Procrastination
ఏదైనా ఒక ముఖ్యమైన పని చేయాలనుకున్నప్పుడు, మనలో చాలామంది మెదడు నెమ్మదిగా ..ఇప్పుడే ఎందుకు.. ఇంకొక అరగంట ఆగి చేయొచ్చులే అనుకునేలా చిన్న సలహా ఇస్తుంది. అయితే ఆ అరగంట కాస్తా గంట అవుతుంది, ఆ గంట కాస్తా మరుసటి రోజుకు మారుతుంది. చివరకి ఆ పనికోసం చేయాల్సిన డెడ్ లైన్ (Deadline) దగ్గరపడినప్పుడు, గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటే కంగారుగా పూర్తి చేయాల్సిన పరిస్థితి వస్తుంది.
దీనినే సైకాలజీలో వాయిదా వేసే మనస్తత్వం లేదా ప్రోక్రాస్టినేషన్(Procrastination) అంటారు. చాలామంది దీనిని కేవలం బద్ధకమని అనుకుంటారు. కానీ నిజానికి ఇది బద్ధకం కంటే కూడా ప్రమాదకరమైన ఒక మానసిక స్థితి అంటారు సైకాలజిస్టులు. ఇది మనిషిలోని సామర్థ్యాన్ని, క్రియేటివిటీని మెల్లమెల్లగా చంపేస్తుంది.
అసలు మనం పనులను ఎందుకు వాయిదా వేస్తామనే కారణం వెనుక ఉన్న సైకాలజీని ఒకసారి గమనిస్తే.. మన మెదడు ఎప్పుడూ తక్షణ సంతోషాన్ని (Instant Gratification) కోరుకుంటుందట. ఒక కష్టమైన ప్రాజెక్ట్ చేయడం కంటే, సోషల్ మీడియాలో రీల్స్ చూడటం , టీవీ చూడటం వల్ల మన మెదడుకు వెంటనే డోపమైన్ అనే రసాయనం రిలీజయ్యి మెదడులో హాయిగా అనిపిస్తుంది.
అంటే కష్టమైన పని చేయడం వల్ల కలిగే ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి మెదడు ఎంచుకునే ఒక మార్గమే ఈ వాయిదా వేయడమని సైకాలజిస్టులు చెబుతారు. నేను ఈ పనిని పర్ఫెక్ట్‌గా చేయగలనా అనే భయం కనుక వేస్తే.. మనం ఆ పనిని మొదలుపెట్టకుండా ముందే వాయిదా వేస్తుంటాం. ఈ పద్ధతి వల్ల టెంపరరీగా అప్పటకి అప్పుడు హాయిగా ఉన్నా, లోలోపల ఒక తెలియని ఆందోళన, అపరాధ భావం (Guilt) వేధిస్తూనే ఉంటాయి.
ఈ వాయిదా వేసే అలవాటు వల్ల కలిగే నష్టాలు ఒక్కోసారి పెద్దగానే ఉంటాయి. ఎందుకంటే ఇది కేవలం మన సమయాన్ని మాత్రమే కాదు, మన కాన్ఫిడెన్స్‌ను కూడా దెబ్బతీస్తుంది. ఎలా అంటే ఒక పనిని వాయిదా వేసిన ప్రతిసారి మనపై మనకు ఉండే నమ్మకం కూడా తగ్గుతుంది. దీనికి కారణం నేను ఏ పనిని సకాలంలో పూర్తి చేయలేననే ఒక ప్రతికూల ఆలోచన.. మనసులో బలంగా నాటుకుపోతుంది. దీనివల్ల వృత్తిపరంగా ఎదగలేకపోవడమే కాకుండా,పర్సనల్ లైఫ్‌లో కూడా ఒత్తిడి పెరుగుతుంది. దీనికి తోడు చివరి నిమిషంలో చేసే పనుల్లో నాణ్యత తగ్గిపోతుంది. దానివల్ల మనకు రావలసిన ఇంకా చెప్పాలంటే తగినంత గుర్తింపు రాదు.
ఈ అలవాటు నుంచి బయటపడటంపై సైకాలజిస్టులు కొన్ని సలహాలు చెబుతున్నారు. ముందుగా ఆ పనిని ఒకేసారి పూర్తి చేయాలని కాకుండా, చిన్న చిన్న భాగాలుగా విభజించుకోవాలి. ఉదాహరణకు ఒక పెద్ద రిపోర్ట్ రాయాలంటే, ఈ రోజు కేవలం మొదటి పేజీ ఎలా అయినా రాస్తానని మనసుని ఒప్పించాలి. దీని కోసం ఫైవ్ మినిట్ రూల్ (Five-Minute Rule) పాటించడం చాలా అద్భుతంగా పని చేస్తుందట. అంటే ఏదైనా పనిని కేవలం ఐదు నిమిషాలు మాత్రమే చేస్తానని మొదలుపెట్టడం అన్నమాట.
ఇలా కనుక స్టార్ట్ అయితే అంటే ఒకసారి పని మొదలు పెట్టిన తర్వాత మన మెదడు ఆ పనిని పూర్తి చేసే వరకు ఊరుకోదు. ముఖ్యంగా మన చుట్టూ ఉన్న ఆటంకాలను, మరీ ముఖ్యంగా మొబైల్ ఫోన్‌ను పక్కన పెట్టడం చాలా ఇంపార్టెంట్ రూల్ ప్రోక్రాస్టినేషన్ (Procrastination). ఎందుకంటే రేపు అనేది ఎప్పటికీ రాదు. ఈ క్షణం మాత్రమే మన చేతుల్లో ఉంది. ఈ క్షణంలో చేస్తున్న చిన్న అడుగే రేపటి పెద్ద విజయానికి పునాది అవుతుందన్న విషయాన్ని అర్ధం చేసుకోవాలి. వాయిదా వేయడం ఆపి, పని చేయల్సిన రోజే పనిని మొదలుపెడితే సగం విజయం సాధించినట్లే అని గుర్తించాలి.
