Attachment Anxiety : అతిగా ప్రేమించడం కూడా ఒక మానసిక జబ్బేనా?..అటాచ్‌మెంట్ యాంగ్జైటీ మిమ్మల్ని వెంటాడుతుందా?

Attachment Anxiety : ఒక వ్యక్తిని మనస్ఫూర్తిగా ప్రేమించడం, బాగా చూసుకోవడం మాత్రమే మన కర్తవ్యం. కానీ వారు ఎప్పుడూ మనతోనే ఉండాలి, మనం అనుకున్నట్లే ప్రవర్తించాలని ఆశించకూడదు.

Attachment Anxiety

జీవితంలో మనకు బాగా నచ్చిన వ్యక్తులను ప్రేమించడం, అలాగే కొన్ని వస్తువులను ఇష్టపడటం చేస్తుంటాం. కానీ కొద్దిసార్లు ఈ ఇష్టం లేదా ప్రేమ అనేది ఒక లిమిట్‌ను దాటిపోతుంది. ఏ క్షణంలోనైనా నచ్చిన వ్యక్తి మనకు దూరం అయిపోతారేమో, ఆ వస్తువు మన చేయి జారిపోతుందేమో అనే ఒక తెలీని అభద్రతాభావం, భయం మనల్ని కంటిన్యూగా వెంటాడుతుంటాయి.

ఎదుటివారు కాస్త బిజీగా ఉండి ఫోన్ ఎత్తకపోయినా, మెసేజ్‌కు రిప్లై ఇవ్వకపోయినా మనసులో రకరకాల నెగిటివ్ ఆలోచనలు మొదలవుతాయి. ఈ రకమైన మానసిక వేదనను సైకాలజీలో అటాచ్‌మెంట్ యాంగ్జైటీ (Attachment Anxiety) అంటే బంధాల భయం లేదా అతిగా అతుక్కుపోవడం అంటారు. ఇదే విషయాన్ని మన ఆధ్యాత్మిక గ్రంథాలలో శతాబ్దాల క్రితం మోహం అని పిలిచారు.

సైకాలజీ చెబుతున్న దాని ప్రకారం, అటాచ్‌మెంట్ యాంగ్జైటీ ఉన్న వ్యక్తులు తమ సంతోషాన్ని, ప్రశాంతతను పూర్తిగా అవతలి వ్యక్తి బిహేవియర్‌పై ఆధారపడేలా చేసుకుంటారు. వారు నాతో బాగుంటేనే నేను హ్యాపీ, లేదంటే నా లైఫ్ శూన్యం అనే మైండ్ సెట్ వల్ల మైండ్ ఎప్పుడూ కూడా విపరీతమైన స్ట్రెస్‌లోనే ఉంటుంది.

ఎక్కడ పార్ట్‌నర్ దూరం అవుతారోననే భయంతో వారిని అతిగా కంట్రోల్ (Controlling) చేయడానికి ప్రయత్నిస్తుంటారు. దీనివల్ల అవతలి వ్యక్తి ఊపిరాడనట్లు ఫీలవుతారు. దీంతో నిజంగానే బంధాలు తెగిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. అంటే, ఏ భయమైతే మనల్ని వేధిస్తుందో, మన అతి ప్రవర్తన వల్ల ఆ భయమే నిజమవుతుంది.

ఇలాంటి మానసిక భయానికి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన నిష్కామ కర్మ అలాగే డిటాచ్‌మెంట్ (Detachment) అద్భుతమైన మార్గాన్ని చూపిస్తాయి. గీతా సందేశం ప్రకారం, బంధాలను వదిలేసి అడవులకి పారిపొమ్మని ఎక్కడా చెప్పలేదు. బంధాలలో ఉంటూనే దానిపై మోహాన్ని వదిలేయమని గీతలో చెప్పారు.

మోహం అంటే ఒక వస్తువు లేదా వ్యక్తి శాశ్వతంగా తన దగ్గరే ఉండాలనే స్వార్థపూరితమైన ప్రేమ. కానీ ఈ సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు, ప్రతిదీ మారుతూనే ఉంటుందనే నిజాన్ని మనం అంగీకరించినప్పుడు మాత్రమే మనిషిలో ఈ భయం పోతుంది.

Attachment Anxiety

నిష్కామ కర్మ సూత్రం ప్రకారం, ఒక వ్యక్తిని మనస్ఫూర్తిగా ప్రేమించడం, బాగా చూసుకోవడం మాత్రమే మన కర్తవ్యం. కానీ వారు ఎప్పుడూ మనతోనే ఉండాలి, మనం అనుకున్నట్లే ప్రవర్తించాలని ఆశించకూడదు. మనం ఎప్పుడైతే .. ప్రేమించడమే మన బాధ్యత కానీ రేపు ఏం జరుగుతుందో అది దైవ నిర్ణయమని ఆ ఫలితాన్ని దైవానికో లేదా కాలానికో వదిలేస్తే, అప్పుడు మనసులో ఎలాంటి ఆందోళన ఉండదు.

చివరిగా తెలుసుకోవలసిన తేలికైన నిజం ఒక్కటే.. బంధాలనేవి మన చేతిలో ఉన్న ఇసుక రేణువుల వంటివి. వాటిని ఎంత గట్టిగా పట్టుకోవాలని చూస్తే, అవి అంత వేగంగానే చేతిలోంచి జారి కింద పడిపోతాయి. అదే చేతిని ఫ్రీగా ఉంచితే ఆ ఇసుక మన చేతిలోనే ఉంటుంది. కాబట్టి బంధాల భయాన్ని వీడి.. మీ వాళ్లను ప్రేమించండి, వారితో ఉన్న ప్రతి క్షణాన్ని ఆనందించండి.

Banana with Curd Rice : పెరుగన్నంలో అరటి పండు కలిపి తింటున్నారా? అయితే ఇది తెలుసుకోవాల్సిందే..

Exit mobile version