Marriage
ఒకప్పుడు వయసొచ్చిన పిల్లలు ఇంట్లో ఉంటే చాలు పెళ్లెప్పుడు చేస్తారన్న ప్రశ్నలతో పాటు ఆ ఇంట్లో కూడా త్వరగా పెళ్లి(Marriage )చేసి బాధ్యత తీర్చుకోవాలన్న ఆలోచనతోనే ఉండేవారు. ప్రతి ఒక్కరూ కచ్చితంగా పెళ్లి(Marriage )చేసుకోవాలి, బాధ్యతలను నెరవేర్చాలనే రూల్ ఉండేది.
కానీ ఇప్పుడు రోజులు మారుతున్నాయి. జనరేషన్ మారుతున్న కొద్దీ, ముఖ్యంగా యూత్ ఆలోచనల్లో ఊహించని మార్పులు వస్తున్నాయి. ఇప్పుడున్న ట్రెండ్‌లో పెళ్లి(Marriage )అనేది జీవితంలో కచ్చితంగా చేయాల్సిన పెద్ద పనేమీ కాదు. అది కేవలం ఒక ఆప్షన్ మాత్రమే అని చాలా మంది ఫిక్స్ అయిపోతున్నారు. బ్రిటన్‌లోనే కాదు, మన దేశంలో కూడా అబ్బాయిలు, అమ్మాయిలు పెళ్లి బంధానికి రోజురోజుకు దూరంగా జరిగిపోతున్నారు.
ముఖ్యంగా అబ్బాయిలు ఇలా ఆలోచించడానికి కొన్ని బలమైన కారణాలున్నాయని నిపుణులు అంటున్నారు. ఒకప్పుడు అబ్బాయిల మీద కేవలం సంపాదించడం అనే బాధ్యత మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడున్న సొసైటీలో పెళ్లి చేసుకున్నాక వచ్చే ఖర్చులు, కుటుంబ రెస్పాన్సిబిలిటీలను చూసి చాలా మంది అబ్బాయిలు భయపడుతున్నారు.
ఒకవైపు ఇళ్ల ధరలు, పిల్లల చదువుల ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. మరోవైపు ప్రైవేట్ ఉద్యోగాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అభద్రతాభావం ఎక్కువైంది. ఇలాంటి టైమ్‌లో ఒకరిని పెళ్లి చేసుకుని, ఆ బాధ్యతలను మోయడం కంటే, హ్యాపీగా తమ కెరీర్‌ను బిల్డ్ చేసుకోవడం, నచ్చినట్లు స్వేచ్ఛగా బతకడమే బెటర్ అని అబ్బాయిలు అనుకుంటున్నారు. అంతేకాకుండా పెళ్లి చేసుకుంటే తమ పర్సనల్ ఫ్రీడమ్ ఎక్కడ పోతుందోననే యాంగ్జైటీ కూడా ఇప్పటి యువకుల్లో ఎక్కువగా కనిపిస్తోంది.
ఒకవేళ ఫ్యూచర్‌లో ఇదే ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అయితే సొసైటీలో చాలా పెద్ద మార్పులు రావడం గ్యారంటీ అంటున్నారు నిపుణులు. మొదటిగా, దేశంలో పుట్టే పిల్లల సంఖ్య బాగా తగ్గిపోతుంది. దీనివల్ల భవిష్యత్తులో దేశ జనాభాలో యువకుల కంటే ముసలివాళ్ల సంఖ్య చాలా ఎక్కువైపోతుంది.
ప్రస్తుతం జపాన్ వంటి దేశాల్లో సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఉంది. అక్కడ పెళ్లిళ్లు చేసుకోకపోవడం వల్ల, పిల్లలు పుట్టకపోవడంతో యువతరం తగ్గిపోయి, దేశాన్ని నడిపించే చేతులు కరవవుతున్నాయి. మన దేశంలో కూడా భవిష్యత్తులో అదే రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది.
ఇక రెండోది, మనుషులలో లోన్లీనెస్ విపరీతంగా పెరిగిపోతుంది. వయసులో ఉన్నప్పుడు ఉద్యోగం, కెరీర్, ఫ్రెండ్స్, ఎంజాయ్‌మెంట్ అంటూ లైఫ్ బిజీగా గడిచిపోయినా, వయసు పైబడిన తర్వాత, ముసలితనంలో తోడుగా ఎవరూ లేక మానసిక ఒత్తిడి, డిప్రెషన్ వంటి జబ్బులు ఎక్కువవుతాయి.
ఇప్పటివరకూ తల్లిదండ్రులకు ఒక ఏజ్ వచ్చాక వారి పిల్లలే ఆధారం అనుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు మారిపోయాయి. దీనివల్ల ఫ్యూచర్‌లో ఓల్డ్ ఏజ్ హోమ్స్ బిజినెస్ చాలా భారీగా పెరిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
చివరగా చెప్పాలంటే, ఇప్పుడు యూత్ తమ కాళ్లపై తాము నిలబడటం, కెరీర్‌లో సక్సెస్ అవ్వడమే లైఫ్‌లో అతిపెద్ద టార్గెట్‌గా మారింది. వారి దృష్టిలో పెళ్లి అనేది జీవితాన్ని డిసైడ్ చేసే ఒక పెద్ద మైలురాయి కాదు. ఈ చేంజ్ వల్ల సొసైటీలో స్వేచ్ఛ, ఆర్థిక స్వాతంత్య్రం పెరిగినా, బంధాల మధ్య ఉండే అనుబంధాలు, కుటుంబ వ్యవస్థ మాత్రం మెల్లమెల్లగా మాయం అయ్యే ప్రమాదం పొంచి ఉంది.
Peddi : రామ్ చరణ్ పెద్ది సెన్సార్ టాక్ అవుట్..చివరి 45 నిమిషాలు ఎమోషనల్ పీక్స్
