Fathers Day : జూన్ 21న ఫాదర్స్ డే..కూతురి తొలి గురువుకు,కొడుకు సూపర్ హీరోకు ఆ రోజైనా థ్యాంక్యూ చెబుదామా?

Fathers Day : జూన్ 21న ఫాదర్స్ డే జరుపుకుంటున్న సమయంలో.. ఆ నాన్న ప్రేమను గుర్తుచేసుకుంటూ మనసారా శుభాకాంక్షలు చెబుదాం

Fathers Day

చిన్నప్పుడు ..నీకు అమ్మ ఇష్టమా? నాన్న ఇష్టమా? అని ఎవరైనా అడిగితే.. చాలా మంది పిల్లలు టక్కున నాన్న అనే సమాధానం చెబుతుంటారు. కానీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనిషి అవసరాలు, ప్రయారిటీలు మారిపోతుంటాయి. ఆకలైనా, దాహమైనా, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా అమ్మ అవసరం పెరుగుతుంది. అలా నాన్న కుటుంబ పోషణకు కష్టపడుతుంటే.. కుటుంబ భారాన్ని మోయడంలో అమ్మ కూడా బిజీ అవుతుంది. ఈలోగా ఆ పిల్లలు పెరిగి పెద్దవారయిపోతారు.

అందుకే ప్రముఖ కవి, సీనియర్ నటుడు తనికెళ్ల భరణి ఒక సందర్భంలో చెప్పినట్లుగా.. అమ్మతో సమానంగా త్యాగాలు చేసినా, ఆ గుర్తింపు నాన్నకు దక్కలేదనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తుంది.

కొడుకు, కూతురులో ఎక్కువ శాతం..తండ్రీ కూతుళ్ల మధ్య ఉండే భావోద్వేగ బంధానికే చాలా ప్రత్యేకత ఉంటుంది. ఆడపిల్లలకు తమ తండ్రిపై చెప్పలేని నమ్మకం, భద్రతా భావం ఉంటాయి. కూతుళ్ల విషయంలో తండ్రే తొలి గురువు, తొలి హీరో అనుకుంటూ పెరుగుతారు.

కూతుళ్ల చిన్న చిన్న విజయాలకు ప్రతీ తండ్రీ ఎంతో సంబరపడిపోతుంటారు. అందుకే ప్రతి ఆడపిల్ల కూడా పెద్దయ్యాక తన లైఫ్ పార్ట్‌నర్‌లో తన తండ్రిలో ఉన్న మంచి లక్షణాలు ఉండాలని కోరుకుంటుంది.

నిజానికి తండ్రిపై కూతుళ్లకు, కొడుకులకు ఉండే ప్రేమ సమానమే అయినా..ఆ ప్రేమను వ్యక్తపరిచే విధానమే మారుతుందని సైకాలజిస్టులు చెబుతున్నారు. ఆడపిల్లలు తమ ప్రేమను మాటలు, ఆప్యాయత రూపంలో చూపిస్తే.. అబ్బాయిలు మాత్రం బాధ్యత , గౌరవ రూపంలో చూపిస్తుంటారు.

డైరెక్టర్ త్రివిక్రమ్ ఒక వేదికపై మాట్లాడుతూ కొడుకు వయసు పెరుగుతున్న కొద్దీ తండ్రిపై ఉండే అంచనాలు, అభిప్రాయాలు ఎలా మారుతాయో చాలా అద్భుతంగా వర్ణించారు. ఐదారేళ్ల వయస్సులో నాన్న ఒక సూపర్ హీరోలా కనిపిస్తారని.. పదేళ్లు వచ్చాక డబ్బున్నోళ్లను చూసి మా నాన్నకంటే గొప్పోళ్లు ఉన్నారేమో అనుకుంటామని చెప్పారు.

అదే 18 ఏళ్ల వయస్సులో నాన్న ఏవైనా మంచి చెబితే నస పెడుతున్నారని విసుక్కుంటామని. కానీ పాతికేళ్ల వయస్సు వచ్చి పెళ్లయ్యాక, లైఫ్‌లో ఫేస్ చేస్తున్న కష్టాలు చూసినప్పుడు.. నాన్న గొప్పతనం ఏంటో మొదటిసారి అర్థమవుతుందని అన్నారు.

అంతేకాదు 35 ఏళ్ల వయస్సులో మన పిల్లల స్కూల్ ఫీజులు, హాస్పిటల్ బిల్లులు కట్టే సమయంలో.. మన కోసం నాన్న ఎంత కష్టపడ్డారో గుర్తొచ్చి కన్నీళ్లు పెట్టుకుంటారని.. దురదృష్టం ఏంటంటే, ఆ టైమ్‌కు చాలా మంది నాన్నలు మన మధ్య ఉండరని.. అందుకే నాన్న ఉన్నప్పుడే ఆయనకు కృతజ్ఞతలు చెప్పడం ముఖ్యమని చెబుతూ ఈ తరం వారికి కళ్లకు కట్టినట్లు వివరించారు.

నిజానికి ఒక తండ్రిగా పిల్లలకు కేవలం ఆస్తులు, హోదా ఇవ్వడం కంటే.. జీవితంలో ఎలా నిలబడాలో నేర్పే నైతిక విలువలు, ఎలాంటి కష్టాన్నైనా తట్టుకునే గుండె నిబ్బరాన్నివ్వడం చాలా అవసరం.

అలాగే పిల్లలు కూడా వయసు పెరిగిన తర్వాత నాన్నను కేవలం డబ్బులిచ్చే ఒక ఏటీఎం మిషన్ లాగానో, లేదా పాతకాలపు ఆలోచనలున్న వ్యక్తి అనే ఆలోచనతోనో చూడకూడదు.

Fathers Day

ఆయన కఠినమైన మాటల వెనుకున్న భవిష్యత్తు భయాన్ని, నాన్న నిశ్శబ్ద త్యాగాలను పిల్లలు అర్థం చేసుకోవాలి.అంతేకాదు వృద్ధాప్యంలో డాడ్‌కు కావలసింది లగ్జరీ లైఫ్ కాదు, కేవలం పిల్లల పలకరింపు, కాస్త సమయం మాత్రమేనన్న విషయాన్ని ఇప్పటివారు మర్చిపోకూడదు.

జూన్ 21న ఫాదర్స్ డే(Fathers Day) జరుపుకుంటున్న సమయంలో.. ఆ నాన్న ప్రేమను గుర్తుచేసుకుంటూ మనసారా శుభాకాంక్షలు చెబుదాం. సిల్వర్ స్క్రీన్ మీద ఎంతో మంది హీరోలను చూసి మేం చప్పట్లు కొట్టినా.. మా రియల్ లైఫ్‌లో మాత్రం రియల్ హీరోవి నువ్వే నాన్నా అంటూ మన కోసం నిత్యం శ్రమించే ఆ తండ్రికి ప్రేమతో కృతజ్ఞతలు తెలియజేద్దాం.

Telegram : సమాజానికి ముప్పుగా మారిన టెలిగ్రామ్..ఢిల్లీ హైకోర్టులో కేంద్రం వాదనలు

Exit mobile version