Natural Dishwash Liquid
కిచెన్‌లో సింక్ పక్కన మెరిసే ఆ రంగురంగుల డిష్‌వాష్ బార్లు, గ్లోసీ లిక్విడ్లను వాడుతూ..అబ్బా నా గిన్నెలు భలే తళతళా మెరుస్తున్నాయని సంబరపడిపోతుంటారు. అయితే ఆ తళతళల వెనుక కంటికి కనిపించని ఒక పెద్ద ఆరోగ్య ముప్పు దాగుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పాత్రలు, స్టవ్‌లు క్లీన్ చేయడానికి రెగ్యులర్‌గా మనం వాడుతున్న క్లీనర్లలో ఉండే సల్ఫేట్లు, ఫాస్ఫేట్లు, బ్లీచింగ్ ఏజెంట్లు.. పదేపదే మన చేతులకు, శ్వాసకు తగలడం వల్ల స్కిన్ అలెర్జీలు, తీవ్రమైన కంటి సమస్యలు రావడం గ్యారంటీ అని నిపుణులు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు.
ఈ డిటర్జెంట్స్ వల్ల సరిగా కడగపోవడం వల్ల గిన్నెలలో మిగిలిన కెమికల్స్ తాలూకా అవశేషాలు మన పొట్టలోకి కూడా వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. మరి ఈ సైలెంట్ డేంజర్ నుంచి బయటపడి మన హెల్త్‌ను కాపాడుకోవడం ఎలా అంటే.. మన అమ్మమ్మల కాలం నాటి నేచురల్ రూట్‌లోకి మారడమే దానికి ఏకైక పరిష్కారమని చెబుతున్నారు.
మన కిచెన్‌లోని కెమికల్ రాజ్యానికి చెక్ పెట్టే పవర్‌ఫుల్ అస్త్రం కుంకుడుకాయలే అంటున్నారు. పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఒక నేచురల్ డిష్‌వాష్ తయారుచేసుకోవడం చాలా ఈజీ అని చెబుతున్నారు నిపుణులు.
15 నుంచి 20 కుంకుడుకాయలను తీసుకుని వాటిని నీటితో కడిగి.. ఒక పాత్రలో నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. మర్నాడు ఉదయాన్నే ఆ కుంకుడుకాయలు నానబెట్టిన నీళ్లతో సహా స్టౌ మీద పెట్టి, సన్నటి మంటపై ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు బాగా మరిగించాలి.
కుంకుడుకాయలు మెత్తటి గుజ్జులా మారిన తర్వాత చల్లారనిచ్చాక, ఒక పల్చటి గుడ్డతో వడగట్టుకోవాలి. ఇప్పుడు ఆ నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా కలిపి చేసి ఒక బాటిల్‌లో పోసి పెట్టుకుంటే, కెమికల్-ఫ్రీ హ్యాండ్‌మేడ్ నాచురల్ క్లీనర్ రెడీ అయినట్లే.
కుంకుడుకాయల్లో నేచురల్‌గా ఉండే సపోనిన్లు నీటితో కలవగానే బాగా నురగనిస్తూ ఎంతటి మొండి జిడ్డునైనా ఈజీగా వదిలిస్తాయి. ఇక దీనిలో వేసిన బేకింగ్ సోడా గిన్నెలకు పట్టిన నీచు స్మెల్‌ను, దుర్వాసనను తుడిచిపెట్టేసి, కౌంటర్ టాప్‌లపై పేరుకుపోయిన మురికిని ఈజీగా వదిలిస్తుంది. అయితే ఒకేసారి లీటర్ల కొద్దీ కాకుండా, వారానికి సరిపడా కొద్దికొద్దిగా తయారు చేసుకుని వాడితే ఫ్రెష్‌గా ఉంటుంది. .
ఒక్కోసారి స్టవ్ లేదా సింక్ మీద జిడ్డుగా అన్పిస్తే, ఈ లిక్విడ్‌ను అక్కడ కొద్దిగా స్ప్రే చేసి 10 నిమిషాలు నానబెట్టి తుడిస్తే చాలు మెరిసిపోతుంది. మార్కెట్లో దొరికే డేంజరస్ లిక్విడ్స్‌కు స్వస్తి చెప్పి, కాస్త టైమ్ కేటాయించి ఈ నేచురల్ లిక్విడ్‌ను వాడితే బెటర్.దీని వల్ల డబ్బు మిగలడమే కాకుండా, మనతో పాటు మన ఫ్యామిలీని కూడా రోగాల బారిన పడకుండా కాపాడుకున్నవారం అవుతాం.
