CM Vijay
తమిళనాడు రాజకీయాల్లో నిలదొక్కుకోవడం అంత ఈజీ ఏం కాదు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తమిళ ప్రజల అభిమానం సంపాదించుకోవడం అంటే నిజంగా పెద్ద సవాలే. ఎంజీఆర్ తర్వాత పార్టీ పెట్టిన తక్కువ సమయంలోనే అధికారంలోకి వచ్చిన ఘనతను టీవీకే అధినేత, నటుడు విజయ్ సొంతం చేసుకున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దళపతి తనదైన పాలనతో ముందుకెళుతున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించడమే కాదు సామాన్యుల సమస్యల పరిష్కారం పైనే ఫోకస్ పెట్టారు.
ఎందుకంటే విజయ్ పార్టీ అంచనాలకు అందకుండా ఎక్కువ సీట్లు గెలవడంలో యువత, మహిళలే కీలక పాత్ర పోషించారు. అందుకే వారి సంక్షేమ పథకాల పైనా, వారి సమస్యల పరిష్కారంపైనా విజయ్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే సంచలన నిర్ణయాలతో ముందుకెళుతున్నారు.
గత ప్రభుత్వాలతో పోలిస్తే ఫైళ్ల క్లియరెన్స్ పై విజయ్(CM Vijay) ఎక్కువ దృష్టి సారించారు. దీని కోసం సచివాలయంలో తీరిక లేకుండా గడుపుతూ అధికారులకు దిశా నిర్థేశం చేస్తున్నారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా ఆకస్మిక తనిఖీలతో తనదైన మార్క్ చూపిస్తున్నారు.
తాజాగా చెన్నైలోని ఎగ్మోర్ ప్రభుత్వ మహిళా, శిశు హాస్పిటల్‌ను సీఎం విజయ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తమిళనాడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కేజీ అరుణ్ రాజ్, ఉన్నతాధికారులతో కలిసి ఆసుపత్రికి వచ్చిన ఆయన.. ప్రసూతి, గైనకాలజీ సహా కొన్ని వార్డులను పరిశీలించారు. అక్కడ రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాల గురించి వారినే అడిగి తెలుసుకున్నారు.
ఆసుపత్రి సిబ్బంది లంచాలు డిమాండ్ చేసినట్టు, సమయానికి ఆహారం ఇవ్వడం లేదంటూ వచ్చిన ఆరోపణలకు సంబంధించి సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. దీనిపై స్పందించిన సీఎం విజయ్ ఆరోగ్యశాఖ మంత్రి, ఇతర అధికారులను ఆరా తీశారు. తాజాగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి స్వయంగా అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు.
తర్వాత డాక్టర్లు, సిబ్బందితో సీఎం విజయ్ సమావేశమయ్యారు. ఆసుపత్రిలో రోగులకు సేవలందించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారులతో సమన్వయం చేసుకుని పరిష్కరించాలని ఆదేశించారు. ఇకపై రోగుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని డాక్టర్లు, సిబ్బందికి చెప్పారు. కాగా హాస్పిటల్ తనిఖీల్లో బిజీగా ఉన్నా సరే..విజయ్ కొంతమంది చిన్నారులను ఎత్తుకుని సందడి చేయడం అందరి దృష్టిని ఆకట్టుకుంది.
Sharad Pawar : మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం..షిండేతో శరద్ పవార్ భేటీ దేనికి సంకేతం?
