Delimitation Bill
గత కొంతకాలంగా జరుగుతున్న నియోజకవర్గాల పునర్విభజన అంశం కొలిక్కి వచ్చింది. డీలిమిటేషన్(Delimitation Bill) పై కేంద్రం కీలక ప్రతిపాదనలు చేసింది. లోక్ సభ సీట్ల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న 543 స్థానాలు 850కి పెరగనున్నాయి. ఈ మేరకు కేంద్రం ఆర్టికల్ 81ను సవరించి లోక్ సభ సీట్ల సంఖ్యను పెంచే ప్రతిపాదన చేసింది.
పెరగనున్న కొత్త సీట్ల సంఖ్య ప్రకారం రాష్ట్రాలకు 815 లోక్ సభ స్థానాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 35 లోక్ సభ స్థానాలు రానున్నాయి. తాజా ప్రతిపాదనలతో రాజ్యాంగ సవరణ బిల్లుపై ఎంపీలకు కేంద్రం సమాచారం అందించింది. కాగా కొత్త లోక్ సభ సీట్ల పెంపు 2029 ఎన్నికల నుంచి అమల్లోకి వచ్చే అవకాశాముంది.
కాగా జనగణనతో సంబంధం లేకుండా ఈ నియోజకవర్గాల పెంపు జరగబోతోంది. నియోజకవర్గాల సంఖ్య పెంచడానికి వీలుగా ముందు మహిళా రిజర్వేషన్ చట్టం, డీలిమిటేషన్ చట్టాలకు సవరణలు ప్రతిపాదించిన కేంద్రం గురువారం నుంచి ఆరంభమయ్యే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బిల్లులు తీసుకు రానుంది.
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్‌ల నేతృత్వంలో ప్రత్యేక సమావేశం ఇప్పటికే జరిగింది. కాంగ్రెసేతర విపక్షాలతోనూ విడిగా భేటీ అయ్యారు. అటు ప్రధాన మంత్రి మోదీ పార్టీలకు అతీతంగా ఎంపీలందరికీ లేఖ రాసారు.
అయితే విపక్షాలు మాత్రం కేంద్రం చేసిన ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నాయి. దీని కోసం 2011 జనాభా లెక్కల డేటాను ఉపయోగించడం సరికాదంటున్నాయి. కొత్త ప్రక్రియను 2021 జనాభా లెక్కల ఆధారంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ కేంద్రం మాత్రం విపక్షాల వాదనను పట్టించుకోవడం లేదు.
ఈ సమావేశాల్లోనే బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా పావులు కదుపుతోంది. ఈ బిల్లులు పాసయ్యేందుకు తటస్థ పార్టీల మద్దతు తీసుకోవాలని కూడా నిర్ణయించింది. కాగా డీలిమిటేషన్(Delimitation Bill) తో తెలంగాణలో 60 అసెంబ్లీ, 9 లోక్ సభ స్థానాలు పెరిగే అవకాశముంది. దీంతో ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాల సంఖ్య 179కి పెరగనుంది. అలాగే లోక్ సభ స్థానాల సంఖ్య 17 నుంచి 26 కానున్నాయి.
అలాగే ఏపీలో ప్రస్తుతం 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లు ఉన్నాయి. డీలిమిటేషన్ తర్వాత ఏపీలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 175 నుంచి 263కు పెరుగుతుందని అంచనా. అలాగే లోక్‌సభ సీట్లు 37 వరకూ పెరగొచ్చని అంచనా వేస్తున్నారు, ఇక మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తే 12 నుంచి 13 ఎంపీ సీట్లు వారికే కేటాయించే అవకాశాలు ఉన్నాయి.
Intermediate:రేపే ఏపీ ఇంటర్ ఫలితాల విడుదల..ఎక్కడ, ఎలా చూసుకోవాలో తెలుసా?
