Intermediate
ఏపీ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఇంటర్ (Intermediate)రిజల్ట్ సమయం ఆసన్నమైంది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ప్రథమ , ద్వితీయ సంవత్సర ఫలితాలను రిలీజ్ చేయడానికి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (BIEAP) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
రేపు అంటే ఏప్రిల్ 15వ తేదీ బుధవారం ఉదయం 10.31 గంటలకు అమరావతిలో ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అఫీషియల్‌గా విడుదల చేయనున్నారు. గతంలో ఏప్రిల్ 12న ఫలితాలు వస్తాయని ప్రచారం జరిగినా కూడా, మార్కుల నమోదులో ఎటువంటి పొరపాట్లు జరగకూడదనే ఉద్దేశంతో క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత ఏప్రిల్ 15న మనమిత్ర యాప్ ద్వారా ఫలితాలను వెల్లడించబోతున్నారు.
ఈ ఏడాది ఏపీ వ్యాప్తంగా ఇంటర్ (Intermediate)పరీక్షల కోసం సుమారు 10,52,221 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ప్రథమ సంవత్సరానికి సంబంధించి దాదాపు 5,17,617 మంది, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 5,34,604 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఫలితాల విడుదల తర్వాత విద్యార్థులు తమ మార్కుల లిస్టును అధికారిక వెబ్‌సైట్లలో తమ హాల్ టికెట్ నంబర్ , పుట్టిన తేదీని నమోదు చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
స్టూడెంట్స్ తమ ఫలితాలను bie.ap.gov.in లేదా resultsbie.ap.gov.in వంటి అఫీషియల్ వెబ్‌సైట్లతో పాటు, మనబడి వంటి ఇతర ప్రైవేట్ పోర్టల్స్‌లో కూడా చూసుకోవచ్చు. ఒకేసారి లక్షలాది మంది విద్యార్థులు వెబ్‌సైట్‌ను సందర్శించడం వల్ల సర్వర్ సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో, 9552300009 మొబైల్ నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ (SMS) చేయడం , డిజీ లాకర్ (DigiLocker) వంటి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కూడా రిజల్ట్‌ను పొందడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
రిజల్ట్‌లో కనీసం 35 శాతం మార్కులు సాధించిన వారు ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. ఒకవేళ ఆశించిన మార్కులు రాకపోతే రీ-కౌంటింగ్ లేదా రీ-వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ కూడా బోర్డు కల్పించబోతోంది.
బుధవారం రిలీజయ్యే ఫలితాల్లో జిల్లాల వారీగా ఉత్తీర్ణత శాతం, బాలబాలికల ప్రతిభ వంటి పూర్తి గణాంకాలను మంత్రి లోకేష్ రిలీజ్ చేస్తారు. రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్న స్టూడెంట్స్ ఎవరూ కూడా ఒత్తిడికి గురి కాకుండా ఉండాలని, మార్కులు ఎలా వచ్చినా, ఎంత వచ్చినా డిజప్పాయింట్ అవ్వొద్దని విద్యావేత్తలు సూచిస్తున్నారు.
