Buxa Tiger Reserve : సొరంగం తవ్వి పారిపోయిన ఆడపులి..4 రోజుల్లోనే బోల్తా కొట్టించిన ట్రిక్కీ టైగ్రెస్‌..

Buxa Tiger Reserve : పశ్చిమ బెంగాల్‌లోని బుక్సా టైగర్ రిజర్వ్‌లో విచిత్ర ఘటన జరిగింది. ఎన్‌క్లోజర్‌కు సొరంగం తవ్వి కేవలం నాలుగు రోజుల్లోనే మళ్లీ పారిపోయిన ఆడపులి న్యూస్ వైరల్ అవుతోంది.

Buxa Tiger Reserve

మూవీలలో ఖైదీలు ఎవరికీ దొరకకుండా జైలు నుంచి తప్పించుకోవడానికి సొరంగాలు తవ్వి ఎస్కేప్ అవడం మనం చాలాసార్లు చూశాం. బయట కూడా ఇలాంటి సీన్లు కనిపిస్తుంటాయి. కానీ ఒక అడవి జంతువు, అది కూడా ఒక పులి ఏకంగా టన్నెల్ తవ్వి మరీ పారిపోవడమే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

అడవి పులికి వేటలో మాత్రమే కాదు, ప్లానింగ్‌లో కూడా తనకు ఎవరూ సాటి రారని మరోసారి ప్రూవ్ చేసింది .పశ్చిమ బెంగాల్‌లోని ఫేమస్ బుక్సా టైగర్ (Buxa Tiger Reserve) ఫారెస్ట్ అధికారులకే చుక్కలు చూపించిన ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఇటీవలే అసోం నుంచి నానా తంటాలు పడి, ఎన్నో రోజులు కష్టపడి మరీ పట్టుకొచ్చి ఎన్‌క్లోజర్‌లో బంధించిన కేవలం నాలుగో రోజే ఆ పులి మాయమైంది. అది కూడా అటవీ సిబ్బంది కంటికి చిక్కకుండా కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా నేలకు.. సొరంగం తవ్వి మరీ అక్కడి నుంచి జారుకోవడం ఇప్పుడు వైల్డ్‌లైఫ్ సర్కిల్స్‌లో వైరల్‌గా మారింది.

బెంగాల్‌లో పులుల నెంబర్‌ను పెంచే మెగా ప్రాజెక్ట్‌లో భాగంగా బీహార్‌లోని వాల్మీకి టైగర్ రిజర్వ్ నుంచి ‘టీ-138’ అనే మూడేళ్ల ఆడపులిని ఇక్కడికి తీసుకుని వచ్చారు. అక్టోబర్ 2వ తేదీన బుక్సాలోని 25వ మైలు వద్ద ఉన్న భారీ ఎన్‌క్లోజర్‌లో ఈ పులిని వదిలారు. అయితే దానికి ఆ వాతావరణం నచ్చలేదో ఏమో కానీ, అక్టోబర్ 4వ తేదీనే ఫెన్సింగ్ దాటి సంకోష్ నదిని ఈదుకుంటూ అసోంలోని రైమోనా ప్రాంతానికి పరారైంది.

దీంతో ఫారెస్ట్ అధికారులు హడలిపోయి, నానా తిప్పలు పడి చివరకు నవంబర్ 3వ తేదీన ఆ ఆడపులిని గుర్తించి దానికి మత్తుమందు ఇచ్చి మరీ మళ్లీ పట్టుకొచ్చి అదే ఎన్‌క్లోజర్‌లోకి  భద్రంగా చేర్చి  తాళం వేశారు. ఇక పులి ఎక్కడికీపోదని అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారు.

కానీ ఆ పులి ..సరిగ్గా నవంబర్ 8 వ తేదీ ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటన్నర ప్రాంతంలో ఎన్‌క్లోజర్ ఫెన్సింగ్ పునాది కింద ఉన్న మట్టిని సొరంగంలా తవ్వి మరీ, సిబ్బంది కళ్లుగప్పి బయటకు పారిపోయింది. ప్రస్తుతం అది బాలా నదిని కూడా దాటేసి తూర్పు వైపుగా మళ్లీ అసోం వైపే వెళుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

సాధారణంగా కుక్కలు, నక్కలు, హైనాలు మాత్రమే ఇలా నేలను తవ్వుతాయని, పులులు ఇలా సొరంగాలు తవ్వి ఎస్కేప్ అవ్వడం అసాధ్యమని నిపుణులు కూడా షాక్ అవుతున్నారు. ఎన్‌క్లోజర్ కట్టడంలో నిర్మాణ లోపాలున్నాయా లేక ఆ పులి ఇలా కొత్త ట్రిక్ తెలుసుకుందా అంటూ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

Winter Weather : మొదలైన చలి కాలం..ఉదయం పొగమంచు,రాత్రి వేళల్లో చలిగాలులు..

↑
Exit mobile version