Mamata Banerjee:బెంగాల్ రాజకీయ రణరంగం.. మమతా బెనర్జీకి సువేందు చెక్ పెడతారా?

Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల హడావుడితో కోల్‌కతా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది

Mamata Banerjee

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల హడావుడితో కోల్‌కతా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇంకా చెప్పాలంటే ఈ నెల మార్చి 15న వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) నిర్వహించిన .. మెగా ర్యాలీకి జనసముద్రం పోటెత్తడంతోనే కోల్‌కతానగర వీధుల టెంపరేచర్ పెరిగిపోయింది.

అందులోనూ డెబ్బై ఏళ్ల వయసులోనూ ఏమాత్రం తగ్గని ఉత్సాహంతో మమతను చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా మమత తన ట్రేడ్ మార్క్ అయిన హవాయి చప్పల్ ధరించి వేగంగా నడుస్తూ ర్యాలీని నడిపించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది.

దీంతో ఢిల్లీకి హవాయి చప్పల్ పవర్ చూపిస్తామంటూ చెప్పిన మమత నినాదం మరోసారి ఇప్పుడు బెంగాల్ అంతటా మారుమోగుతోంది. నిన్న అంటే మార్చి 17న టీఎంసీ తన అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేస్తూ 294 స్థానాలకు గాను 291 చోట్ల పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది.

ముఖ్యంగా తన సొంత గడ్డ అయిన భవానీపూర్ నుంచి సీఎం మమతా బెనర్జీ బరిలోకి దిగుతున్నారు. అయితే ఆమెకు సవాలు విసురుతూ బీజేపీ తరపున సువేందు అధికారి మమతపై పోటీకి సిద్ధమవ్వడం ఈ ఎన్నికల్లో అత్యంత ఆసక్తికరమైన అంశంగా మారింది. గడచిన 2021 ఎన్నికల్లో నందిగ్రామ్‌లో మమతపై సువేందు విజయం సాధించారు. అయితే ఈసారి భవానీపూర్‌లో ఆమెను ఢీకొట్టడానికి రెడీ అవడంతో సేమ్ సీన్ రిపీట్ అవుతుందా అనే అనుమానంతో అందరి కళ్లు ఈ సీటుపైనే పడుతున్నాయి.

ఇక ఇటు మమతా బెనర్జీ(Mamata Banerjee) తన ప్రచారంలో మెయిన్‌గా మహిళా ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. లక్ష్మీ భాండార్ , కన్యాశ్రీ వంటి పథకాలను ప్రధాన అస్త్రాలుగా వాడుతూ ప్రచారం సాగిస్తున్నారు. మహిళలకు నెలకు వెయ్యి రూపాయల ఆర్థిక సాయం అందించే పథకం టీఎంసీకి పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. దీనికి తోడు ఈ ఎన్నికల ముందే పూజారులు, ముఅజ్జిన్‌ల గౌరవ వేతనాన్ని పెంచడం ద్వారా..మొత్తంగా అన్ని వర్గాల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.

Mamata Banerjee

మరోవైపు బీజేపీ మాత్రం టీఎంసీ ప్రభుత్వం లోని అవినీతి ఆరోపణలను, ధరల పెరుగుదల వంటి అంశాలను హైలైట్ చేస్తూ ఎదురుదాడి చేస్తోంది. ముఖ్యంగా సెంట్రల్ ఏజెన్సీల కేసులు, పశ్చిమ బెంగాల్‌లోని శాంతిభద్రతల సమస్యలను బీజేపీ తన ప్రచార అస్త్రాలుగా మార్చుకుంది.

కాగా సీపీఎం, కాంగ్రెస్ కూటమి ఈసారి కొంత బలహీనంగా కనిపిస్తుంది. దీంతో ప్రధాన పోరు అంతా టీఎంసీ, బీజేపీ మధ్యే నెలకొందా అన్నట్లుగా అక్కడి పరిస్థితులు ఉన్నాయి. ఏప్రిల్ 23 ,29 తేదీల్లో రెండు విడతలుగా పోలింగ్ జరగనుండగా, మే 4న వెలువడే ఫలితాలు బెంగాల్ గద్దెపై మళ్లీ దీదీ కూర్చుంటుందా లేక బీజేపీ పాగా వేస్తుందా అనేది తేల్చనున్నాయి.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version