Lesser Florican
ఆకాశంలో రెక్కలు విప్పి ఎగిరే పక్షుల జర్నీ ఎప్పుడూ ఒక అద్భుతమైన మిస్టరీగానే ఉంటుంది. అందులోనూ రెయినీ సీజన్ వచ్చిందంటే చాలు, ప్రకృతికే కొత్త అందాన్ని తెచ్చేలా కొన్ని పక్షులు ప్రయాణం ఆశ్చర్యపరిచేలా ఉంటుంది. ముఖ్యంగా గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లా, వేళావదర్ బ్లాక్‌బక్ నేషనల్ పార్క్‌లో అరుదైన నేల నెమళ్ల (లెస్సర్ ఫ్లోరికన్) నాట్యాలతో మార్మోగిపోతూ ఉంటుంది.
రుతుపవనాల ప్రభావంతో కురిసే వర్షాలకు పచ్చటి గడ్డితో మెరిసిపోయే ఈ 34 చదరపు కిలోమీటర్ల పార్కులో కృష్ణ జింకలు, నీల్గాయ్ జంతువులు ఎన్ని ఉన్నా కూడా.. అటవీ అధికారులు, పరిశోధకుల కళ్లు అన్నీ ప్రస్తుతం ఈ నేల నెమళ్ల పైనే ఉన్నాయి. సంతానోత్పత్తి కాలంలో మగ నేల నెమళ్లు.. ఆడ పక్షులను ఆకర్షించడానికి గాల్లో ఎగురుతూ, నేలపై గెంతులు వేస్తూ చేసే ప్రణయ నృత్యాలు కనువిందు చేస్తుంటాయి.
ఈ అరుదైన పక్షి జాతిని కాపాడుకోవడానికి గుజరాత్ ప్రభుత్వం స్పెషల్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేసి ఏటా కౌంటింగ్ కూడా నిర్వహిస్తోంది. ఇటీవల చేపట్టిన లెక్కింపులో పార్క్ సరిహద్దులతో పాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో మొత్తం 28 నేల నెమళ్లను గుర్తించారు. వాటిలో 22 మగ పక్షులు కాగా, ఆడ పక్షులు కేవలం 6 మాత్రమే ఉన్నాయి.
సాధారణంగా ఆడ నేల నెమళ్లు చాలా సిగ్గుపడే స్వభావంతో ఉండటం, వాటి బాడీ కలర్ గడ్డి మైదానంలో కలిసిపోవడం వల్ల మనుషుల కంటికి అంత త్వరగా కనిపించవు. వర్షాకాలంలో మగ పక్షుల రంగు, రూపురేఖలు పూర్తిగా మారిపోవడం వల్ల నేల నెమళ్లు స్పష్టంగా కనబడతాయి. ఈ సంవత్సరం వేళావదర్ పరిసరాల్లో మొత్తం 42 వరకు ఈ పక్షులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
అసలు వర్షాకాలం అయిపోయాక నేల నెమళ్లు ఎక్కడికి వెళ్తాయి? ఏ రూట్‌లో ప్రయాణిస్తాయనే సీక్రెట్స్ తెలుసుకోవడానికి గుజరాత్ అటవీ శాఖ, ది కార్బెట్ ఫౌండేషన్, భావ్‌నగర్ యూనివర్సిటీ రీసెర్చర్స్ కలిసి 2020 నుంచి 2025 వరకు ఒక సుదీర్ఘమైన అధ్యయనాన్ని నిర్వహించారు.
దీనిలో భాగంగా కొన్ని పక్షులకు హైటెక్ శాటిలైట్ ట్యాగ్‌లు అమర్చినపుడు.. ఆఫ్రికన్ రేంజ్ కింగ్స్‌లాగా దేశమంతటా చేసే సుదీర్ఘ ప్రయాణాలు వెలుగులోకి వచ్చాయి. ట్యాగ్ చేసిన ఒక ఆడ నేల నెమలి గుజరాత్ నుంచి ఏకంగా 776 కిలోమీటర్లు ఎగురుకుంటూ తెలంగాణకు చేరుకుంది. అయితే ఇక్కడ 6 నెలలు గడిపి తిరిగి వెళ్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు తగిలి ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. అలాగే ఒక మగ పక్షి మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య వలస వెళ్తూ చేసిన లాంగ్ జర్నీ కూడా ఆశ్చర్యపరిచింది.
రీసెర్చర్స్ పరిశోధన ప్రకారం, జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య సంతానోత్పత్తి కోసం నేల నెమళ్లు గుజరాత్ గడ్డి మైదానాలకు చేరుకుంటాయి. ఆ సమయం ముగిసిన తర్వాత అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలకు ప్రయాణమవుతాయి.
ప్రపంచంలోనే అత్యంత చిన్న పరిమాణంలో ఉండే నేల నెమళ్లు(Lesser Florican), పొలాల్లోని మిడతలు, కీటకాలను తింటాయి. అందుకే వీటిని పంటలను కాపాడే నేచురల్ పెస్ట్ కంట్రోలర్స్‌గా పనిచేస్తాయని చెబుతారు.
అయితే, దురదృష్టవశాత్తు రెండు దశాబ్దాల్లో ఈ పక్షుల జనాభా దారుణంగా పడిపోయింది. 1999లో దేశవ్యాప్తంగా సుమారు 3,530గా ఉన్న నేల నెమళ్ల సంఖ్య, ప్రస్తుతం కేవలం 480కి చేరింది. అంటే ఏకంగా 80 శాతం జనాభా తుడిచిపెట్టుకుపోయింది.
పంట భూముల్లో మెకానిజేషన్ పెరగడం, గడ్డి మైదానాలు తగ్గిపోవడం, వర్షపాతంలో ఒడుదొడుకులు రావడమే వీటి జనాభా తగ్గడానికి ప్రధాన కారణాలుగా రీసెర్చర్స్ చెబుతున్నారు. దీంతోనే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) ఈ పక్షిని తీవ్ర ముప్పులో ఉన్న జాతుల లిస్టులో చేర్చింది.
