Gold Jewellery Sales : ధంతేరాస్,దీపావళికి పెరిగిన పసిడి విక్రయాలు..గతేడాదితో పోలిస్తే 30 శాతం పెరిగిన అమ్మకాలు..

Gold Jewellery Sales : బంగారం, వెండి విక్రయాల పురోగతిపై ఐబీజేఏ ప్రతినిధులు స్పందిస్తూ, ధరలు తగ్గుముఖం పట్టడంతో గతంలో గోల్డ్, సిల్వర్ కొనాలని వాయిదా వేసుకున్న వినియోగదారులంతా ఈసారి మళ్లీ మార్కెట్‌లోకి వచ్చారని తెలిపారు.

Gold Jewellery Sales

భారతీయ సంస్కృతిలో అత్యంత ప్రాధాన్యం ఉన్న ధంతేరాస్, దీపావళి పండగల సీజన్‌లో పుత్తడి మార్కెట్ ఎప్పుడూ కూడా కొత్త కళను సంతరించుకుంటుందన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు కొద్దిగా తగ్గడంతో వినియోగదారులు గోల్డ్ అండ్ సిల్వర్ కొనడానికి రికార్డు స్థాయిలో షోరూమ్‌లకు పోటెత్తడం ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఈ ధంతేరాస్, దీపావళి పండగ సీజన్‌లో గోల్డ్ విక్రయాలు ఏకంగా 30 శాతం పెరిగినట్లు తాజాగా ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) వెల్లడించింది.

ఐబీజేఏ విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఈ ధంతేరాస్, దీపావళి పండగ సీజన్‌లో దేశవ్యాప్తంగా సుమారు 52 టన్నుల బంగారం అమ్ముడైంది. దీని మొత్తం విలువ దాదాపు రూ.72,000 కోట్లుగా ఉంది. కేవలం గోల్డ్ మాత్రమే కాకుండా సిల్వర్ విక్రయాలు కూడా 10 శాతం పెరిగి 300 టన్నులకు చేరి.. దీని విలువ రూ.5,400 కోట్లుగా నమోదైంది. ఇటీవల 10 గ్రాముల పుత్తడి ధర గరిష్ఠ స్థాయికి వెళ్లి.. దాని తర్వాత రూ.1.42 లక్షల స్థాయికి తగ్గడంతో కొనుగోళ్లు పుంజుకోవడానికి ప్రధాన కారణంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ఈ బంగారం, వెండి విక్రయాల పురోగతిపై ఐబీజేఏ ప్రతినిధులు స్పందిస్తూ, ధరలు తగ్గుముఖం పట్టడంతో గతంలో గోల్డ్, సిల్వర్ కొనాలని వాయిదా వేసుకున్న వినియోగదారులంతా ఈసారి మళ్లీ మార్కెట్‌లోకి వచ్చారని తెలిపారు. నవంబర్ మధ్యలో ప్రారంభమయ్యే వివాహాల సీజన్ కోసం ముందుగా షాపింగ్ చేయడం, సెంటిమెంట్ యాడ్ అవడంతో పాటు,ఈ పండగలు నెల ప్రారంభంలో రావడంతో జీతాలు, బోనస్ డబ్బులు అందుబాటులో ఉండటం ఈ వ్యాపారానికి బాగా కలిసివచ్చింది.

ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ వరకు చూస్తే ఎక్కువ ధరలతో పాటు ఇంపోర్ట్ డ్యూటీస్ కారణంగా విక్రయాలు 50 శాతం వరకు మందగించినా, ఈ పండగ సీజన్ మాత్రం బంగారం, వెండి వ్యాపారులకు తీపి కబురు అందించింది. ధరలలో హెచ్చుతగ్గులు ఉన్నా కూడా, భారతీయులకు పుత్తడిపై ఉన్న నమ్మకం, సాంస్కృతిక అనుబంధం వంటివి ఏమాత్రం తగ్గలేదని ఈ కొనుగోళ్ల జోరు క్లారిటీ ఇచ్చింది.

AI Copyright Rules : గూగుల్, మెటా, టిక్‌టాక్‌లకు ఇండోనేషియా షాక్..ఏఐ డేటా వినియోగంపై బిగ్ టెక్ దిగ్గజాల కలవరం

↑
Exit mobile version