IND vs ENG : శుభారంభం ఎవరిదో ?..రెండో టీ20కి భారత్,ఇంగ్లాండ్ రెడీ..

IND vs ENG : రెండో మ్యాచ్‌తో సిరీస్‌లో శుభారంభం చేయాలని రెండు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఐర్లాండ్ సిరీస్‌లో ఓటమితో విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా ఇంగ్లీష్ గడ్డపై దుమ్మురేపాలని ఎదురుచూస్తోంది.

IND vs ENG

భారత్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది. తొలి టీ ట్వంటీలో భారత్ మంచి స్కోరే చేసినా సరే సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో భారీ వర్షం కురిసింది. ఫలితంగా మ్యాచ్ రద్దయింది.

ఇప్పుడు రెండో మ్యాచ్‌తో సిరీస్‌లో శుభారంభం చేయాలని రెండు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఐర్లాండ్ సిరీస్‌లో ఓటమితో విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా ఇంగ్లీష్ గడ్డపై దుమ్మురేపాలని ఎదురుచూస్తోంది. ఇంగ్లాండ్‌(IND vs ENG)పై టీ20 సిరీస్ గెలిచి ఐర్లాండ్ ఓటమితో వచ్చిన విమర్శలకు చెక్ పెట్టాలని పట్టుదలగా ఉంది.

ప్రస్తుతం భారత తుది జట్టు కూర్పుపైనే సస్పెన్స్ నెలకొంది. చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకుంటారా లేదా అనేది ఆసక్తిగా మారింది. ఐర్లాండ్‌పై రెండు మ్యాచ్‌లలోనూ, ఇంగ్లాండ్‌పై తొలి టీ20లోనూ సంజూ శాంసన్ విఫలమయ్యాడు. దీంతో సంజూ స్థానంలో వైభవ్‌కు అవకాశాలివ్వాలన్నది మాజీ క్రికెటర్ల అభిప్రాయం.

అయితే టీమిండియా మేనేజ్మెంట్ మాత్రం అతని విషయంలో క్లారిటీగానే ఉన్నట్టు తెలుస్తోంది. ప్రపంచకప్ విజయంలో కీలకపాత్ర పోషించిన సంజూ శాంసన్‌కు వరుస అవకాశాలు ఇస్తామని గతంలోనే టీమ్ మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. అయితే రెండో టీ20 సంజూకు చివరి అవకాశంగా చెప్పొచ్చు.

మిగిలిన జట్టులో పెద్దగా మార్పులు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఓపెనర్లుగా సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ఆడనుండగా.. వన్ డౌన్‌లో ఇషాన్ కిషన్ తర్వాత శ్రేయాస్ అయ్యర్, తిలక్ వర్మ, శివమ్ దూబే బరిలోకి దిగుతారు.

అభిషేక్ శర్మ తొలి టీ20లో అదరగొట్టాడు. తన ఫామ్ కొనసాగిస్తూ హాఫ్ సెంచరీ బాదాడు. మిగిలిన బ్యాటర్లు కూడా చెలరేగితే భారీ స్కోరు ఖాయం. శ్రేయాస్ అయ్యర్ కూడా సూపర్ ఫామ్‌లో ఉండగా చివర్లో శివమ్ దూబేపై అంచనాలున్నాయి.

IND vs ENG

అటు పేస్ విభాగంలో హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్ కీలకం కానున్నారు. మరో పేసర్ కావాలనుకుంటే మాత్రం ప్రిన్స్ యాదవ్ ఆడతాడు. అప్పుడు రవి బిష్ణోయ్‌ను తప్పించాల్సి ఉంటుంది. స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ ఆడనున్నారు.

మరోవైపు ఇంగ్లాండ్ తుది జట్టులో పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదు. తొలి మ్యాచ్‌లో ఆడిన ప్లేయింగ్ ఎలెవన్‌తో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే రెండో టీ20కి కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. అయితే మ్యాచ్ రద్దయ్యే పరిస్థితి ఉండదని , మధ్య మధ్యలో వరుణుడు అంతరాయం కలిగించే అవకాశముందని చెబుతున్నారు.

Pakistan : సింధు నది బిడ్డలమంటూ పాక్ సరికొత్త రాగం.. ఆ 3 కారణాలతోనే రూట్ మార్చిందా?

Exit mobile version