Tesla : టెస్లా ఆటో పైలట్ సేఫ్ కాదా? కోర్టు ఇచ్చిన తీర్పుతో ఏం తేలింది?

Tesla : యువతి ప్రాణం తీసినా... ఆటోపైలట్ తప్పుకాదని అంటున్న టెస్లా. మరి తప్పెవరిది?

Tesla

టెక్నాలజీనే “దేవుడు” అనే నమ్మకంతో అడుగులు ముందుకు వేస్తున్న యుగంలో… అదే టెక్నాలజీ(technology) మృత్యువు తెచ్చిపెడితే? అదే ఇప్పుడు అమెరికాలో జరిగింది. ప్రపంచంలోని అత్యాధునిక ఎలక్ట్రిక్ కార్లు తయారు చేసే టెస్లా(Tesla) కంపెనీకి చెందిన ఓ కారు .. ఆటోపైలట్‌లో నడుస్తూ ఓ యువతి ప్రాణం తీసింది. దాదాపు 5 ఏళ్లపాటు న్యాయపోరాటం చేసిన ఆమె కుటుంబానికి ఫ్లోరిడా కోర్టు ఇప్పుడొక భారీ తీర్పు ఇచ్చింది.

ప్రపంచంలోనే ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా (tesla) కు ఫ్లోరిడా కోర్టు(Florida court) భారీ జరిమానా విధించింది. 2019లో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో, టెస్లా కారులోని ‘ఆటోపైలట్’ వ్యవస్థలో ఉన్న లోపమే కారణమని కోర్టు నిర్ధారించింది.

ఈ ప్రమాదం 2019లో ఫ్లోరిడాలోని కీ లార్గోలో జరిగింది. జార్జ్ మెక్‌గీ అనే వ్యక్తి తన టెస్లా కారును ఆటోపైలట్ మోడ్‌లో నడుపుతున్నాడు. ఈ సమయంలో అతని ఫోన్ కింద పడిపోవడంతో దానిని తీసుకోడానికి కిందకు వంగాడు.

tesla-electric-car

కారు ఆటోపైలట్‌లో ఉందని భావించిన మెక్‌గీ, రోడ్డుపై తగిన శ్రద్ధ పెట్టలేదు. ఆ సమయంలో కారు ఒక్కసారిగా అదుపు తప్పి, రోడ్డు పక్కన పార్క్ చేసిన వాహనాన్ని ఢీ కొట్టడంతో పాటు, ఇద్దరు వ్యక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 22 ఏళ్ల యువతి అక్కడికక్కడే చనిపోగా, ఆమె స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. మృతి చెందిన యువతి మృతదేహం దాదాపు 75 అడుగుల దూరం ఎగిరి పడిందని సాక్షులు కోర్టుకు తెలిపారు.

అప్పటి నుంచి మొదలైన ఈ కేసుపై తాజాగా కోర్టు తీర్పు వెలువరించింది. బాధితుల కుటుంబాలకు $329 మిలియన్ పరిహారం ఇవ్వాలన్న తీర్పు ఇచ్చింది. ఇందులో $242 మిలియన్‌((సుమారు ₹2,100 కోట్లు)ను టెస్లా భరించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని డ్రైవర్ మెక్‌గీ భరించాల్సి ఉంటుంది. ఇది టెస్లా చరిత్రలో ఇప్పటిదాకా వచ్చిన అతిపెద్ద పరిహారం తీర్పుల్లో ఒకటి.

ఈ కేసు యథార్థంగా సాంకేతిక పరిజ్ఞానానికి ఒక వార్నింగ్ సిగ్నల్ లాంటిదే. ఆటోపైలట్‌ వ్యవస్థపై టెస్లా చాలా కాలంగా మార్కెటింగ్ చేస్తోంది. కానీ ఇప్పటిదాకా వచ్చిన అనేక రిపోర్ట్స్ ఈ వ్యవస్థ పూర్తి స్థాయిలో సేఫ్ అనే విషయాన్ని కచ్చితంగా రుజువు చేయలేకపోయాయి.

అయితే, ఈ తీర్పుపై టెస్లా కంపెనీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కంపెనీ తరపు న్యాయవాదులు, ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని వాదించారు. ఈ తీర్పుపై తాము అప్పీల్ చేస్తామని టెస్లా స్పష్టం చేసింది.

టెస్లా ఆటోపైలట్ వల్ల జరిగిన ఘటన ఇదే మొదటి సారి కాదు. 2016, ఫ్లోరిడా: జోషువా బ్రౌన్ అనే వ్యక్తి టెస్లా మోడల్ S కారును ఆటోపైలట్‌లో నడుపుతున్నప్పుడు ఓ ట్రక్కు కిందకి దూసుకెళ్లాడు. ఆయన అక్కడికక్కడే మరణించాడు. ఇది టెస్లా ఆటోపైలట్‌పై మొదటి కేసుగా మారింది.

2018, కాలిఫోర్నియా: ఇంజనీర్ అయిన వాల్టర్ హాంగ్ టెస్లా మోడల్ X నడుపుతుండగా ఆటోపైలట్ తప్పుదారి పట్టి హైవే డివైడర్ పైకి దూసుకెళ్లింది. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే 2021, టెక్సాస్ లో టెస్లా కారు ఓ చెట్టును ఢీకొట్టి దగ్ధమవగా, ఇద్దరు ప్రయాణికులు అగ్నిలో కాలిపోయారు. డ్రైవింగ్ సీట్ ఖాళీగా ఉందని విచారణలో తేలింది. అంటే ఆటోపైలట్‌లోనే నడుస్తున్న కారుగా భావించారు.

tesla-auto-pilot

ఈ ఘటనలన్నీ చూస్తే… ఆటోపైలట్‌ను టోటల్ గా సేఫ్టీ వ్యవస్థగా చూస్తే పెద్ద అపాయం అన్నట్టే లెక్క . అందుకే టెస్లా తరఫున ఎలాన్ మస్క్ స్మార్ట్ మార్కెటింగ్‌తో ప్రచారం చేసినా… కోర్టులు, డిటెక్టివ్ సంస్థలు మాత్రం ఇంకా చాలా అనుమానాలతోనే చూస్తున్నాయి.

Also Read: Telangana: సీఎం ఢిల్లీ టూర్ చుట్టూనే బీఆర్ఎస్ రాజకీయాలు.. ఎందుకిలా?

 

Exit mobile version