Numbers
మన హిందూ పురాణాలు, వేదాలను క్షుణ్ణంగా గమనిస్తే కొన్ని నెంబర్లు పదే పదే కనిపిస్తూ ఉంటాయి. పూజలు, వ్రతాలు, మంత్రాల జపాల్లో ఈ సంఖ్యలకు(Numbers) చాలా పెద్ద పీట వేశారు. అసలు పురాణాల్లో 3, 7,108 వంటి సంఖ్యలు ఎందుకంత ప్రత్యేకం? వాటి వెనుక ఉన్న అసలైన రహస్యాలు, సైన్స్ ఏంటనే విషయాలు చాలామందికి తెలీవు.
మన సంస్కృతిలో 3 అనే సంఖ్యకు ఒక స్పెషల్ స్థానం ఉంది. సృష్టి మొత్తాన్ని నడిపించే ముగ్గురు ముఖ్యమైన దేవుళ్లను మనం త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని పిలుస్తాం. అలాగే ఈ సృష్టి అంతా 3 కాలాలు అంటే భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల చుట్టూనే తిరుగుతుంది.
మనిషి గుణాలను కూడా సత్త్వ, రజో, తమో గుణాలు అంటూ 3 రకాలుగా విభజించారు. లోకాలు కూడా స్వర్గ, మర్త్య, పాతాళ లోకాలు అనే 3 సంఖ్యతోనే ఉంటాయి. ఇలా సృష్టిలోని ప్రతీ ముఖ్యమైన విషయాన్ని, బ్యాలెన్స్ చేసి చూపించడానికి మన పురాణాల్లో 3 అనే నెంబర్‌ను ఎక్కువగా ఉపయోగించారు. మనం చేసే నిత్య పూజల్లో 3 సార్లు ఆచమనం చేయడం, 3 ప్రదక్షిణలు చేయడం వెనుక ఉన్న అంతరార్థం కూడా ఇదే.
ఇక 7 నెంబర్(Numbers) విషయానికి వస్తే.. ఇది ఆధ్యాత్మికంగా మాత్రమే కాదు.. ప్రకృతి పరంగా కూడా చాలా వింతైన సంఖ్య. ఆకాశంలో వచ్చే ఇంద్రధనస్సులో ఉండే రంగులు 7, సంగీతంలోని సరిగమపదని అనే స్వరాలు 7. అలాగే మన పురాణాల ప్రకారం లోకాలు 14 అయితే.. దానిలో 7 ఊర్థ్వలోకాలు, 7 అధోలోకాలు లేదా పాతాళ లోకాలు ఉంటాయి.
సముద్రాలు 7, అలాగే నవగ్రహాల్లో రాహు కేతువులను పక్కన పెడితే ముఖ్యమైన గ్రహాలు కూడా ఏడే. మన బాడీలో ఉండే ముఖ్యమైన ఎనర్జీ పాయింట్స్ అంటే చక్రాలు కూడా ఏడేనని యోగా శాస్త్రం చెబుతోంది. అంతెందుకు పెళ్లిలో కూడా భార్యాభర్తలు ఏడు అడుగులు నడవడానికి కారణం.. ఈ 7 సంఖ్య జీవిత కాల బంధానికి ప్రతీక కాబట్టే.
వీటన్నింటికంటే అతి ముఖ్యమైన పవర్‌ఫుల్, పవిత్రమైన సంఖ్య 108. మనం ఏ మంత్రం చదివినా 108 సార్లు జపం చేయాలని పెద్దలు చెబుతారు. జపమాలలో ఉండే పూసల సంఖ్య కూడా 108. దీని వెనుక ఒక అద్భుతమైన ఖగోళ శాస్త్రం దాగి ఉంటుంది.
అలాగే సూర్యుడి వ్యాసం అంటే డయామీటర్ (Diameter) ఎంత ఉంటుందో.. దానికి కరెక్ట్‌గా భూమి నుంచి 108 రెట్లు దూరంలో సూర్యుడు ఉన్నాడు. అలాగే చంద్రుని వ్యాసానికి సరిగ్గా 108 రెట్లు దూరంలో భూమి నుంచి చంద్రుడు ఉన్నాడు. మన ప్రాచీన రుషులు ఎలాంటి టెలిస్కోప్‌లు లేని కాలంలోనే ఈ విషయాన్ని కనిపెట్టడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా మనకు 27 నక్షత్రాలు ఉన్నాయి. ప్రతీ స్టార్‌కు 4 చరణాలు లేదా పాదాలు ఉంటాయి. ఈ 27 నక్షత్రాలను 4 పాదాలతో గుణిస్తే వచ్చే సంఖ్య కరెక్ట్‌గా 108. అంటే బ్రహ్మాండం మొత్తం ఈ 108 సంఖ్యలోనే దాగి ఉందని అర్థం. గణిత పరంగా చూసినా 108 చాలా ప్రత్యేకం. 108 లోని అంకెలను కూడితే (1 + 0 + 8) వచ్చేది 9. తొమ్మిది అనేది సంఖ్యా శాస్త్రంలో పరిపూర్ణతకు గుర్తు అన్న సంగతి తెలిసిందే.
పైకి ఇవన్నీ కేవలం అంకెలుగానే(Numbers) కనిపించినా.. వీటి వెనుక మన పూర్వీకుల అపారమైన జ్ఞానం, ప్రకృతి రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి . సృష్టిలోని సైన్స్‌ను భక్తితో ముడిపెట్టి మనకు అందించడం వల్లే పురాణాల్లో ఈ సంఖ్యలు అంత ప్రత్యేకం అయ్యాయి.
Vijay Devarakonda : టీజీ20 లీగ్ పై టీసీఏ ఫైర్..విజయదేవరకొండకు నోటీసులు
