Form – 6
భారత ప్రజాస్వామ్యానికి పునాది అని చెప్పే ఓటర్ల జాబితా చుట్టూనే ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఒక ఆసక్తికరమైన లీగల్ డ్రామా నడుస్తోంది. సాధారణంగా 18 ఏళ్లు నిండిన ఏ పౌరుడైనా కొత్తగా ఓటు హక్కు కోసం అప్లై చేసుకోవడానికి ఫారం-6(Form – 6) నింపడం అనేది దశాబ్దాలుగా వస్తున్న ప్రాసెస్.
కానీ ఇటీవల కాలంలో ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision) పేరుతో ఈ ఫారమ్‌లోకి ఎవరికీ తెలీకుండా ఒక కొత్త రూల్ వచ్చి చేరింది. దరఖాస్తుదారుడు తన వివరాలను ఫిల్ చేయడంతో పాటు తన తల్లిదండ్రులు లేదంటే తాతముత్తాతలు పాత ఓటర్ల లిస్ట్‌లో ఉన్నారా? వారితో మీకున్న కుటుంబ సంబంధాన్ని ప్రూవ్ చేయగలరా? అనే అదనపు డిక్లరేషన్‌ను యాడ్ చేశారు.
బయటకు ఇది చాలా చిన్న అడ్మినిస్ట్రేటివ్ అప్‌డేట్‌లా కనిపించినా కూడా.. అసలు అప్లికేషన్ రూపాన్నే మార్చేసే ఈ ప్రయోగాన్ని ఎవరు చేశారని ఏ అధికారంతో చేశారనే అంశంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ వివాదం ధర్మాసనం వరకూ వెళ్లినప్పుడు ఎన్నికల సంఘం తమ పాత ఆదేశాలనే సపోర్ట్‌గా చూపించే ప్రయత్నాన్ని చేసింది. కానీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం తమ తీర్పును ఆధారంగా చేసుకుని మార్చిన ఫారం-6(Form -6)ను తామేమీ ఆమోదించలేదని జవాబు ఇచ్చారు.
అసలు ఈ ఫారమ్‌ను మార్చడానికి ఆదేశాలు ఇచ్చింది ఎవరని.. ఏ నిబంధన ప్రకారం చేర్చారని ప్రశ్నిస్తూ దానికి సంబంధించిన ఆఫీస్ ఫైల్స్, రికార్డులను తమ ముందుంచాలని కోర్టు ఆదేశించింది. ఎన్నికల సంఘానికి ఓటర్ల జాబితాను రీ-వెరిఫై చేసే హక్కు కచ్చితంగా ఉంది కానీ, అదే పేరుతో చట్టబద్ధమైన పత్రాల్లో ఇష్టం వచ్చినట్లు మార్పులు చేసే వెసులుబాటు లేదని కోర్టు మొట్టికాయలు వేసింది. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ నేతృత్వంలోని ఈసీ ఇప్పుడు ధర్మాసనం ప్రశ్నలకు ఎలాంటి చట్టపరమైన సమాధానం ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
అయితే ఈ ఫారం -6(Form – 6)లో కొత్త రూల్ వల్ల .. మొదటిసారి ఓటు హక్కును పొందే యంగ్ జనరేషన్‌కు అలాగే ఒక ఊరి నుంచి మరో ఊరికి వలస వచ్చిన పేద కుటుంబాలకు ఇబ్బంది వస్తుంది. ఒకవేళ వారి పూర్వీకుల పేర్లు పాత ఓటర్ల లిస్ట్‌లో సరిగ్గా లేకపోయినా, లేదా టెక్నికల్ లోపాల వల్ల ఎంటర్ కాకపోయినా.. ఇప్పుడు కొత్తగా ఓటరు అవ్వాలనుకునే వారి ఓటు హక్కు ప్రశ్నార్థకంలో పడుతుంది.
నిజానికి ఓటర్ల జాబితాలో బోగస్ ఓటర్లు, నకిలీ ఓటర్ల పేర్లను ఏరిపారేయడం ఎంత ఇంపార్టెంట్‌నో.. అర్హత ఉన్న ఏ ఒక్క పౌరుడి ఓటు హక్కు టెక్నికల్ రీజన్స్‌తో కోల్పోకుండా చూడడం కూడా అంతే ముఖ్యం. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ తప్పడంతోనే ఇప్పుడు స్వయంగా సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. ఇది కేవలం ఒక అప్లికేషన్ ఫారం గొడవ కానే కాదు, మన ఓటు హక్కును శాసించే చట్టబద్ధత గురించి జరుగుతున్న అసలైన చర్చ అని ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి.
