ROCD
రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు పార్టనర్ గురించి ఆలోచించడం చాలా కామన్. కానీ కొంతమందికి తమ ప్రేమ మీదే కాదు పార్ట్‌నర్ మీద నిత్యం లేనిపోని అనుమానాలు ముసురుకుంటూ ఉండటంతోనే అసలు సమస్య మొదలవుతుంది. నేను తనని నిజంగానే ప్రేమిస్తున్నానా? తను నాకు కరెక్ట్ జోడీయేనా? మా ఇద్దరి జంట పక్కన వాళ్లకు నచ్చుతుందా? అంటూ వారి మనసులో ఒక పెద్ద యుద్ధం నడుస్తుంటుంది.
సాదాసీదాగా అనుకునే ఈ అనుమానాల వెనుక ఒక మానసిక సమస్య దాగి ఉండే అవకాశం ఉందని అంటున్నారు మానసిక నిపుణులు. సైకాలజీలో దీనిని రిలేషన్‌షిప్ ఓసీడీ అని కానీ ఆర్‌ఓసీడీ (ROCD)అని కానీ పిలుస్తారు. సాధారణంగా ఓసీడీ అంటే చేతులు పదే పదే కడుక్కోవడం, తాళాలు సరిగ్గా వేశామా లేదా అని పదే పదే చెక్ చేయడం వంటి అతి శుభ్రం, అతి జాగ్రత్త పనులు చూస్తుంటాం.
కానీ ఈ ఆర్‌ఓసీడీ (ROCD)ఉన్నవాళ్లకు మాత్రం అలాంటి అనుమానాలన్నీ తమ ప్రేమ బంధం మీదే ఉంటాయి. ప్రస్తుతం ఇప్పుడున్న లైఫ్‌స్టైల్ వల్ల ఈ మైండ్ సెట్ ఉన్నవాళ్లు రోజురోజుకు ఎక్కువవుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.
ప్రస్తుత రోజుల్లో జనాభాలో దాదాపు 1- 4 శాతం మంది ఈ రకమైన సమస్యతోనే సతమతమవుతున్నారట. ఇది వినడానికి చిన్న విషయంగా అనిపిస్తుంది కానీ ఇది వారి మానసిక ప్రశాంతతను పూర్తిగా దూరం చేస్తుంది. ఈ ఆర్‌ఓసీడీ ఉన్నవారిలో కొన్ని విచిత్రమైన ప్రవర్తనలు కనిపిస్తాయి.
తమ భాగస్వామిలో ఎప్పుడూ లేనిపోని లోపాలను వెతుకుతూ ఉండటం ఎక్కువగా కనిపిస్తుంది. నా పార్ట్‌నర్ అందంగా ఉన్నాడా లేదా, తెలివితేటలు ఉన్నాయా లేదా అని పదే పదే ఆలోచిస్తుంటారు . చివరకు తామిద్దరూ ఏదైనా ఫంక్షన్‌కి వెళ్లినా కూడా చుట్టుపక్కల వాళ్లు ఏమనుకుంటారోనని భయపడిపోతుంటారు.
తమ సొంత ప్రేమ మీదనే నమ్మకం లేకపోవడమనేది రెండో లక్షణం. మొదట్లో ఉన్న ఫీలింగ్స్ ఇప్పుడెందుకు లేవు, వేరే వాళ్లను చూసినప్పుడు ఎందుకు ఆకర్షణ కలుగుతోందని తమను తాము నిందించుకుంటూ డిప్రెషన్‌లోకి వెళ్తుంటారు.
అలాగే తమ రిలేషన్‌షిప్‌ను వేరే వాళ్ల జంటలతో పోల్చుకుంటూ ఉండటం మూడో లక్షణం. దీనికోసం గూగుల్‌లో రాత్రింబగళ్లు వెతకడం, స్నేహితులను మా ఇద్దరి జోడీ బాగుందా అంటూ పదే పదే అడగడం, క్రాస్ చెక్ చేసుకోవడం చేస్తుంటారు.
