PF wage
ప్రైవేట్ , చిన్న ఉద్యోగాలు చేసే వారికి కేంద్ర ప్రభుత్వం అతి త్వరలోనే ఒక శుభవార్త చెప్పే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఈపీఎఫ్‌వో (EPFO) నిబంధనల ప్రకారం ఉన్న గరిష్ట వేతన పరిమితి రూ. 15,000 మార్చాలని సుప్రీంకోర్టు గట్టిగా ఆదేశించింది. 11 ఏళ్లుగా ఈ పరిమితిలో ఎలాంటి మార్పులు చేయకపోవడం వల్ల లక్షలాది మంది చిరుద్యోగులు పీఎఫ్ ప్రయోజనాలకు దూరమవుతున్నారని కోర్టు అసహనం వ్యక్తం చేసింది.
దీనిపై నాలుగు నెలల్లోగా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించింది. దీంతో 4 నెలలలోనే కేంద్రం ఏదొక నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం బేసిక్ జీతం 15 వేల లోపు ఉన్నవారికి మాత్రమే పీఎఫ్ తప్పనిసరి, అంతకంటే ఎక్కువ ఉన్నవారికి అది ఆప్షనల్ గా ఉంది. దీనివల్ల చాలా మందికి ఆర్థిక భద్రత కరువవుతోంది.
ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం, కేంద్ర ప్రభుత్వం ఈ వేతన పరిమితిని రూ. 15,000 నుంచి నేరుగా రూ. 30,000 కు పెంచే దిశగా ఆలోచన చేస్తోంది. ఒకవేళ ఇదే గనుక జరిగితే, ముప్పై వేల లోపు బేసిక్ శాలరీ ఉన్న ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా పీఎఫ్ , పెన్షన్ సౌకర్యం లభిస్తుంది. 2014లో ఈ పరిమితిని రూ. 6,000 నుంచి రూ. 15,000 కు పెంచారు, ఆ తర్వాత కాలానుగుణంగా మార్పులు చేయలేదు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం , జీవన వ్యయాలను బట్టి ఈ మార్పు అవసరమని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇప్పుడు కేంద్రం కచ్చితంగా స్పందించాల్సి ఉంటుంది, దీని ద్వారా కోట్లాది మంది ఉద్యోగులకు భవిష్యత్తులో మంచి ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది.
నిజానికి భారతదేశంలో సామాన్య మధ్యతరగతి ఉద్యోగికి ఉన్న ఏకైక ఆర్థిక భరోసా పీఎఫ్ (Provident Fund) అన్నది తెలిసిందే. అయితే, పీఎఫ్ గరిష్ట వేతన పరిమితిని రూ. 15,000 మార్చాలని ఎప్పటి నుంచో డిమాండ్లు ఉన్నా.. కేంద్రం మాత్రం మౌనం వహిస్తూనే వచ్చింది. చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని, చిన్న ఉద్యోగులు పీఎఫ్ ప్రయోజనాలు పొందకపోవడం దారుణమని వ్యాఖ్యానించడం గమనార్హం.
ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే.. కోర్టు మొట్టికాయలు వేస్తే కానీ కేంద్ర ప్రభుత్వానికి సామాన్యుడి కష్టం కనిపించదా? కార్పొరేట్ సంస్థల లాభాల కోసం రాయితీలు ఇచ్చే ప్రభుత్వం, కోట్లాది మంది ఉద్యోగుల భవిష్యత్తుకు సంబంధించిన ఈ నిర్ణయాన్ని ఎందుకు నాన్చుతోంది అనే.
నిజానికి పీఎఫ్ పరిమితిని పెంచడం(PF wage) వల్ల కంపెనీలపై ఆర్థిక భారం పడుతుంది. ప్రతి ఉద్యోగి జీతంలో కంపెనీ తన వంతుగా 12 శాతం జమ చేయాల్సి ఉంటుంది. వేతన పరిమితి రూ. 15,000 నుంచి రూ. 30,000 కు పెంచితే, కార్పొరేట్ సంస్థలు చెల్లించాల్సిన మొత్తం కూడా డబుల్ అవుతుంది. బహుశా అందుకే కార్పొరేట్లకు పెద్దపీట వేసే క్రమంలో ఉద్యోగుల ప్రయోజనాలను ప్రభుత్వం వెనక్కి నెట్టిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
2014లో చివరిసారిగా పెంచిన పీఎఫ్ లిమిట్(PF wage), ఆ తర్వాత పెరిగిన ధరలు, జీతాలను బట్టి చూస్తే ఎప్పుడో పెరగాల్సింది. కానీ ప్రభుత్వం కేవలం ‘స్టేక్ హోల్డర్ల సంప్రదింపులు’ పేరుతో కాలయాపన చేస్తూ ఇన్నాళ్లూ లాగుతూ వచ్చింది. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు 4 నెలల డెడ్ లైన్ విధించడంతో కేంద్రం ఉలిక్కిపడక తప్పలేదు.
ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పీఎఫ్ విషయంలో ఉండే తేడాను కూడా మనం గమనించాలి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణంగా జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) , కొత్తగా జాయిన్ అయిన వారికి నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) అమలవుతుంది. వీరికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే కొన్ని ఎక్స్‌ట్రా ప్రయోజనాలు , వడ్డీ రేట్లలో మార్పులు ఉంటాయి.
కానీ రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత నిబంధనల ప్రకారమే ఈ జీపీఎఫ్ నిర్వహిస్తాయి. పీఎఫ్ విషయంలో కేంద్రం ఇచ్చే మార్గదర్శకాలను రాష్ట్రాలు అనుసరించినా.. నిధుల కేటాయింపు ,విత్‌డ్రాయల్ నిబంధనలలో ఆయా రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను బట్టి మార్పులు ఉంటాయి. ఈ తేడాల వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే కేంద్ర ఉద్యోగులకు పెన్షన్ ,రిటైర్మెంట్ బెనిఫిట్స్ మెరుగ్గా ఉంటుంది.
మరోవైపు ఈ మొత్తం వివాదంలో ఒక విషయం స్పష్టమవుతోంది. సామాన్యుడి గొంతు కంటే కార్పొరేట్ కంపెనీల ఒత్తిడికే..కేంద్ర ప్రభుత్వం ఎక్కువ విలువ ఇస్తోందన్న ఆవేదన ఉద్యోగ వర్గాల్లో నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో రానున్న నాలుగు నెలల్లో కేంద్రం తీసుకునే నిర్ణయం పారదర్శకంగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. ముఖ్యంగా వేతన పరిమితిని రూ. 30,000 కు పెంచడం వల్ల కోటి మందికి పైగా కొత్త ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇకనైనా కార్పొరేట్ ఆలోచనల నుంచి బయటకు వచ్చి, దేశ నిర్మాణంలో కీలకంగా ఉంటున్న కార్మికులు, ఉద్యోగుల భవిష్యత్తు గురించి ఆలోచిస్తుందో లేదో వేచి చూడాలి మరి.
Sankranthi travel : సంక్రాంతి ప్రయాణం ఇక కూల్ .. లింగంపల్లి, సికింద్రాబాద్ వెళ్లాల్సిన పనేలేదు
