Fish Pulusu Prasadam
దసరా వస్తుందనగానే మనకు అమ్మవారి దేవాలయంలో భక్తిశ్రద్ధలు, ప్రసాదాలు గుర్తుకొస్తాయి. అయితే బెంగాల్‌లోని ఒక కుటుంబం చేసే దుర్గాపూజ గురించి వింటే ఎవరైనా సరే అదేంటీ అని విస్తుపోతారు. దేవీ నవరాత్రులలో నాన్‌వెజ్ ముట్టడమే పాపం అనుకుంటాం. అలాంటి ఏకంగా దుర్గమ్మకే ఇక్కడ చేపల పులుసును వండి నైవేద్యంగా(Fish Pulusu Prasadam) పెడతారు .
వెస్ట్ బెంగాల్‌లోని మిడ్నాపూర్ పరిధిలో ఉన్న మీయా బజార్‌లో చక్రవర్తి కుటుంబం సుమారు రెండు శతాబ్దాలుగా ఈ విచిత్రమైన, విభిన్నమైన పూజా విధానాన్ని పాటిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఇంట్లో షష్ఠి నుంచి దశమి వరకు అంటే ఐదు రోజుల పాటు దసరా వేడుకలను ఎంతో వైభవంగా జరుపుకొంటారు.
ఆరడగుల సింహ వాహన రూపాన్ని పూజించే ఈ ఫ్యామిలీ, పూజ కోసం ఎలాంటి మట్టి విగ్రహాన్ని వాడరు. ఒక పవిత్రమైన స్క్రోల్ పెయింటింగ్ రూపంలో ఉన్న దుర్గమ్మ ఫోటోకు మాత్రమే పూజలు నిర్వహిస్తారు. ఈ ఐదు రోజులు ఈ కుటుంబంలో జరిగే యజ్ఞాలు, సంప్రదాయాలను చూడటానికి వేరే ఊళ్ల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు.
ఈ పూజా పద్ధతుల గురించి మిడ్నాపూర్‌లో ఉంటున్న చక్రవర్తి వంశస్థుడైన నందన్ చక్రవర్తి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తమ వంశ మూలపురుషుడు అయిన రాఖల్ చక్రవర్తి కాలం కంటే ముందు నుంచే దుర్గమ్మను ఇలా పూజించే ఆచారం ఉందని ఆయన చెప్పారు. షష్ఠి రోజు బోధన్ కార్యక్రమంతో దుర్గాదేవికి స్వాగతం పలుకుతారు. సప్తమి తెల్లవారుజామున ఏడు వేర్వేరు బావుల నుంచి సేకరించిన పవిత్రమైన నీటిని కలశంలోకి తీసుకువస్తారు. వాటిని సాంప్రదాయ మంగళ వాయిద్యాల మధ్య పూజా స్థలానికి చేరుస్తారు.
ఇక అందరినీ ఆశ్చర్యపరిచే నైవేద్యం విషయానికి వస్తే, ప్రారంభ రోజుల్లో దుర్గా మాతకు కేవలం పండ్లు, శాకాహారం మాత్రమే సమర్పిస్తారు. ఆ తర్వాత రోజుల్లో ప్రత్యేకంగా తయారు చేసిన చేపల వంటకాలు(Fish Pulusu Prasadam), చద్దన్నాన్ని అమ్మకు నైవేద్యంగా పెడతారు. దేవీ నవరాత్రుల ముగింపులో దుర్గమ్మ తిరిగి కైలాసానికి వెళ్లినప్పుడు.. పుట్టింట్లో ఏం తిన్నావని పరమశివుడు అడిగితే చెప్పడానికే ఈ చేపల నైవేద్యాన్ని(Fish Pulusu Prasadam) సమర్పిస్తామని ఈ కుటుంబీకులు చెబుతారు.
అష్టమి రోజు 108 నీలి రంగు కలువ పూలతో దుర్గా దేవిని అర్చిస్తారు. సప్తమి నుంచి నవమి వరకు మహాయజ్ఞం నిర్విఘ్నంగా సాగే ఈ పండుగ కోసం.. ప్రపంచంలో ఎక్కడ స్థిరపడినా కూడా ఈ సమయానికి చక్రవర్తి కుటుంబ సభ్యులందరూ స్వగ్రామానికి చేరుకుంటారు. ఇదీ తరతరాలుగా వస్తున్న ఒక మధురమైన సంప్రదాయం అని అక్కడి వారు చెబుతారు.