అయితే ఇలాంటి మైండ్ సెట్ వల్ల జీవితంలో చాలా నష్టపోతుంటారు. మనసంతా పార్ట్‌నర్ గురించిన నెగిటివ్ ఆలోచనలతో నిండిపోవడంతో వారు చేసే ఉద్యోగం మీద కానీ, వేరే ఇతర పనుల మీద కానీ అస్సలు ధ్యాస ఉండదు. దీంతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు. అనవసరమైన అనుమానాలతో భాగస్వామితో రోజూ గొడవలు పెట్టుకుని, చివరకు ప్రాణంగా ప్రేమించిన వాళ్లను తమకు తామే దూరం చేసుకునే స్థాయికి చేరుకుంటారు.
తాను తన పార్ట్‌నర్‌ను మోసం చేస్తున్నాననో, మనసులో తప్పుడు ఆలోచనలు వస్తున్నాయేమోననే ఒక రకమైన గిల్ట్ ఫీలింగ్ వాళ్లను నిద్రపోనివ్వకుండా చేస్తుంది. చాలా సందర్భాల్లో తమకు ఈ సమస్య ఉందనే విషయం అర్థం కాదు. ఇది అర్ధం కావడానికి వారికి చాలా ఏళ్లు పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ ఆర్‌ఓసీడీ మైండ్ సెట్ నుంచి బయటపడటానికి కొన్ని మార్గాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వాళ్లకు మందుల కంటే కూడా థెరపీలు చాలా బాగా పనిచేస్తాయి. అందులో ఈఆర్‌పీ అంటే ఎక్స్‌పోజర్ అండ్ రెస్పాన్స్ ప్రివెన్షన్ అనే విధానం చాలా బాగా పనిచేస్తుంది.
మనసులోకి ఏదైనా భయం కలిగించే ఇలాంటి నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు, దానికి సమాధానం వెతకడానికి ఏమాత్రం ప్రయత్నించకుండా, ఆ ఆలోచనను అక్కడే అలా వదిలేసి కాసేపు ప్రశాంతంగా ఉండటం ఈఆర్‌పీలో నేర్పిస్తారు.
అలాగే సీబీటీ అంటే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ద్వారా వారి ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చుకునేలా చేస్తారు. ప్రేమ అంటే ఎప్పుడూ ఏదో మూవీలా ఎగ్జైట్‌మెంట్‌తో ఉండాలనే తప్పుడు అంచనాలను ఈ థెరపీ దూరం చేస్తుంది.
అన్నింటికంటే ముఖ్యం.. మన మనసులోకి వచ్చే ప్రతి ఆలోచన కూడా నిజం కాదనే పచ్చి నిజాన్ని వీరు గ్రహించాలి. ఆలోచనలు అనేవి మేఘాల వంటివి కాబట్టి..అవి వస్తుంటాయి పోతుంటాయి. కానీ ప్రేమ అనేది ఒక క్షణకాలపు ఫీలింగ్ కాదు ఎందుకంటే అది మనం జీవితాంతం కలిసి ఉండాలని తీసుకునే ఒక బలమైన నిర్ణయం అని తెలుసుకోవాలి..
రోజులు గడిచేకొద్దీ ఆకర్షణలు మారొచ్చు, ఇష్టం తగ్గొచ్చు. కానీ వారిద్దరి మధ్య ఉండే బంధం మీద ఉండే గౌరవం, నమ్మకం మాత్రం మారకూడదు. ఒకవేళ ఈ లక్షణాలు మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటే మాత్రం, ఎలాంటి రెండో ఆలోచన కూడా లేకుండా ఒక మంచి సైకాలజిస్ట్‌ను కలిసి.. కౌన్సిలింగ్ తీసుకోవడం వల్ల జీవితం మళ్లీ ఎప్పటిలాగే ఆనందమయంగా మారుతుంది.
Cockroach Janta Party : కాక్రోచ్ పార్టీ ఎక్స్ ఖాతా బ్లాక్..తగ్గేదే లేదంటూ మరో అకౌంట్
