Samrat Choudhary:నితీష్ కుమార్ నిష్క్రమణ.. బీహార్ సీఎంగా సామ్రాట్ చౌదరి ఖరారు

Samrat Choudhary: బీహార్ బీజేపీ అధ్యక్షుడిగా, ఉప ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి చేసిన పనులు పార్టీని మరింత బలోపేతం చేశాయి.

Samrat Choudhary

ఒక్కసారిగా బీహార్ రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. దశాబ్దాల కాలం పాటు బీహార్ రాష్ట్ర రాజకీయాలను శాసించిన నితీష్ కుమార్ యుగం ఇక ముగిసిపోగా, భారతీయ జనతా పార్టీకి చెందిన సామ్రాట్ చౌదరి(Samrat Choudhary) సరికొత్త వారసుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.

మంగళవారం అంటే ఏప్రిల్ 14, 2026న పాట్నా వేదికగా జరిగిన వేగవంతమైన పొలిటికల్ పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయడంతో, ఎన్డీయే పక్షం ఏకగ్రీవంగా సామ్రాట్ చౌదరి(Samrat Choudhary)ని తమ లీడర్‌గా ఎంచుకుంది.

ఇక సామ్రాట్ చౌదరి(Samrat Choudhary) పొలిటికల్ ప్రస్థానాన్ని ఒకసారి గమనిస్తే, ఆయన కేవలం వారసత్వ రాజకీయాల నుంచే కాకుండా, క్షేత్రస్థాయిలో బలమైన పట్టున్న లీడర్‌గా ఎదిగారు. ముంగేర్ జిల్లాకు చెందిన ప్రముఖ నేత శకునీ చౌదరి తనయుడైన సామ్రాట్ చౌదరి, అతి చిన్న వయస్సులోనే మంత్రిగా పనిచేసిన రికార్డును సొంతం చేసుకున్నారు.

గతంలో ఆర్జేడీ, జేడీయూ వంటి పార్టీల్లో కీలక బాధ్యతలను నిర్వర్తించిన సామ్రాట్, 2018లో బీజేపీలో చేరిన తర్వాత కొద్ది కాలంలోనే అగ్రస్థానానికి చేరుకున్నారు. అలాగే బీహార్ బీజేపీ అధ్యక్షుడిగా, ఉప ముఖ్యమంత్రిగా ఆయన చేసిన పనులు పార్టీని మరింత బలోపేతం చేశాయి.దీనిని క్షుణ్ణంగా పరిశీలించిన బీజేపీ అధిష్టానం చివరకు ఆయనకు ముఖ్యమంత్రిగా పగ్గాలు అందజేసింది.

కాగా ఈ కీలక మార్పు ప్రక్రియను పర్యవేక్షించడానికి తాజాగా కేంద్రం నుంచి ప్రత్యేక ప్రతినిధులు పాట్నా చేరుకున్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ వంటి అగ్రనేతల సమక్షంలో జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో సామ్రాట్ చౌదరి పేరును ప్రతినిధులు ఖరారు చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సామ్రాట్ చౌదరి, బీహార్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి , ప్రజల ఆశయాలను నెరవేర్చడమే తన తొలి ప్రాధాన్యత అని ప్రకటించారు. ఇటు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సామ్రాట్ నాయకత్వంలో బీహార్ సరికొత్త పుంతలు తొక్కుతుందని ఎన్డీయే వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Samrat Choudhary

అయితే రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, బీహార్‌లో ఈ మార్పు వెనుక లోతైన సమీకరణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యువతను , వెనుకబడిన వర్గాలను ఆకట్టుకోవడంలో సామ్రాట్ చౌదరి విజయవంతమవుతారని బీజేపీ అధిష్టానం భావిస్తోంది.

ఈ బుధవారం అంటే ఏప్రిల్ 15న సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పర్బత్తా , తారాపూర్ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన చరిత్ర ఉన్న సామ్రాట్, ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రిగా అత్యున్నత పీఠాన్ని అధిరోహించడం బీహార్ రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక మలుపుగా చెప్పొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Gold : రికార్డు స్థాయిల వద్దే స్థిరంగా పుత్తడి.. రూ. 2.5 లక్షలు దాటిన వెండి

Exit mobile version