Hydrogen Train
దూర ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో, సౌకర్యవంతంగా ప్రయాణించాలంటే చాలా మంది ఎన్నుకునే మార్గం రైలు ప్రయాణమే. ఎన్నో ఏళ్లుగా భారతీయ రైల్వే ప్రజలకు విశేష సేవలందిస్తోంది. కాలంలో మార్పులకు అనుగుణంగానే ముస్తాబవుతూ ముందుకు సాగుతోంది.
తాజాగా భారత రైల్వేలో సరికొత్త శకం మొదలుకాబోతోంది. భారతదేశపు మొట్టమొదటి పర్యావరణ అనుకూల గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రధాని మోదీ హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభించబోతున్నారు. దీంతో ఈ రైలు ప్రత్యేకతలను గురించి తెలుసుకోవడానికి చాలా మంది ఇంటర్నెట్‌లో తెగ వెతికేస్తున్నారు.
దీని ప్రత్యేకతలను చూస్తే ఇది హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్రొపల్షన్ సిస్టమ్‌తో నడుస్తుంది. హైడ్రోజన్‌ను విద్యుత్తుగా మార్చి రైలును నడుపుతుంది. దీని వల్ల కాలుష్యానికి బదులు కేవలం నీరు, ఆవిరి మాత్రమే విడుదలవుతాయి. ఈ రైలు గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల ఆపరేషనల్ వేగంతో ప్రయాణించడానికి అనుమతి పొందింది.
స్వదేశీ సాంకేతికతోనే హైడ్రోజన్ రైలును తయారు చేశారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో దీనిని రూపొందించారు. దీనిలో 2 డ్రైవింగ్ పవర్ కార్లు, 8 ప్రయాణికుల కోచ్‌లతో కలిపి మొత్తం 10 బోగీలు ఉంటాయి. రైలుకు నిరంతరం హైడ్రోజన్ అందించడానికి జింద్‌లో దేశంలోనే అతిపెద్ద 3,000 కేజీల సామర్థ్యం గల హైడ్రోజన్ రీఫ్యూయలింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు.
ఈ తొలి హైడ్రోజన్ రైలు హర్యానాలోని జింద్ – సోనిపట్ మధ్య ఉన్న 89 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. రోజుకు రెండు రౌండ్ ట్రిప్పులు తిరుగుతూ దాదాపు 356 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. జింద్ సిటీ, గోహనా వంటి మొత్తం 12 స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.
ఈ రైలులో ఒకేసారి దాదాపు 2,600 మంది ప్రయాణికులు ప్రయాణించొచ్చు. సంప్రదాయ డీజిల్ ఇంజిన్లతో పోలిస్తే ఇవి చాలా తక్కువ శబ్దంతో నడుస్తాయి. ఈ ప్రాజెక్ట్‌తో జర్మనీ, జపాన్, చైనా, అమెరికా వంటి దేశాల సరసన భారత్ కూడా హైడ్రోజన్ రైలు సాంకేతికత కలిగిన ఎలైట్ క్లబ్‌లో చేరింది.
విదేశాల్లో కేవలం 2 లేదా 3 కోచ్‌ల చిన్న రైళ్లను నడుపుతుండగా, భారత్ ఒకేసారి 10 కోచ్‌ల సుదీర్ఘమైన హైడ్రోజన్ రైలు(Hydrogen Train)ను ప్యాసింజర్ సేవల్లోకి తెచ్చి సరికొత్త రికార్డు సృష్టించింది.
వికసిత భారత్ లక్ష్యాలను చేరుకునే క్రమంలో 2047 నాటికి దేశవ్యాప్తంగా కనీసం 50 హైడ్రోజన్ రైళ్లను విజయవంతంగా నడపాలని సుదూర లక్ష్యంగా పెట్టుకుంది. కాగా భారతీయ రైల్వేలో కాలుష్యాన్ని తగ్గించి, నెట్-జీరో కార్బన్ ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ హైడ్రోజన్ రైలు(Hydrogen Train) ప్రాజెక్ట్ అత్యంత కీలకంగా మారనుంది.
Puri Jagannath Rath Yatra : పూరీ రథయాత్రలో విషాదం..తొక్కిసలాటలో భక్తుడు మృతి
