Kolhapur Mahalaxmi Temple : వైకుంఠాన్ని వీడి భూమిపై కొలువైన శ్రీ మహాలక్ష్మి..ఈ అమ్మవారిని దర్శిస్తే ఐశ్వర్యం మీ సొంతం..

Kolhapur Mahalaxmi Temple : 6 వేల సంవత్సరాల క్రితం నిర్మించిన కొల్హాపుర్ క్షేత్రంలో అమ్మవారు చతుర్భుజాలతో పాటు సింహవాహనం కలిగి, మనోహరమైన రూపంతో పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తుంటారు.

Kolhapur Mahalaxmi Temple

మన దేశంలో అమ్మవారి ఆలయాలు చాలా ఉన్నా కూడా, కేవలం శ్రీమహాలక్ష్మికి మాత్రమే ప్రత్యేకించి ఉన్న దివ్యక్షేత్రాలను వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. అందులో మహారాష్ట్రలోని కొల్హాపుర్ మహాలక్ష్మి ఆలయం(Kolhapur Mahalaxmi Temple).. అత్యంత ప్రసిద్ధి చెందినది, అష్టాదశ శక్తిపీఠాల్లో ఏడోది. పంచగంగ నది ఒడ్డున ఉన్న ఈ దివ్య క్షేత్రాన్ని కరవీర క్షేత్రమని కూడా అంటారు. పురాణాల ప్రకారం అమ్మవారి నయనాలు (కళ్లు) పడిన పవిత్ర స్థలం ఇది అని చెబుతారు.

కాశీ పట్టణం పరమశివుడికి ఎంత ప్రియమైనదో, ఈ కొల్హాపుర్ క్షేత్రం విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి అంతటి అత్యంత ఇష్టమైన అవిముక్త క్షేత్రంగా పురాణాలు చెబుతాయి. భృగు మహర్షి తనకు చేసిన అవమానంతో వైకుంఠాన్ని వదిలిపెట్టి వెళ్లిన మహాలక్ష్మి దేవి, సహ్యాద్రి పర్వత ప్రాంతమైన ఇక్కడే కొలువైనట్లు చరిత్ర చెబుతుంది.

జగద్గురు ఆదిశంకరాచార్యులు కొల్హాపుర్ క్షేత్రంలో శ్రీచక్రాన్ని స్థాపించగా, దత్తాత్రేయ స్వామి ఇక్కడే ప్రతిరోజూ మధ్యాహ్నం భిక్షను స్వీకరిస్తారని నమ్మకం. దాదాపు 6 వేల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ కొల్హాపుర్ క్షేత్రంలో అమ్మవారు చతుర్భుజాలతో పాటు సింహవాహనం కలిగి, మనోహరమైన రూపంతో పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తుంటారు.

Kolhapur Mahalaxmi Temple

ఈ ఆలయానికి ఉన్న ఇంకో అతిపెద్ద అద్భుతం ఏంటంటే.. ఏడాదికి రెండు ,మూడు సార్లు సూర్యాస్తమయ సమయంలో సూర్యకిరణాలు డైరెక్టుగా చిన్న కిటికీ ద్వారా ప్రయాణించి అమ్మవారి ముఖమండలాన్ని ముద్దాడుతాయి. ఈ సమయంలో అరుదైన దృశ్యాన్ని చూడటానికి స్థానికులే కాకుండా.. దేశ నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతారు.

మహారాష్ట్ర ప్రజలు ఈ అమ్మవారిని అంబాబాయి అని ఎంతో ప్రేమగా పిలుచుకుంటారు. శ్రావణ మాసంలో కానీ దసరా నవరాత్రుల్లో కానీ, కొల్హాపుర్(Kolhapur Mahalaxmi Temple) అంబాబాయిని ఒక్కసారి దర్శించుకుంటే జన్మజన్మల దరిద్రాలు, పాపాలు తొలగిపోయి ఐశ్వర్యప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

Constructive Mind Game : బంధం విడిపోవడానికి బ్రేకప్.. మరి కన్‌స్ట్రక్టివ్ మైండ్ గేమ్ గురించి తెలుసా?

↑
Exit mobile version