Weather Report : మరో అల్పపీడనంపై ఐఎండీ అప్‌డేట్..దసరా సమయంలో వానలు భయపెడతాయా?

Weather Report : ఉత్తర అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం రూపుదిద్దుకోవడానికి ప్రస్తుత రుతుపవన పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

Weather Report

శరన్నవరాత్రోత్సవాల సమయంలో దేవీ పూజలకు దేశం అంతా శరవేగంగా ఏర్పాట్లు జరుగుతుండగా.. వాతావరణ శాఖ నుంచి వచ్చిన ఒక వార్త భక్తులతో పాటు ఉత్సవ కమిటీలను ఆందోళనకు గురి చేస్తోంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండటంతో పాటు.. అది కాస్తా వాయుగుండంగా మారే ప్రమాదం కూడా ఉందని వాతావరణ( Weather Report ) శాఖ అంచనా వేస్తుంది. అక్టోబర్ నెలలో సాధారణంగా సంభవించే ఈ వాతావరణ మార్పులు.. ఏపీ, ఒడిశా తీరప్రాంత ప్రజలను పాత చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకునేలా చేస్తున్నాయి.

ఉత్తర అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం రూపుదిద్దుకోవడానికి ప్రస్తుత రుతుపవన పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. దసరా పండుగ ప్రారంభానికి ముందే అల్పపీడనం తీవ్రమై వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. అయితే ఇది సాధారణమైన వర్షాలతో ముగుస్తుందా లేక బలపడి తుపానుగా మారుతుందా అనే దానిపై ఇప్పుడు స్పష్టమైన ప్రకటన చేయలేమని, మరి కొద్ది రోజుల్లో శాటిలైట్ చిత్రాల ఆధారంగా పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు.

గతంలోకి ఒకసారి తొంగి చూస్తే అక్టోబర్, నవంబర్ నెలల్లో ఈశాన్య రుతుపవనాల టైమ్‌లో అండమాన్ సముద్రంలో ఏర్పడే అల్పపీడనాలు వేగంగా బలపడి తుపానులుగా మారే ప్రమాదమే ఎక్కువగా జరిగింది. 2013 అక్టోబరులో వచ్చిన పైలిన్ తుపాను, 2014 విశాఖపట్నంను వణికించిన హుద్‌హుద్ తుపాన్, 2018 లో శ్రీకాకుళం తీరాన్ని తాకిన తిత్లీ తుపాన్ పండుగ టైమ్‌లోనే విరుచుకుపడి కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. అంతకుముందు 1999 అక్టోబర్‌లో వచ్చిన సూపర్ సైక్లోన్ వల్ల జరిగిన విధ్వంసం ఇప్పటికీ ప్రజలను భయపెడుతూనే ఉంది.

Weather Report

ఈ ఏడాదిలో ఇప్పటికే తొమ్మిది అల్పపీడనాలు, 3 వాయుగుండాల వల్ల 2 తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు, వరదలు వచ్చి భారీ నష్టం జరిగింది. ఇప్పుడిప్పుడే ప్రజలు ఆ నష్టాల నుంచి బయటపడి దసరా వేడుకలకు సిద్ధమవుతుండగా.. మళ్లీ ప్రకృతి విపత్తు పొంచి ఉందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.

మరోవైపు దీనిపై పూర్తి అధ్యయనం చేయకుండానే తుపాను ప్రమాదం పొంచి ఉందని ప్రచారం చేయడం తొందరపాటు అవుతుందని మరికొంతమంది వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే వాతావరణం(Weather) పొడిగా ఉందని, రాబోయే కొద్ది రోజుల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు తప్ప.. పెద్దగా ప్రమాదకర మార్పులేమీ ఉండకపోవచ్చని అంటున్నారు. ఏది ఏమైనా అఫీషియల్‌గా ప్రకటన వచ్చే వరకు అందరూ అప్రమత్తంగా ఉండటమే మంచిది.

Avocado : బరువు తగ్గడానికే కాదు బ్రెయిన్‌కి కూడా బాస్..అవకాడోను రెగ్యులర్‌గా తింటే బోలెడ్ బెనిఫిట్స్..

↑
Exit mobile version