనంతపురం, కర్నూలు, శ్రీసత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, కడప, నంద్యాల జిల్లాల్లో గత ఏప్రిల్ నుంచే బియ్యంతో పాటు రాగులు, జొన్నలు పంపిణీ చేస్తున్నారు.
తాజాగా, ఈ డిసెంబర్ నెల నుంచి ఉత్తర కోస్తా ప్రాంతంలోని ఆరు జిల్లాలకు (విశాఖ, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు) రాగుల పంపిణీని ప్రారంభించింది.అదేవిధంగా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా జొన్నల పంపిణీని మొదలుపెట్టింది.
ఈ పథకంలో భాగంగా, కార్డుదారులకు ఇచ్చే రేషన్ బియ్యంలో కొంత భాగాన్ని తృణధాన్యాలతో భర్తీ చేసే అవకాశం కల్పించారు.
ప్రస్తుతం ప్రతి మనిషికి ఐదు కేజీల చొప్పున ఉచితంగా బియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ(AP Government) చేస్తోంది. ఈ రేషన్‌లో, బియ్యానికి బదులుగా గరిష్ఠంగా మూడు కేజీల వరకు రాగులు లేదా జొన్నలను తీసుకోవచ్చు.
ఉదాహరణకు, ఒక కుటుంబం నెలకు 20 కేజీల రేషన్ బియ్యం తీసుకుంటున్నట్లయితే, వారికి రెండు కేజీల రాగులు కావాలంటే, 18 కేజీల బియ్యంతో పాటు రెండు కేజీల రాగులను అందిస్తారు.
ఈ విధంగా, కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా, నాణ్యమైన పోషక విలువలున్న ఆహారాన్ని పేద ప్రజల ఇళ్ల వద్దకే తీసుకువచ్చి, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించే దిశగా కీలక అడుగు వేసింది.
