Yoga
ఇప్పుడు యోగా(Yoga) అంటే ఉదయాన్నే చేసే కొన్ని ఆసనాలు , అలాగే వెయిట్ తగ్గడానికి చేసే వ్యాయామం అనే భావన పెరిగిపోయింది. కానీ, పతంజలి మహర్షి అందించిన అష్టాంగ యోగం అనేది ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎలా జీవించాలనే దానికి ఒక సంపూర్ణ మార్గదర్శిని అని చాలామందికి తెలీదు. దీనిని ఎనిమిది అంచెలుగా విభజించారు.
దీనిలో మొదటి నాలుగు అంచెలు బాహ్య ప్రపంచానికి సంబంధించినవి అయితే, చివరి నాలుగు మన అంతరంగానికి సంబంధించినవి.
మొదటిది యమ .. అంటే సమాజంలో మనం ఎలా ఉండాలని చెప్పేవి అన్నమాట. అహింస, సత్యం, దొంగతనం చేయకపోవడం వంటివి దీనిలో ఉంటాయి.
రెండోది నియమ .. ఇది మన పర్సనల్ క్రమశిక్షణను నిర్దేశిస్తుంది. శుభ్రత, సంతోషం, తపస్సు వంటివి ఇందులో భాగం.
మూడవది ఆసనం.. ఇది కేవలం బాడీని హెల్దీగా ఉంచడమే కాకుండా, ఎక్కువ సేపు ఒకే చోట కదలకుండా కూర్చునే స్థిరత్వాన్ని ఇస్తుంది.
నాలుగోది ప్రాణాయామం.. శ్వాసపై నియంత్రణ ద్వారా మన బాడీలోని నాడీ వ్యవస్థను శుద్ధి చేయడం అన్నమాట. నేటి ఉరుకుల పరుగుల టెన్షన్లు , చికాకులతో కూడిన జీవితంలో మనశ్శాంతికి ఇది చాలా కీలకం.
తర్వాతి నాలుగు అంగాలు మనసును నియంత్రించే మార్గాలుగా పతంజలి వివరించారు. దీనిలో మొదటిది ప్రత్యాహారం.. అంటే ఇంద్రియాలను బాహ్య ప్రపంచం నుంచి లోపలికి మళ్లించడం.
రెండోది ధారణ.. అంటే ఏకాగ్రతను పెంచుకోవడం. మూడోది ధ్యానం.. అంటే ఆ ఏకాగ్రతను నిత్యం కొనసాగించడం. చివరిగా సమాధి అంటే పరమాత్మతో లయమవ్వడం.
ఇప్పటి తరం యోగా(Yoga)ను కేవలం ఫిట్‌నెస్ కోసం కాకుండా.. ఈ ఎనిమిది సూత్రాలను పాటిస్తూ జీవిస్తే బీపీ, డయాబెటిస్ వంటి శారీరక సమస్యలే కాకుండా, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక వ్యాధులు కూడా దరిచేరవు. మొత్తంగా యోగా అనేది ఒక వ్యాయామం కాదు, అది ఒక సంస్కృతి, ఒక జీవన విధానం అని నేటి తరం తెలుసుకోవాలి.
