Peace Of Mind
ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చుట్టూ రకరకాల మనుషులతో పాటు, విచిత్రమైన పరిస్థితులు కూడా ఎదురవుతుంటాయి. అయితే అలా ఏదొక సమయంలో ఎవరో ఉద్దేశపూర్వకంగా అన్న ఒక్క మాట మన మనసును తీవ్రంగా గాయపరుస్తుంది.
ఆఫీసులోనో, బంధువుల్లోనో ఒకరు వేగంగా ఎదుగుతుంటే లోపల ఎక్కడో చిన్న ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్, అసూయ తొంగిచూడొచ్చు. లేదంటే ఏదో ఒక చిన్న నెగిటివ్ సంఘటన రోజంతా మైండ్‌ను పట్టి పీడిస్తూ ప్రశాంతతను దూరం చేయొచ్చు.
దీనిపై సైకాలజీ చెప్పే ఒక అద్భుతమైన నిజం ఏంటంటే..మన లైఫ్‌లో జరిగే పరిస్థితులు కేవలం 10 శాతం మాత్రమే ప్రభావాన్ని చూపిస్తాయి. కానీ ఆ పరిస్థితులకు మనం ఇచ్చే రెస్పాన్స్ మాత్రమే మిగిలిన 90 శాతం మన లైఫ్ ఎలా ఉండబోతోందో నిర్ణయిస్తుంది. ఎమోషన్స్ ఉండటం మనిషికి కామన్, కానీ వాటికి మనం ఎలా రియాక్ట్ అవుతున్నామనేదే మన మెంటల్ పీస్‌ని కాపాడుతుంది.
మన లైఫ్‌లో అకస్మాత్తుగా ఏదైనా పెద్ద నష్టం జరిగి ఎక్కువ బాధ కలిగినప్పుడు, ఆ బాధను స్వీకరించడం తప్పుకాదు. కానీ దాన్నే పదే పదే తలచుకుంటూ మనసులో సుడిగుండం వంటి ఆలోచనలు తిప్పడం వల్ల ప్రయోజనం ఉండదు. దీనినే సైకాలజీలో రూమినేషన్ అంటారు. ఇలా బాధ కలిగినప్పుడు ఆ క్షణాన్ని అంగీకరిస్తూనే, దానికి అతిగా ఆలోచించడమనే ఇంధనాన్ని అందించడం మాత్రం వెంటనే ఆపేయాలి.
అలాగే మన కళ్లముందే మన తోటివారు ఒక కొత్త కారు కొన్నా, లేదా కెరీర్‌లో గొప్ప ఎత్తుకు ఎదిగినా లోపల చిన్నగా జెలసీ లేదా పోల్చుకోవడం అనేది రావడం కామన్. కానీ దానికోసమే ఆలోచిస్తూ కూర్చుంటే.. మన సగం ఎనర్జీ డ్రెయిన్ అయిపోతుంది. ఆ అసూయను అక్కడితో కట్ చేసి దానినే ఇన్స్పిరేషన్‌గా మార్చుకోండి.
కానీ ఒక్కోసారి చేయని తప్పుకు ఎవరో ఒక మాట అన్నారనో, లేదా కొలీగ్ అందరి ముందూ అరిచాడనో వెంటనే ఫీలవడం, కోప్పడటం చేస్తుంటాం. ఎదుటివారి తప్పుకు మనం బీపీ పెంచుకుని రగిలిపోవడమంటే, మన ఇంటి తాళం తీసి పరాయి వ్యక్తి చేతిలో పెట్టినట్లే అవుతుంది.
ఎదుటివారు మాటల ద్వారా, చేతల ద్వారా చూపించే అభిప్రాయం మీ అసలు విలువ కాదు. వారు తమలోని ఆలోచనలను, లిమిట్స్‌ను మీపై రుద్దే ప్రయత్నాన్ని మాత్రమే చేస్తున్నారు. అందుకే వారి మాటలను పర్సనల్‌గా అసలు తీసుకోకూడదు. నన్ను నిరూపించుకోవడానికి ఎవరి సర్టిఫికేట్లు కూడా అవసరం లేదనే కాన్ఫిడెన్స్‌ను పెంచుకుని, మీ పనితీరుతోనే అలాంటి వారికి జవాబు ఇవ్వండి.
బాధ, అసూయ, కోపం, అభద్రత అనే ఎమోషన్స్ అన్నీ మన మానసిక గృహంలోకి వచ్చి వెళ్లే టెంపరరీ గెస్టులు మాత్రమే. వచ్చిన గెస్టులను చూసి భయపడకుండా, వారితో స్టే చేయకుండా ప్రశాంతంగా పంపించేయాలి.
