Route :సంక్రాంతికి సొంత వాహనంలో ఊరెళ్తారా? అయితే ఈ రూట్‌లో మీకు తిప్పలు తప్పవు

Route: ప్రతి ఏటా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (NH-65) మీద కనిపించే ట్రాఫిక్ రద్దీ ఈసారి మరింత పెరుగుతుందన్న వార్త ప్రయాణికులను కలవరపెడుతోంది.

Route

తెలుగువారి పెద్ద పండగ సంక్రాంతి మరికొద్ది రోజుల్లోనే వస్తోంది. ఊరు కాని ఊర్లో బతుకుదెరువు కోసం ఉంటున్న వారంతా కన్నవారిని, కట్టుకున్నవారిని చూడటానికి సొంతూళ్లకు బయలుదేరే సమయం వచ్చేస్తోంది. అయితే, ప్రతి ఏటా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (NH-65-Route) మీద కనిపించే ట్రాఫిక్ రద్దీ ఈసారి మరింత పెరుగుతుందన్న వార్త ప్రయాణికులను కలవరపెడుతోంది.

అయితే పండగ పూట సొంతూరికి వెళ్లడం సంతోషాన్ని ఇవ్వాలి కానీ, గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోతామన్న భయం వెంటాడుతుంది. రెండేళ్లుగా సాగుతున్న రహదారి మరమ్మతులు ఇప్పటికీ పూర్తి కాకపోవడమే దీనికి ప్రధాన కారణం..!

గత సంక్రాంతి సమయంలో పంతంగి టోల్‌ప్లాజా మీదుగా(Route) ఏకంగా 84,262 వాహనాలు రాకపోకలు సాగించాయి. సాధారణ రోజుల్లో 40 వేల లోపు ఉండే ఈ వాహనాల సంఖ్య, పండగ వేళ రెట్టింపు అవుతుందన్న విషయం తెలిసిందే. ఇంత భారీ స్థాయిలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నప్పుడు రహదారులు అద్దంలా ఉండాలి. కానీ, పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.

చౌటుప్పల్ నుంచి విజయవాడ వరకు ఉన్న 17 ‘బ్లాక్ స్పాట్స్’ (ప్రమాదకర ప్రాంతాలు) వద్ద చేపట్టిన పనులు ఇంకా నత్తనడకన సాగుతున్నాయి. సుమారు 300 కోట్ల రూపాయల వ్యయంతో ఫ్లైఓవర్లు, అండర్ పాస్ వంతెనలు ప్రారంభించినా, సగం చోట్ల పనులు పునాది దశలోనే ఉన్నాయి.

ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో ఉన్న 16 బ్లాక్ స్పాట్ల(Route ) వద్ద పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. చౌటుప్పల్ ఆర్టీసీ బస్టాండ్, నారాయణపురం, వలిగొండ రోడ్డు కూడళ్లలో వాహనాలు ముందుకు కదలాలంటేనే కష్టంగా మారుతోంది. ఇక చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద అండర్ పాస్ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఇక్కడ అరకొరగా పోసిన మట్టి కుప్పల వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడినప్పుడు పోలీసులు వాహనాలను మునుగోడు మీదుగా మళ్లిస్తున్నారు. ఇది ప్రయాణికులకు అదనపు భారంగా మారుతోంది.

Route

సూర్యాపేట, కోదాడ, మునగాల, కట్టంగూరు వంటి ప్రధాన కూడళ్లలో కూడా పనులు ఇంకా పూర్తి కాలేదు. అయితే ఈసారి కురిసిన భారీ వర్షాల వల్ల పనులు ఆలస్యమయ్యాయని జాతీయ రహదారుల సంస్థ (NHAI) అధికారులు చెప్తున్నా, ప్రయాణికులు మాత్రం ఈ సమాధానంతో సంతృప్తి చెందడం లేదు.

చౌటుప్పల్ ఫ్లైఓవర్ అయితే జూన్ నాటికి పూర్తి చేస్తామని అధికారులు అంటున్నారు, దీంతో ఈ సంక్రాంతికి మాత్రం తమకు ట్రాఫిక్ కష్టాలు తప్పేలా లేవని ప్రయాణికులు వాపోతున్నారు . నార్కట్ పల్లి వద్ద వాహనాలు మూడు వైపులా (విజయవాడ, ఖమ్మం, మిర్యాలగూడ) చీలిపోవాల్సి ఉంటుంది. ఆ పాయింట్ దగ్గరకు వరకు వచ్చేసరికి వాహనదారులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు.

పండగ రద్దీని తట్టుకోవడానికి అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఆశాజనకంగా లేదు. వీలైతే పండగకు రెండు రోజుల ముందే లేదా రాత్రి వేళల్లో ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.

గూగుల్ మ్యాప్స్ లేదా రేడియో ద్వారా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ అప్‌డేట్స్ గమనిస్తూ ఉండాలి. పనులు జరుగుతున్న చోట డైవర్షన్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, అతివేగం కంటే సురక్షిత ప్రయాణానికే ప్రాధాన్యత ఇవ్వాలి. అధికారులు చెబుతున్నట్లు మార్చి నాటికి అండర్ పాస్ పనులు పూర్తవుతాయో లేదో చూడాలి. కానీ ఈ సంక్రాంతికి మాత్రం సొంతవాహనాల్లో ఊరెళ్లాలంటే గుండె చేతిలో పెట్టుకోవాల్సిందే!

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version