Amla Tree
తెలుగువారి హిందూ సాంస్కృతిక వైభవంలో కార్తీక మాసానికి ఉన్న ప్రాముఖ్యత చాలా ప్రత్యేకమైనది. ఈ పవిత్రమైన మాసంలో నదీ స్నానాలు, సూర్యోదయానికి ముందే దీపారాధన చేయడం ఎలాంటి పుణ్యఫలాన్ని ఇస్తాయో, ధాత్రి వృక్షం అంటే ఉసిరి చెట్టు(Amla Tree)ను పూజించడం అలాగే దాని కింద వనభోజనాలు చేయడం కూడా అంతే విశిష్టమైన ఫలితాలనిస్తుంది.
మన పురాణాలు చెబుతున్నదాని ప్రకారం ఉసిరి చెట్టులో సాక్షాత్తు శ్రీమహావిష్ణువుతో పాటు సమస్త దేవతలు నివసిస్తారు. అందుకే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు(Amla Tree)ను ఆరాధించడం వల్ల అపారమైన పుణ్యం లభిస్తుందని పండితులు,పెద్దలు చెబుతారు.
ధాత్రి వృక్షం లక్ష్మీనారాయణుల కన్నీటి బిందువుల నుంచి ఉద్భవించిందని పురాణాలు చెబుతాయి. కార్తీక మాసంలో విష్ణుమూర్తి ఈ ఉసిరి చెట్టు మొదట్లో, అలాగే బ్రహ్మదేవుడు చెట్టు కొమ్మల్లోనూ, పరమశివుడు దాని పైభాగంలో కొలువై ఉంటారని భక్తులు నమ్ముతారు. అందుకే ఈ మాసంలో ఉసిరి కాయలపై బియ్యం పిండితో ప్రమిదలను చేసి, ఆవు నెయ్యితో దీపాలను వెలిగించి ఈ చెట్టు కింద ఉంచడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందుల నుంచి ముక్తి లభించి, కుటుంబంలో ఐశ్వర్యం కూడా వెల్లివిరుస్తుంది.
ఇక కార్తీక వనభోజనాల విషయానికి వస్తే.. ఇది కేవలం వినోదాలను షేర్ చేసుకోవడం కోసం చేసుకునే పిక్నిక్ మాత్రమే కాదు. దీని వెనుక చాలా లోతైన ఆధ్యాత్మిక, ఆరోగ్యకరమైన పరమార్థం ఉంది. వనభోజనాల సమయంలో ముందుగా ఉసిరి చెట్టు కింద శ్రీమహావిష్ణువు ఫోటోను లేదా విగ్రహాన్ని ఉంచి, పసుపు కుంకుమలు, ధాత్రి అష్టోత్తరంతో పూజించి నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఆ తర్వాత ఉసిరి చెట్టు నీడలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులంతా కలిసి భోజనం చేస్తారు.
ఉసిరి చెట్టు నుంచి వచ్చే గాలి అత్యంత పవిత్రమైనది.అలాగే విటమిన్ సీ, గాలిలోని ప్రాణవాయువును శుద్ధి చేసే ఔషధ గుణాలు కలిగినది. ఈ చెట్టు కింద కూర్చుని భోజనం చేయడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుందని ఇది చలికాలంలో ఆరోగ్యాన్ని బాగా పెంచుతుందని ఆయుర్వేదంలో కూడా చెప్పబడింది.
అంతేకాకుండా ఇప్పటి ఆధునిక కాలంలో ఉరుకుల పరుగుల జీవితంలో పడి ఉక్కిరిబిక్కిరి అవుతున్న కుటుంబాలను, రోజువారీ ఒత్తిడితో సతమతమవుతున్న మనుషులకు దూరంగా ఉంటున్నవారందరినీ ఒకచోట చేర్చడానికి ఈ వనభోజనాలు ఒక అద్భుతమైన వంతెనలా పనిచేస్తాయి.
ప్రకృతి ఒడిలో టెన్షన్లు , ఈగోలు మర్చిపోయి అందరూ కలిసి ఆటపాటలతో గడపడం వల్ల మానసిక ఉల్లాసం కలగడమే కాదు..బంధుత్వాలు, స్నేహాలు మరింతగా గట్టిపడతాయి. మన పెద్దలు అందించిన ఈ అరుదైన సాంప్రదాయం ఆధ్యాత్మికతను, ఆరోగ్యాన్ని, సోషల్ యూనిటీని భవిష్యత్ తరాలకు అందించడంలో వనభోజనాలు కీలక పాత్రను పోషిస్తాయి.
