Hallucinations
నిశ్శబ్దంగా ఉన్న రూములో మీ పేరు ఎవరో పిలిచినట్లు అనిపించడం, ఒంటరిగా ఉన్నప్పుడు పక్కనే ఎవరో నడుస్తున్నట్లు భ్రమ కలుగుతుంది. వినడానికి కాస్త భయంగా అనిపించినా, ఇది చాలామంది తమ జీవితంలో ఏదొక సందర్భంలో ఎదుర్కొనే ఒక విచిత్రమైన భౌతిక వాస్తవం. అయితే ఇవి ఎలాంటి దెయ్యాలు, అతీంద్రియ శక్తులు కావు, కేవలం మన మెదడు లోపల జరిగే ఒక అసాధారణ కెమికల్ రియక్షన్ మాత్రమే.
సైకాలజీ అండ్ న్యూరాలజీ భాషలో దీనిని హాలూసినేషన్స్ (Hallucinations) లేదా భ్రమలు అని పిలుస్తారు. మన కళ్లకూ, చెవులకూ బయటి వాతావరణం నుంచి ఎలాంటి సమాచారమూ అందకపోయినా, తీవ్రమైన అలసట వల్ల కానీ ఒత్తిడి వల్ల కానీ మెదడులోని కొన్ని ప్రత్యేక భాగాలు అసాధారణంగా స్పందించి, లేని విషయాన్ని ఉన్నట్లుగా క్రియేట్ చేసి మనల్ని నమ్మిస్తాయి.
ఈ హాలూసినేషన్స్ వెనుక బలమైన సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయని నిపుణులు అంటున్నారు. మనిషి మెదడులో సమాచారాన్ని చేరవేసే ‘డోపమైన్’ (Dopamine) అనే ఒక ముఖ్యమైన న్యూరోట్రాన్స్మిటర్ ఉంటుంది. మనిషి విపరీతమైన మానసిక ఒత్తిడికి (Chronic Stress) గురైనప్పుడు, రోజుల తరబడి నిద్ర లేకపోవడం (Sleep Deprivation) వల్ల కానీ విపరీతమైన యాంగ్జైటీ వల్ల కానీ బ్రెయిన్‌లో ఈ డోపమైన్ లెవెల్స్ అసాధారణంగా పెరిగిపోతాయి. మెదడు బాగా అలసిపోయినప్పుడు, ముఖ్యంగా రాత్రి వేళల్లో ఉండే నిశ్శబ్దాన్ని తట్టుకోలేక, తన లోపల ఉన్న ఆలోచనలనే బయట వినిపిస్తున్న శబ్దాలుగా (Auditory Hallucinations), కనిపిస్తున్న రూపాలుగా (Visual Hallucinations) ప్రొజెక్ట్ చేస్తుంది. అప్పుడు ఆ వ్యక్తికి ఆ రూపాలు, ఆ మాటలు వంద శాతం నిజంగానే అనిపిస్తాయి.
ఈ మానసిక పరిస్థితి నుంచి బయటపడటానికి కొన్ని లైఫ్‌స్టైల్ చేంజెస్ చేసుకోవడంతో పాటు.. వైద్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా, ఈ సమస్యకు ప్రధాన కారణం నిద్రలేమి కాబట్టి ప్రతిరోజూ 7 నుంచి 8 గంటల పాటు క్వాలిటీ స్లీప్ ఉండేలా చూసుకోవాలి. పనిలో ఒత్తిడిని తగ్గించుకుని, మైండ్ రిలాక్స్ అవ్వడానికి మెడిటేషన్, యోగా వంటివి అలవాటు చేసుకోవాలి. శరీరంలో విటమిన్ బి12 లేదా ఇతర పోషకాల లోపం వల్ల కూడా బ్రెయిన్ సెల్స్ బలహీనపడతాయి కాబట్టి హెల్తీ డైట్ తీసుకోవడమనేది చాలా ముఖ్యం.
ఒకవేళ ఈ భ్రమలు(Hallucinations) అనేవి ఎప్పుడో ఒకసారి బాగా అలసిపోవడం వల్ల జరిగితే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ రోజువారీ జీవితంలో పదే పదే ఇలాంటి అసాధారణ అనుభవాలు ఎదురవుతూ ఉంటే మాత్రం, అది మెదడులోని తీవ్రమైన కెమికల్ ఇంబాలెన్స్ లేదా స్కిజోఫ్రెనియా (Schizophrenia) వంటి సైకియాట్రిక్ సమస్యలకు సంకేతం కావొచ్చు. అలాంటి సమయంలో మూఢనమ్మకాల వైపు వెళ్లకుండా, వెంటనే ఒక క్వాలిఫైడ్ సైకాలజిస్ట్‌ను కానీ సైకియాట్రిస్ట్‌ను కానీ కన్సల్ట్ చేసి సరైన కౌన్సెలింగ్ , థెరపీ తీసుకోవడం ద్వారా ఈ సమస్యను పూర్తిగా దూరం చేసుకోవచ్చు.
RR vs DC : రాజస్థాన్ కు ఢిల్లీ షాక్..ప్లే ఆఫ్ అవకాశాలకు దెబ్బ
