Sorry
మన లైఫ్‌లో రకరకాల మనుషులను చూస్తుంటాం . అలా కొంతమంది వాళ్లు కావాలని చేసినా, తెలియక చేసినా.. వాళ్లదే తప్పు అని తెలిసినా కూడా అస్సలు సారీ (Sorry) చెప్పరు. పైగా తాము చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఏవేవో వంకలు వెతుకుతుంటారు. అంతేకాదు ఎదుటివారిపైనే తిరగబడుతూ అడ్డంగా వాదిస్తుంటారు. ఇలా తప్పు చేసి కూడా క్షమాపణ చెప్పడానికి ఇష్టపడని ఈ మొండి మనస్తత్వాన్ని సైకాలజీలో ఈగో డిఫెన్స్ మెకానిజం (Ego Defense Mechanism) అంటారు.
తప్పు చేశానని ఒప్పుకోవడం కానీ సారీ చెప్పడం కానీ చాలా మందికి ఒక సాధారణ విషయంగా అనిపించొచ్చు. కానీ, ఈ ప్రత్యేకమైన మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు మాత్రం సారీ చెప్పడమంటే దానిని పెద్ద యుద్ధంలో ఓడిపోవడంతో సమానంగా భావిస్తారు.
వాళ్ల దృష్టిలో క్షమాపణ చెబితే తమ గౌరవమంతా తగ్గిపోతుందని, తాము ఎదుటివారి కంటే తక్కువైపోతామని అనుకుంటారు. వారి మనసులో చిన్నప్పటి నుంచి పాతుకుపోయిన విపరీతమైన ఈగో (Ego), తమను తాము ఎప్పుడూ తక్కువగా చూసుకోలేకపోవడం వల్లే ఈ పరిస్థితి వస్తుంది.
నిజానికి ఇలాంటి వాళ్లు పైకి చాలా ధైర్యంగా, గంభీరంగా కనిపిస్తారు కానీ, లోపల చాలా ఆత్మన్యూనతా భావంతో బాధపడుతుంటారని సైకాలజీ చెబుతుంది. కానీ తాము పర్ఫెక్ట్ కాదనే నిజాన్ని అందరి ముందు ఒప్పుకోవడానికి వాళ్ల మనసు అస్సలు అంగీకరించదు.
ఒకవేళ పొరపాటున తప్పు ఒప్పుకుంటే.. తమ వ్యక్తిత్వానికి ఎక్కడ మచ్చ పడుతుందో అనే భయం వెంటాడుతుంది. అందుకే, తమ మనసుకు , అహానికి ఎలాంటి దెబ్బ తగలకుండా కాపాడుకోవడానికి ఈగో డిఫెన్స్ మెకానిజం అనే ఒక మానసిక కవచాన్ని ఆయుధంగా వాడుకుంటారు. దీనివల్ల తప్పు తమదే అయినా, దాన్ని వేరే వాళ్లపైకి నెట్టేస్తుంటారు. లేదా ఆ పరిస్థితి నుంచి పూర్తిగా ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తుంటారు.
ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్లు బంధాలలో ఉన్నప్పుడు తమ పార్టనర్స్‌తో సమస్యలు వస్తాయి. ఎంత మంచి రిలేషన్‌షిప్ అయినా సరే.. ఒకరి తప్పును మరొకరు అంగీకరించి సర్దుకుపోకపోతే మాత్రం ఆ బంధం ఎంతో కాలం నిలవదు. పదే పదే తనే కరెక్ట్ అని వాదించడం వల్ల అవతలి వ్యక్తి మానసికంగా విసిగిపోతాడు.
మెల్లమెల్లగా ఎలాంటి ప్రాణ స్నేహితులైనా, క్లోజ్ రిలేటివ్స్ అయినా సరే.. వీరికి దూరమవ్వడానికే ప్రయత్నిస్తారు. దీనివల్ల చుట్టూ మనుషులున్నా, ఎవరితోనూ సరిగ్గా కలవలేక వీరు ఒంటరివారైపోతుంటారు.
ఈ అలవాటు నుంచి బయటపడటం ఒక్క రోజులో సాధ్యం కాదు . మొదటగా.. తప్పు చేయడమనేది మనుషులందరికీ సహజమైన విషయం అనే నిజాన్ని వీరు గ్రహించాలి. సారీ చెప్పడం వల్ల ఎవరూ తక్కువ అయిపోరని.. పైగా బంధాలు మరింత బలపడతాయనే విషయాన్ని తెలుసుకోవాలి. మనసులోని ఈగోని పక్కన పెట్టి, ఎదుటివారి ప్లేసులో నిలబడి ఆలోచించడం అలవాటు చేసుకున్నప్పుడే ఈ మానసిక సమస్య నుంచి పూర్తిగా బయటపడొచ్చు.
Rajasthan Royals : సన్ రైజర్స్ ఔట్..క్వాలిఫైయర్ 2కు రాజస్థాన్
