Smiling Depression
మన చుట్టూ ఉండే స్నేహితులు, బంధువులలోనూ ఎప్పుడూ నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ భలే యాక్టివ్‌గా కనిపించే వ్యక్తి ఒకరు ఉంటారు. అలాంటివాళ్లు ఎక్కడుంటే అక్కడ నవ్వుల పువ్వులు పూస్తుంటాయి. కానీ అదే వ్యక్తి ఎవరూ లేని ఒంటరితనం ఆవరించినప్పుడు మాత్రం.. ముఖ్యంగా అర్ధరాత్రి వేళల్లో గుండె పగిలేలా ఏడుస్తూ గడపడం చాలామందికి తెలీదు.
తన లోపల ఉన్న కొండంత బాధను ఎవరికీ చెప్పుకోలేక.. సమాజం ముందు ఒక నవ్వుల ముసుగు వేసుకుని తిరుగుతుంటాడు. పైకి ఎంతో హ్యాపీగా కనిపిస్తూ లోపల తీవ్రమైన మానసిక వేదనను అనుభవించే ఈ వింత మనస్తత్వం వెనుకున్న సైకాలజీ గురించి నిపుణులు వివరిస్తున్నారు.
ఇలాంటి ప్రవర్తనను మానసిక శాస్త్రంలో హ్యూమర్ యాజ్ ఎ డిఫెన్స్ మెకానిజం (Humor as a defense mechanism) అని పిలుస్తారు. అంటే, ఒక వ్యక్తి తన లైఫ్‌లో జరిగిన ఏదైనా ఒక పెద్ద ట్రామాను, గుండెను పిండేసే బాధను ఫేస్ చేస్తున్నప్పుడు, లేదా గతం వెంటాడుతున్నప్పుడు.. ఆ వేదనను తట్టుకోవడానికి తమ మెదడు కనుగొన్న ఒక రక్షణ కవచంగా నవ్వును వాడుతుంటారు.
తమ బలహీనతను, కన్నీళ్లను లోకానికి చూపిస్తే ఎక్కడ చులకన అయిపోతామో అన్న భయం వీరిలో బలంగా ఉంటుంది. అందుకే తమ చుట్టూ ఉన్న వాళ్లు తమను చూసి జాలిపడకూడదని, లోపల ఉన్న బాధను దాచేస్తూ జోకులు వేయడం, నవ్వించడం అలవాటు చేసుకుంటారు. దీనిని సైకాలజీలో స్మైలింగ్ డిప్రెషన్ (Smiling Depression) అని కూడా అంటారు.
స్మైలింగ్ డిప్రెషన్ (Smiling Depression) మెంటాలిటీ ఉన్నవాళ్లు చివరికి అది ఒక అలవాటుగా మారిపోయేంతగా తమ బాధను అణచివేస్తుంటారు. పగలంతా అందరినీ నవ్వించే పనిలో బిజీగా ఉంటున్నట్లు తిరుగుతూ మైండ్‌ను డైవర్ట్ చేసుకుంటారు. కానీ రాత్రి అయ్యాక నిశ్శబ్దం ఆవరించాక, ఒంటరితనం వెంటాడుతుంది.
అప్పుడు అంతవరకూ అణచిపెట్టిన భావోద్వేగాలన్నీ ఒక్కసారిగా లావా లాగా పగిలిపోతాయి. వీరు సమాజానికి ఒక జోకర్‌లా కనిపిస్తూ అందరి ముఖాల్లో సంతోషాన్ని నింపుతారు కానీ.. వారి మనసు మాత్రం శూన్యంలో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది.
ఇలాంటి వ్యక్తుల విషయంలో వారి బంధువులు కానీ, స్నేహితులు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడూ ఏడ్చేవాడి కంటే, ఎప్పుడూ నవ్వించేవాడి లోపలే ఎక్కువ ప్రమాదకరమైన మానసిక స్థితి కనిపిస్తుంది.
వీరికి కావలసింది జాలి కాదు, కేవలం ఒక నమ్మకమైన ఆదరణ. నువ్వు అందరినీ నవ్విస్తుంటావు కానీ నువ్వెలా ఉన్నావు? అని అడిగే ఒకే ఒక్క ప్రాణస్నేహితుడు, ఆప్త బంధువు ఒక్కరు దొరికినా చాలు, వీరు ఆ నవ్వుల ముసుగు తీసేసి మనస్ఫూర్తిగా తమ బాధను పంచుకుని ఫ్రీ అయిపోతారు.
నిజానికి ఎవరికైనా అంతర్గత ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయినప్పుడు ప్రొఫెషనల్ థెరపిస్టుల సహాయం తీసుకోవాలి. దీని వల్ల ఈ నకిలీ నవ్వుల ముసుగు నుంచి లోపల ఉన్న డిప్రెషన్ నుంచి పూర్తిగా బయటపడొచ్చని సైకాలజిస్టులు సూచిస్తున్నారు.
Suvendu : బెంగాల్ లో బుల్డోజర్ ట్రీట్ మెంట్..గ్యాంగ్ స్టర్స్ కు సువేందు షాక్
