Paradox Of Choice
ఒక సూపర్ మార్కెట్‌లో మూడు వెరైటీల జామ్ బాటిల్స్ మాత్రమే సేల్ కోసం ఉంచినప్పుడు, కొనేవాళ్లు పెద్దగా ఆలోచించకుండా ఆ మూడింటిలో తమకు నచ్చిన ఒక దానిని ఎంచుకుని చాలా త్వరగా షాపింగ్ చేసేస్తారు. అదే ప్లేస్‌లో ముప్పై రకాల జామ్ బాటిల్స్‌ను పేర్చి ఉంచితే, చాలామంది ఏది కొనాలో తేల్చుకోలేక, అయోమయానికి గురై చివరికి ఏదీ కొనకుండానే బయటకు వచ్చేస్తారు.
అమెరికన్ సైకాలజిస్ట్ బారీ స్క్వార్జ్ ప్రతిపాదించిన పారడాక్స్ ఆఫ్ ఛాయిస్(Paradox Of Choice) లేదా ది డార్క్ సైడ్ ఆఫ్ ఛాయిస్ సిద్ధాంతానికి ఇదే ఒక పెద్ద ఉదాహరణగా చెబుతారు. సాధారణంగా ఆప్షన్లు ఎక్కువ ఉంటే మనుషులకు ఎక్కువ ఫ్రీడమ్, ఎక్కువ ఆనందం లభిస్తాయని భావిస్తుంటాం. కానీ నిజానికి లిమిట్‌కు మించిన ఆప్షన్స్ ఉంటే మనిషి మెదడు తీవ్రమైన కన్ఫ్యూజన్ స్టేట్‌లోకి వెళ్లిపోతుంది.
మన వద్ద ఆప్షన్లు పెరిగే కొద్దీ, దానిలో సరైనదానిని సెలక్ట్ చేసుకోవడానికి మైండ్ ఎక్కువ శక్తిని ఉపయోగించాల్సి వస్తుంది. దీనిని సైకాలజీలో డెసిషన్ ఫెటీగ్ లేదా నిర్ణయాత్మక అలసట అని పిలుస్తారు. ఒక వస్తువును సెలక్ట్ చేసుకునే సమయంలో, మిగిలిన 29 ఆప్షన్లలో ఏముందో, వాటిని వదులుకోవడం వల్ల ఏమైనా నష్టపోతున్నామా అనే మెంటల్ టెన్షన్ , అసంతృప్తి మనిషిని వెంటాడుతుంది. దీనివల్ల ఒకవేళ ఏదో ఒక దానిని ఎంచుకున్నా, ఇంతకంటే బెటర్ అయినది వేరేది ఉందేమోననే అనుమానంతో, మనం తీసుకున్న నిర్ణయంపై పూర్తిగా సంతృప్తి చెందలేం.
ఇప్పటి డిజిటల్ యుగంలో ఈ సమస్య మరింత ఎక్కువ అయింది. మన చేతిలోని మొబైల్ ద్వారా నిమిషాల్లోనే లక్షల ఆప్షన్లు కళ్లు ముందుకు వస్తున్నాయి. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో వందలాది సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఉన్నా , గంటల తరబడి ఏది చూడాలా అని స్క్రోల్ చేస్తూ టైమ్‌ను వేస్ట్ చేయడం ప్రతి ఒక్కరి అనుభవంలో ఉన్నదే.
అలాగే ఆన్‌లైన్ షాపింగ్ సైట్లలో కళ్లు చెదిరే సంఖ్యలో బట్టలు , గ్యాడ్జెట్లు ఉండటం వల్ల ఏది కొనాలో తేల్చుకోలేక చివరకు కార్ట్‌లో వేసి వదిలేస్తుంటాం. ఆఖరికి డేటింగ్ యాప్‌లు, మ్యాట్రిమోనీ సైట్లలో రోజూ వందలాది ప్రొఫైల్స్ కనిపిస్తుండటంతో, లైఫ్ పార్ట్‌నర్ విషయంలో కూడా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోలేక మనిషి కన్ఫ్యూజ్ అవుతున్నాడు.
లిమిట్ లేని ఈ డిజిటల్ ఆప్షన్ల ప్రవాహంలో మనం కొట్టుకుపోకుండా ఉండాలంటే, మన లైఫ్‌లో ఆప్షన్స్ పరిమితిని మనమే విధించుకోవడం చాలా అవసరం. ప్రతి చిన్న విషయంలోనూ ది బెస్ట్ మాత్రమే కావాలనుకునే ఆలోచనను పక్కనబెట్టి, మన అవసరానికి సరిపోయే సరైనదానిని సెలక్ట్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి.
ఇలా మనకున్న ఆప్షన్లను ముందే సెట్ చేసి పెట్టుకోవడం ద్వారా మైండ్‌పై పడే ఒత్తిడి తగ్గుతుంది. ఎప్పుడైతే ఆప్షన్స్ తగ్గించుకుంటామో, అప్పుడే మన నిర్ణయాలలో క్లారిటీ రావడంతో పాటు, లైఫ్‌లో నిజమైన సంతృప్తి, మానసిక ప్రశాంతత దొరుకుతాయి.
Date Of Birth : ఈరోజు ఏ నెంబర్ వారికి ఎలాంటి లక్ దక్కుతుంది..వీరు ఆవేశాన్ని తగ్గించుకుంటేనే మంచిది..
