CIBIL score: సిబిల్ స్కోర్ ఎందుకంత ఇంపార్టెంటో తెలుసా?

CIBIL score: సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే లోన్ దొరకడం కష్టం, అదే ఎక్కువగా ఉంటే రుణాలకు రెడ్ కార్పెట్ వేసినట్లే.

CIBIL score

కొత్త ఇల్లు కొనాలని, కారు తీసుకోవాలని కలలు కంటున్నారా? అయితే మీ ఆ కలకు మొదటి అడుగు మీ సిబిల్ స్కోర్. మీరు బ్యాంక్‌కు వెళ్లి లోన్ అడిగినప్పుడు, వారు మొదట చూసేది మీ సిబిల్ స్కోర్‌(CIBIL score)నే. ఇది మీ ఆర్థిక ప్రవర్తనను చెప్పే ఒక నివేదిక. ఇది మీ బ్యాంకింగ్ చరిత్రకు ఒక అద్దం లాంటిది. సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే లోన్ దొరకడం కష్టం, అదే ఎక్కువగా ఉంటే రుణాలకు రెడ్ కార్పెట్ వేసినట్లే.అందుకే సిబిల్ స్కోర్ పెంచుకోవాలని అంటున్నారు నిపుణులు.

క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఇండియా) లిమిటెడ్ ఇచ్చే మూడు అంకెల సంఖ్యే సిబిల్ స్కోర్(CIBIL score). దీని విలువ 300 నుంచి 900 వరకు ఉంటుంది. సుమారు 750 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ ఉన్నవారు ఆర్థికంగా చాలా బాధ్యతాయుతంగా ఉన్నారని బ్యాంకులు భావిస్తాయి. ఎందుకంటే, అలాంటి వ్యక్తులు రుణాలను సకాలంలో తిరిగి చెల్లిస్తారని, బ్యాంక్‌కు ఎలాంటి రిస్క్ ఉండదని వాటికి ఒక నమ్మకం. ఈ స్కోర్ ఉన్నవారికి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పిలిచిమరీ రుణాలు, క్రెడిట్ కార్డులు ఇస్తాయి.

అయితే, మీ స్కోర్ 600-699 మధ్య ఉంటే అది ఒక హెచ్చరికలాంటిది. మీరు అప్పులు సకాలంలో చెల్లించడానికి ఇబ్బంది పడుతున్నారని అర్థం. ఇలాంటి సందర్భంలో లోన్ దొరికినా, బ్యాంకులు ఎక్కువ వడ్డీ రేటు, కఠినమైన నిబంధనలను విధించే అవకాశం ఉంటుంది. ఇక, మీ స్కోర్ 350-599 మధ్య ఉంటే అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఈ స్కోర్ ఉన్నవారు అప్పులు, క్రెడిట్ బిల్లులు సమయానికి చెల్లించడంలో పూర్తిగా విఫలమయ్యారని భావిస్తారు. ఇలాంటి వారికి బ్యాంకులు రుణాలు లేదా క్రెడిట్ కార్డులు ఇవ్వడానికి అస్సలు ఇష్టపడవు.

మరి సిబిల్ స్కోర్‌(CIBIL score)ను ఎలా పెంచుకోవాలి అంటే ఇది చాలా ఈజీ. ఈ కింది కొన్ని ముఖ్యమైన విషయాలను మీరు గుర్తుంచుకుంటే చాలు.

సమయానికి చెల్లించడం.. మీరు తీసుకున్న ఏ లోన్ అయినా, క్రెడిట్ కార్డు బిల్ అయినా సమయానికి చెల్లించడం చాలా ముఖ్యం. ఇది సిబిల్ స్కోర్‌ను పెంచుకోవడానికి అత్యంత కీలకమైన మార్గం. మీ స్కోర్‌లో 30 శాతం మార్కులు దీనిపైనే ఆధారపడి ఉంటాయి.

CIBIL score

రుణ వినియోగ నిష్పత్తిని (CUR) తగ్గించడం.. మీకు లభించిన క్రెడిట్ లిమిట్‌లో మీరు ఎంత వాడుకుంటున్నారో తెలిపే శాతమే ఇది. ఉదాహరణకు, మీ క్రెడిట్ కార్డు లిమిట్ రూ. 1 లక్ష అయితే, మీరు అందులో 30% అంటే రూ. 30,000 మించకుండా వాడుకోవడం చాలా మంచిది. దీనివల్ల మీరు అప్పులపై పూర్తిగా ఆధారపడలేదని బ్యాంకులకు తెలుస్తుంది.

పాత క్రెడిట్ కార్డులను క్లోజ్ చేయకండి.. మీరు ఎక్కువ కాలం వాడిన పాత క్రెడిట్ కార్డులను క్లోజ్ చేయకండి. వాటిలో క్రెడిట్ లిమిట్(Credit Score) ఎక్కువగా ఉండటం వల్ల మీ ఓవరాల్ క్రెడిట్ వినియోగ నిష్పత్తి తగ్గుతుంది.

ఈ సూచనలు పాటించడం ద్వారా మీ సిబిల్ స్కోర్ మెరుగుపడుతుంది. అయితే మంచి సిబిల్ స్కోర్(CIBIL Score) కేవలం లోన్ తీసుకోవడానికి మాత్రమే కాదు, మీ ఆర్థిక భవిష్యత్తుకు కూడా ఒక బలమైన పునాది అని గుర్తుపెట్టుకోవాలి. .

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Exit mobile version