Seethamma : సీతమ్మ కన్నీటి గాథకు సజీవ సాక్ష్యం.. కాశీ యాత్రకు వెళ్లేవారు తప్పక చూడాల్సిన క్షేత్రం

Seethamma : కాశీ, ప్రయాగ యాత్రలు చేసే భక్తులంతా.. అదే దారిలో ఉండే సీతామర్హిని తప్పకుండా సందర్శించి ఆ జగన్మాత కృపకు పాత్రులవుతుంటారని స్థానికులు చెబుతుంటారు

Seethamma

రామాయణం అనగానే లంకపై విజయం, రాములోరి పట్టాభిషేకం వరకు మాత్రమే మనందరికీ ఎక్కువగా గుర్తుంటుంది. కానీ, వాల్మీకి మహర్షి అందించిన మహాకావ్యంలో బాలకాండ నుంచి యుద్ధకాండ వరకు ఉన్న 6 ప్రధాన భాగాలతో పాటు ఉత్తరకాండ అనే ఏడో అధ్యాయం కూడా ఉంది.

శ్రీరాముడు రాజ్యాధికారం చేపట్టిన తర్వాత .. సీతమ్మ అడవుల పాలవడం, లవకుశుల జననం ,సీతాదేవి తన అవతారాన్ని చాలించి భూగర్భంలో కలిసిపోయిన హృదయవిదారక ఘట్టం ఈ ఉత్తరకాండలోనే కనిపిస్తుంది.

అలా నాడు జానకీదేవి భూమాత ఒడిలోకి చేరుకున్న ఆ పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రమే ఉత్తరప్రదేశ్‌లోని సీతా సమాహిత్ స్థల్‌గా చెబుతారు . ఈ సుప్రసిద్ధ క్షేత్రాన్ని సీతామర్హి (Seethamma)అని భక్తితో పిలుచుకుంటారు.

ఇది ఉత్తరప్రదేశ్‌లోని భదోహీ జిల్లా పరిధిలో,అలహాబాద్‌లోని ప్రయాగ్‌రాజ్ , కాశీ నగరాల మధ్య గంగానది తీర ప్రాంతంలో కొలువై ఉంటుంది. లోకాపవాదు వల్ల నిండు గర్భిణిగా ఉన్న సీతాదేవిని శ్రీరాముడు అడవులకు పంపినప్పుడు, ఆమె వాల్మీకి మహర్షి ఆశ్రమానికి చేరుకుని అక్కడే లవకుశులకు జన్మనిచ్చింది.

కొంతకాలం తర్వాత శ్రీరాముడు అశ్వమేధ యాగాన్ని తలపెట్టగా, ఆ యాగ అశ్వాన్ని లవకుశులు.. వాల్మీకి ఆశ్రమ పరిసరాల్లో బంధిస్తారు. ఆ గుర్రాన్ని విడిపించడానికి స్వయంగా శ్రీరాముడే అక్కడికి రావాల్సి వస్తుంది.

ఆ సమయంలోనే లవకుశులిద్దరూ తన సొంత బిడ్డలేనని తెలుసుకున్న రాఘవుడు, వారిని సీతమ్మతో పాటు సగౌరవంగా అయోధ్యకు రమ్మని ఆహ్వానిస్తాడు. కానీ దీనికి ఒప్పుకోని జానకీదేవి, తన బిడ్డలను రామునికి అప్పగించి, కన్నతల్లి అయిన భూమాతను స్మరిస్తూ, తాను పవిత్రురాలినే అయితే తనను ఆమె ఒడిలోకి తీసుకోమని వేడుకోగానే భూమి చీలిపోతుంది.

అలా సీతమ్మ భూగర్భంలో ఐక్యమై అవతారం చాలించిన ఆ విషాద ఘట్టం జరిగిన ప్రదేశమే ఈ సీతామర్హి అని పురాణాలు చెబుతాయి. అక్కడ తమసా నది ఒడ్డున ప్రశాంత వాతావరణంలో సీతమ్మ జ్ఞాపకార్థం వెలసిన ఒక అద్భుతమైన స్మారక కట్టడం కనిపిస్తుంది.

ఈ పవిత్ర క్షేత్రంలో సీతాదేవి ఆశ్రయం పొందిన వాల్మీకి ఆశ్రమాన్ని, లవకుశులు పుట్టిన పురిటిగడ్డగా భావించే సీత వటవృక్షాన్ని కూడా భక్తులు దర్శించుకోవచ్చు. స్వామి జితేంద్రానంద తీర్థుల ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న రెండంతస్తుల ఈ స్మారక కట్టడంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి.

Seethamma

పై అంతస్తులో ఉన్న అద్దాల మండపంలో పట్టుచీరతో అలంకరించిన పాలరాతి సీతాదేవి విగ్రహం మనకు కనిపిస్తుంది. అలాగే కింది అంతస్తులో భూమాత చేతులపై నిలబడి, సీతమ్మ భూమిలోకి లీనమవుతున్నట్లుగా చెక్కిన విగ్రహం అయితే అత్యంత జీవకళతో ఉండి భక్తుల కళ్లు చెమర్చేలా చేస్తుంది.

కాశీ, ప్రయాగ యాత్రలు చేసే భక్తులంతా.. అదే దారిలో ఉండే సీతామర్హిని(Seethamma) తప్పకుండా సందర్శించి ఆ జగన్మాత కృపకు పాత్రులవుతుంటారని స్థానికులు చెబుతుంటారు.

Dating App : రూట్ మార్చిన ప్రేమికులు..డేటింగ్ యాప్ సర్వేలో షాకింగ్ నిజాలు

Exit mobile version