Chardham Yatra
ఒకవైపు మబ్బులు విరిగిపడుతున్నాయా అన్నట్లున్న పరిస్థితులు.. మరోవైపు వానలు ముంచెత్తడంతో కొండచరియలు విరిగిపడిపోతున్న ఘటనలు..అయినా సరే ఆ పరమశివుడి, శ్రీమహావిష్ణువు పిలుపు ముందు ఏ అడ్డంకులు నిలవలేకపోయాయి.
మంచు కొండల మధ్య కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనే భక్తుల పట్టుదల ఆకాశాన్నంటుతోంది. ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న చార్‌ధామ్ యాత్ర(Chardham Yatra) ఇప్పుడు సాధారణ ప్రయాణంలా కాకుండా ఒక ఆధ్యాత్మిక సునామీలా దూసుకెళ్తోంది.
సీజన్ మొదలైన కేవలం 114 రోజుల్లోనే ఏకంగా 47లక్షల 2వేల 703 మంది భక్తులు స్వామివార్లను దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. ఇదే సమయంతో గతేడాది పోలిస్తే ఈసారి ఏకంగా 4లక్షల68వేల556 మంది భక్తులు అదనంగా రావడం విశేషమని అధికారులు చెబుతున్నారు.
ప్రతికూల వాతావరణాన్ని కూడా లెక్కచేయకుండా జనాలు తండోపతండాలుగా తరలివస్తుండటంతో.. ఈ ఏడాది చార్‌ధామ్ యాత్ర పాత రికార్డులన్నింటిని కూడా పక్కన పెట్టి కొత్త హిస్టరీ క్రియేట్ చేసేలా కనిపిస్తోందని అంచనా వేస్తున్నారు.
ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి.. చార్‌ధామ్ భక్తుల భద్రతపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. యాత్రికుల సేఫ్టీనే తమ ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పిన ఆయన, వాతావరణం తేడాగా కనిపించిన వెంటనే.. క్షణాల్లో అలర్ట్ అయ్యేలా అన్ని శాఖల అధికారులను సిద్ధం చేశారు. విపత్తు నిర్వహణ టీమ్స్ 24 గంటలూ స్పాట్‌లోనే ఉంటూ రెస్క్యూ ఆపరేషన్లకు రెడీగా ఉంటున్నాయి.
ముఖ్యమంత్రి స్వయంగా కంట్రోల్ రూమ్‌లో కూర్చుని ప్రతి క్షణం పరిస్థితిని మానిటర్ చేస్తున్నారు. ఎంతగా అంటే, ఆకాశం మబ్బుపట్టి వాతావరణం మారినట్లు అన్పించగానే యాత్రికులను సురక్షిత ప్రాంతాల్లో నిలిపివేస్తున్నారు. అయితే ఎంత దారుణమైన క్లైమేట్ ఉన్నాకూడా , ఆగస్ట్ 10వ తేదీ సోమవారం రోజు ఏకంగా 15వేల376 మంది భక్తులు దైవ దర్శనం చేసుకోవడం అధికారులనే ఆశ్చర్యపరిచింది.
పవిత్ర బద్రీనాథ్ ధామం ఏకంగా 16లక్షల12వేల112 మంది యాత్రికులతో టాప్‌లో నిలిచింది. ఒక్క బద్రీనాథ్‌లోనే గతేడాదితో పోలిస్తే 3.5 లక్షల మందికి పైగా అదనపు భక్తులు వచ్చారు. ఆ తర్వాత కేదార్‌నాథ్‌ను 14లక్షల50వేల116 మంది, గంగోత్రిని 7లక్షల37వేల629 మంది, యమునోత్రిని 6లక్షల62వేల347 మంది భక్తులు సందర్శించారు.
వీరే కాకుండా సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రమైన హేమకుండ్ సాహిబ్‌ను కూడా 2లక్షల40వేల499 మంది సందర్శించారు. ప్రణాళికాబద్ధంగా సాగిన ఈ యాత్రలో ఏప్రిల్ 19వ తేదీన గంగోత్రి, యమునోత్రి ఆలయ తలుపులు తెరిచి శ్రీకారం చుట్టగా, ఏప్రిల్ 23వ తేదీన బద్రీనాథ్ క్షేత్ర ద్వారాలు తెరుచుకున్నాయి.
కాగా ఈ చార్‌ధామ్ వెనుకున్న ఆధ్యాత్మిక చరిత్ర ఎంతో గొప్పదని స్థానికులు చెబుతారు. హిందూ సంప్రదాయంలో చాలా పవిత్రంగా భావించే యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లను కలిపి ఛోటా చార్‌ధామ్ అని పిలుస్తుంటారు.
జగద్గురు ఆది శంకరాచార్యుల వారు 8వ శతాబ్దంలో దేశ నలుమూలల ఉన్న ప్రజలను ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా ఒక్కటి చేయాలనే సంకల్పంతో ఈ చార్‌ధామ్ యాత్రా(Chardham Yatra) సంప్రదాయాన్ని ప్రచారంలోకి తెచ్చారు. ఆరోజు నుంచి ఇప్పట వరకు యుగాలు మారుతున్నా, హిమాలయాల బాటలో సాగే ఈ భక్తి ప్రయాణం.. కోట్లాది మంది భక్తుల ఆత్మబంధంగా కొనసాగుతూనే ఉంది.
Section 22-A : హైదరాబాద్‌లో సొంతింటి కలపై ఆస్తి హక్కుల వేటు..అసలేంటి 22-ఏ?
