E20 Petrol
ఈ మధ్య సోషల్ మీడియాలో E20 పెట్రోల్(E20 Petrol ).. అంటే 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ గురించి రకరకాల న్యూస్‌లు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ పెట్రోల్ వాడితే బైక్‌లు, కార్ల ఇంజిన్లు పాడైపోతున్నాయని, మైలేజ్ కూడా దారుణంగా పడిపోతుందని ప్రచారం వినిపిస్తోంది.
అంతేకాదు, ఈ పెట్రోల్ కొట్టించాక వెహికల్‌కు ఏమైనా అయినా కూడా ఇన్సూరెన్స్ కూడా రాదంటూ కొంతమంది వీడియోలను షేర్ చేస్తున్నారు. అయితే ఈ పుకార్లపై రియాక్టయిన కేంద్ర పెట్రోలియం శాఖ .. అవన్నీ అబద్ధాలని కొట్టిపారేస్తూ, అసలు నిజాలేంటో వివరించింది.
కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు విదేశాల నుంచి కొనే పెట్రోల్ భారాన్ని తగ్గించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 2023లో.. ఈ E20 పెట్రోల్(E20 Petrol)ను అందుబాటులోకి తెచ్చింది. అయితే, దీన్ని ఏదో హడావుడిగా అప్పటికప్పుడు తీసుకురాలేదు. నిజానికి భారత దేశంలో 2003 నుంచే పెట్రోల్‌లో ఇథనాల్ కలుపుతూనే ఉన్నారు.
కార్లు, బైక్‌లు తయారు చేసే కంపెనీలతో గవర్నమెంట్ ప్రత్యేకంగా మాట్లాడటమే కాకుండా.. అన్ని రకాల పరీక్షలు చేసాక ఈ20 పెట్రోల్‌ను బంకుల్లోకి తెచ్చారు. దీనివల్ల వెహికల్స్ పాడైపోవు. అంతెందుకు 2023 నుంచి ఇప్పటివరకు ఈ పెట్రోల్ వల్ల ఒక్క వెహికల్ ఇంజిన్ కూడా చెడిపోలేదని, ఎక్కడా వెహికల్స్ ఆగిపోలేదని గుర్తు చేసింది.
సోషల్ మీడియాలో కొంతమంది పెట్రోల్‌లో డైరెక్టుగా చెరకు రసం కలిపేస్తున్నట్లు వీడియోలు చూపిస్తున్నారు. కానీ దానిలో ఏమాత్రం నిజం లేదు. మన దేశంలో ఇథనాల్‌ను చెరకు రసం, కార్న్, నూకల నుంచి తయారు చేస్తారు. అయితే, ఆ ఇథనాల్‌ను అలాగే పెట్రోల్‌లో డైరెక్టుగా కలిపేయరు.
ఫ్యాక్టరీల్లో దాన్ని బాగా ప్రాసెస్ చేసి, దానిలో ఉండే షుగర్ మొత్తాన్ని పూర్తిగా తీసేస్తారు. అలా కెమికల్ ప్రాసెస్ ద్వారా తయారైన ఫ్యూయల్-గ్రేడ్ ఇథనాల్‌ను మాత్రమే పెట్రోల్‌లో కలుపుతారు. కాబట్టి ట్యాంక్‌లో షుగర్ పేరుకుపోతుందని వస్తున్న వార్తలు అబద్ధం మాత్రమే.
ఈ పెట్రోల్ వాడితే ట్యాంక్ మూతల దగ్గర చీమలు, పురుగులు పడుతున్నాయని కొంతమంది వీడియోలు కూడా పెడుతున్నారు. కానీ, ఇథనాల్ తయారు చేసేటప్పుడే దానిలో పురుగులు, కీటకాలు వంటివి రాకుండా ఉండటానికి కొన్ని కెమికల్స్ కలుపుతారు. కాబట్టి చీమలు వస్తాయనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు.
ఇక మైలేజ్ విషయానికి వస్తే.. E20 వల్ల మైలేజ్ 20 నుంచి 30 శాతం తగ్గిపోతుందనే మాటల్లోనూ కూడా ఏమాత్రం నిజం లేదు. ఎందుకంటే క్వాలిటీ టెస్ట్‌లు చేసినప్పుడే మైలేజ్‌లో అంత పెద్ద తేడా ఏమీ రాదని తేలింది.
అలాగే ఈ20 పెట్రోల్(E20 Petrol) వాడితే వెహికల్ ఇన్సూరెన్స్ రాదనేది కూడా పెద్ద అబద్ధం. వెహికల్‌కి యాక్సిడెంట్ అయినప్పుడు ఇన్సూరెన్స్ రావడమనేది పాలసీ రూల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతే తప్ప, గవర్నమెంట్ బంకుల్లో అధికారికంగా అమ్మే పెట్రోల్ కొట్టిస్తే.. ఇన్సూరెన్స్ ఆపేసే హక్కు ఏ కంపెనీకి కూడా ఉండదు. ఇంధనానికి, ఇన్సూరెన్స్‌కు అస్సలు సంబంధం ఉండదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది.
వాహనదారులలో లేనిపోని భయాలు కలిగించడానికి కొంతమంది పాత వీడియోలను, ఎడిట్ చేసిన ఫోటోలను మళ్లీ మళ్లీ షేర్ చేస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. తాము అన్ని జాగ్రత్తలు తీసుకుని, అన్ని టెస్ట్‌లు చేసిన తర్వాతే ఈ పెట్రోల్‌ను తీసుకువచ్చామని.. వాహనదారులెవరూ కూడా ఇలాంటి సోషల్ మీడియా పుకార్లను నమ్మి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని కేంద్రం చెప్పింది.
