By Poll Elections
దేశ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరిగింది. సాధారణ ఎన్నికలు ముగిసిన కొన్ని నెలలకే కొన్ని రాష్ట్రాల్లో పొలిటికల్ క్లైమాక్స్‌ను గుర్తుచేస్తూ 6 స్థానాల్లో బై పోల్ పోలింగ్(By Poll Elections) ప్రక్రియ ముమ్మరంగా ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాంతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ముఖ్యమైన నియోజకవర్గాల్లో ఓటింగ్ సాగుతోంది.
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో గెలిచిన నేతలు.. తమ అదనపు స్థానాలకు రాజీనామా చేయడంతో ఈ బై పోల్స్(By Poll Elections) తప్పనిసరిగా మారాయి. ఇవి కేవలం నాయకుల రాజీనామాలతో ఖాళీ అయిన సీట్లను భర్తీ చేసే మామూలు ఎన్నికలు కావని.. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఏ పార్టీ వైపు గాలి బలంగా వీయనుందో తేల్చబోయే అతిపెద్ద పొలిటికల్ ఇండికేటర్స్ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ మినీ పొలిటికల్ వార్‌లో అందరి కళ్లూ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్, రెజినగర్ అసెంబ్లీ స్థానాల వైపే ఉన్నాయి. ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ సాధించి బెంగాల్‌లో మొట్ట మొదటిసారి పీఠాన్ని దక్కించుకున్న బీజేపీకి ఇక్కడ నెగ్గడం చాలా ప్రతిష్టాత్మకంగా మారింది.
ముఖ్యంగా నందిగ్రామ్ ప్లేస్ పొలిటికల్ డ్రామాకు, సెంటిమెంట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. ఇక్కడ ఏప్రిల్ ఘన విజయం తర్వాత దారుణ హత్యకు గురైన సీఎం సువేందు అధికారి మాజీ సహాయకుడు చంద్రనాథ్ రాథ్ తల్లి.. హసిరాణి రాథ్‌ను ఇప్పుడు బీజేపీ బరిలోకి దించింది. అయితే ఇక్కడ ప్రతిపక్షాల మధ్య ఐక్యత లేకపోవడం బీజేపీకి కలిసి వచ్చే అంశంగా మారింది.
కాకపోతే మమతా బెనర్జీ వర్గం తమ కేండిడేట్‌ను వెనక్కి తీసుకుని కాంగ్రెస్ అభ్యర్థి అయిన మిలన్ ప్రధాన్‌కు మద్దతు ఇవ్వగా, తృణమూల్ మరో ఫ్యాక్షన్ నుంచి మహమ్మద్ ఎతేషాముల్ హక్ రేసులో ఉన్నారు. పైగా ఈ ఎన్నికలలో సీపీఐ కూడా బరిలో నిలవడంతో పోటీ చాలా ఆసక్తికరంగా మారింది.
ఇక దక్షిణాన తమిళనాడు కథ అయితే పూర్తిగా వేరే లెవెల్‌లోనే ఉంది. మధురాంతకం, ధారపురం అసెంబ్లీ స్థానాల్లో తాజాగా రాజకీయ సమీకరణాలు తారుమారయ్యాయి. ఏఐఏడీఎంకే మాజీ ఎమ్మెల్యేలు కె.మరగతం కుమారవేల్, పి.సత్యభామ తమ పాత పార్టీకి గుడ్ బై చెప్పేసి, హీరో జోసెఫ్ విజయ్ స్థాపించిన టీవీకే పార్టీలో చేరి ఆ టికెట్లపైనే ఇప్పుడు బరిలోకి దిగారు.
దీంతో ఇక్కడ టీవీకే, డీఎంకే, ఏఐఏడీఎంకే , సీపీఐల మధ్య నాలుగు వైపులా కూడా హోరాహోరీ పోరు నడుస్తోంది. మధురాంతకంలో 27 మంది, ధారపురంలో ఏకంగా 30 మంది అభ్యర్ధులు పోటీ పడుతుండటంతో ఈ ఓట్ల చీలిక ఎవరి కొంప ముంచుతుందోననే టెన్షన్ అన్ని పార్టీల్లో కనిపిస్తోంది.
ఈ అసెంబ్లీ పోరుతో పాటు పుదుచ్చేరిలోని తట్టన్‌చావడితో పాటు అస్సాంలోని నాగావ్ లోక్‌సభ స్థానానికి కూడా పోలింగ్ జరుగుతోంది. ఈ స్థానాల్లో గెలుపోటములు స్థానిక అధికార కూటముల సత్తా ఏంటనేది నిరూపించనున్నాయి. అక్టోబర్ 9వ తేదీన జరిగే కౌంటింగ్‌లో బాక్సులు ఓపెన్ అయ్యాక ఈ అభ్యర్థులందరి జాతకాలు బయటపడతాయి. మరి ఈ రిజల్ట్స్ బీజేపీకి జోరు పెంచుతాయా? ప్రధాన ప్రతిపక్షంగా ఎవరు ఉండాల్సి వస్తుంది? ప్రాంతీయ పార్టీలు తమ పవర్‌ను ఎంత వరకూ నిలబెట్టుకుంటాయనేది తెలియాలంటే మరో మూడు రోజులు వెయిట్ చేయాల్సిందే.
