AP Municipal Elections Results
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పోరు ఫలితాలతో(AP Municipal Elections Results) .. రాబోయే 2029 సార్వత్రిక సమరానికి ముందస్తు ట్రైలర్‌ను చూపించేశాయా అన్న టాక్ నడుస్తోంది. అంతేకాదు ఒకప్పుడు ఉమ్మడి రాయలసీమ వ్యాప్తంగా వైసీపీ కంచుకోటలు ఒక్కొక్కటిగా బద్దలవుతున్నాయా అనే సందేహాలకు ఈ ఫలితాలు మరింత ఊతమిస్తున్నాయి.
పల్లెల్లో కుల, వర్గ సమీకరణలు, స్థానిక మొక్కుబడి గొడవలు వర్కవుట్ అయినా కూడా, పట్టణ ఓటర్ల మైండ్‌సెట్ మాత్రం ఎప్పుడూ ట్రెండ్ సెట్టర్‌గానే ఉంటుందనేది ఈ ఫలితాలు ప్రూవ్ చేశాయి. ఆ ట్రెండ్‌ను పట్టుకోవడంలో టీడీపీ,జనసేన, బీజేపీ కూటమి పూర్తి విజయం సాధించిందని పొలిటికల్ సర్కిల్స్‌లో గట్టి చర్చ నడుస్తోంది.
గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సెంటిమెంట్లను ఇప్పుడు పక్కన పెడితే, పట్టణాల్లో ఇచ్చే తీర్పు మొత్తం ఏపీ ఎటువైపు ఆలోచిస్తోందో చెప్పడానికి ఒక పక్కా దిక్సూచి వంటిదేనని విశ్లేషకులు గట్టిగా చెబుతున్నారు. ఆ లెక్కన చూస్తే ఇప్పుడు వచ్చిన ఫలితాలు వైసీపీకి ఒక రకమైన హెచ్చరిక లాంటివేనని అంటున్నారు.
ఒకప్పుడు వైసీపీకి తిరుగులేని అడ్డాగా, ప్రత్యర్థులకు కనీసం నామినేషన్లు వేసే ధైర్యం కూడా లేని ప్రాంతంగా పేరున్న రాయలసీమ గడ్డపై ఈసారి కూటమి సేన జెండా గట్టిగానే పాతేసింది. బేతంచెర్ల, నందికొట్కూరు వంటి ఒకటి రెండు చోట్ల స్థానిక నాయకుల పట్టు వల్ల వైసీపీ కాస్త పరువు నిలుపుకున్నా, మిగిలిన ఉమ్మడి కర్నూలు, చిత్తూరు, కడప జిల్లాల్లో కూటమి క్రియేట్ చేసిన సునామీ మామూలుగా లేదు.
అనంతపురంలో స్థానిక ఎమ్మెల్యేపై ఉన్న చిన్నపాటి వ్యతిరేకత అలాగే టికెట్ల కేటాయింపులు వంటి ఈక్వేషన్స్ వల్ల కొద్దిపాటి డ్యామేజ్ జరిగినా, మిగిలిన ప్రధాన ప్రాంతాల్లో మాత్రం తమ్ముళ్ల దూకుడుకు తిరుగులేకుండా పోయింది.
చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్లలో పరిస్థితి ఇంకా పూర్తిగా మారిపోయింది. తిరుపతి వంటి కీలకమైన సిటీలో కేవలం 45 శాతం పోలింగ్ నమోదైనా, ఏకంగా 65 వేల భారీ మెజారిటీ సాధించడం కూటమి సైనికులకు ఊహించని ఎనర్జీని తెచ్చిపెట్టిందనేది మాత్రం నిజం. ఇక కడపలో వైసీపీ సాధించే ఒకే ఒక్క ఏకపక్ష విజయాల శకానికి చెక్ పడినట్లే కనిపిస్తోంది.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో 164 సీట్లతో రికార్డు విజయాన్ని సాధించిన కూటమికి, ఈ మున్సిపల్ ఎన్నికల విజయం(AP Municipal Elections Results) సరికొత్త బూస్టర్ డోస్ ఇచ్చిందనే చెప్పొచ్చు. గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకూ తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న కూటమి నేతలు, పొత్తు ధర్మాన్ని ఇలాగే కాపాడుకుంటే మాత్రం 2029లోనూ సేమ్ రిజల్ట్ రిపీట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోందని విశ్లేషకులు గట్టిగా చెబుతున్నారు.
ఓటింగ్ శాతంలో అక్కడక్కడ మార్పులు వచ్చినా, సంపూర్ణ ఆధిపత్యం విషయంలో మాత్రం కూటమిని ఢీకొట్టే బలం వైసీపీకి ప్రస్తుతం లేదనేది తేలిపోయింది. దీనికి తోడు రాబోయే రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) జరిగి అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరిగితే కనుక , గ్రౌండ్ లెవెల్ ఆర్గనైజేషనల్ బలం ఉన్న కూటమికి అది ప్లస్‌గా మారి మరిన్ని సీట్లు తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా పెరిగిన స్థానాల్లో తమ అభివృద్ధి సంక్షేమాలను సమర్థవంతంగా తీసుకెళ్లగలిగితే చాలు ఇక కూటమి తిరుగులేని శక్తిగా మారుతుంది.
మొత్తానికి విజయవాడ నుంచి రాయలసీమ వరకూ మారిన గాలి వైసీపీ అధినాయకత్వానికి పెద్ద గండం వంటిదే అని విశ్లేషకులు చెబుతున్నారు. అధికారంలోకి రావడం పక్కన పెడితే.. కనీసం పోటీ ఇచ్చే స్థాయికి వెళ్లాలన్నా ఆ పార్టీ తన ప్రాధాన్యతలను, వ్యవహార శైలిని పూర్తిగా మార్చుకోవాల్సి ఉంటుందన్న విషయాన్ని హైకమాండ్ ఒప్పుకోవాలి. ఎందుకంటే పునాదులు కదులుతున్న సీమలో మళ్లీ జెండా పాతాలంటే మాత్రం చాలా సమయం, కష్టం రెండూ కావాలి.
మరోవైపు మున్సిపల్ గెలుపును(AP Municipal Elections Results) చూసి కూటమి పార్టీల నేతలు సంబరపడిపోకుండా.. తమ మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలను పక్కన పెట్టి, ఐక్యతను కాపాడుకుంటూ ప్రజల్లో నమ్మకం పెంచగలిగితేనే 2029లో మళ్లీ ఆ రికార్డు విజయభేరి సాధ్యమవుతుంది. విజయం ఎవరి ఖాతాలో వారు వేసుకుని భుజాలు ఎగరేసేకంటే.. ఉమ్మడిగా ఉండటం వల్లే మరో విక్టరీని సాధించామన్న విషయాన్ని తెలుసుకుని ముందుకు కలిసికట్టుగా సాగాల్సిన అవసరం ఉంది.
Stubbornness : ఎన్నిసార్లు చెప్పినా కొందరు ఎందుకు మారరు? వారి మైండ్‌లో జరిగే సైకాలజీ ఏంటి?
