Simhachalam Temple
సింహాచలం అప్పన్న స్వామి దర్శనానికి వెళ్లాలని అనుకుంటున్న భక్తులకు ఆలయ అధికారులు తాజాగా కీలక అప్డేట్ ఇచ్చారు. ఇకపై స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు కచ్చితంగా సంప్రదాయ దుస్తుల్లోనే రావాల్సి ఉంటుంది. డిసెంబర్ 1, 2026 నుంచి ఈ కొత్త డ్రెస్ కోడ్ రూల్స్‌ను పక్కాగా అమలు చేయాలని సింహాచలం(Simhachalam Temple) శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. సాధారణ దర్శనంతో పాటు ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులందరికీ కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.
ఆలయ ఈవో జె. వెంకటరావు తాజాగా ఈ నిర్ణయానికి సంబంధించిన వివరాలను ప్రకటన ద్వారా వెల్లడించారు. డ్రెస్ కోడ్ ప్రకారం పురుషుల ధోతి, అంగవస్త్రాన్ని ధరించాలి. ఒకవేళ అవి కాకపోతే కుర్తా పైజామా లేదంటే ఆలయ నిబంధనలకు తగినట్లుగా ఉండే ఫార్మల్ షర్ట్, ట్రౌజర్స్ వేసుకోవచ్చని తెలిపారు. మహిళలు, యువతులు విషయానికి వస్తే చీరలు, లంగా వోణీలు ధరించాలి. చున్నీతో కూడిన చుడీదార్లకు కూడా ఆలయంలోకి అనుమతిని కల్పించారు.
అయితే అప్పన్న ఆలయ సంప్రదాయాలకు విరుద్ధంగా ఉండే దుస్తులను మాత్రం అనుమతించబోమని సింహాచల దేవస్థానం అధికారులు తేల్చి చెప్పారు. ముఖ్యంగా షార్ట్స్, టీ షర్ట్స్, స్లీవ్‌లెస్ టాప్స్ వంటివి వేసుకుని వస్తే ఇబ్బందులు తప్పవని స్పష్టం చేశారు. భక్తులు అనవసరమైన ఇబ్బందులు పడకుండా ముందుగానే ఈ నిబంధనలను గమనించాలని అధికారులు సూచించారు.
కొత్త నిబంధనలు అమల్లోకి రావడానికి ముందే భక్తులకు పూర్తి అవగాహన కల్పించడానికి ఆలయ యంత్రాంగం చర్యలను చేపట్టింది. ఆలయ ప్రాంగణంలో కీలక ప్రాంతాల్లో డ్రెస్ కోడ్ వివరాలతో కూడిన బోర్డులను ఏర్పాటు చేశారు. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కూడా ఈ రూల్స్ గురించి ముందుగానే తెలుసుకుని ప్రయాణం పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు.
ఇప్పటికే చాలా ఏళ్ల నుంచి తిరుమలలో డ్రెస్ కోడ్ అమలవుతుండగా.. విజయవాడ ఇంద్రకీలాద్రిలోని శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం (కనకదుర్గమ్మ ఆలయం), అన్నవరం వంటి అనేక ప్రముఖ ఆలయాల్లో కూడా ఆయా సేవలతో పాటు సందర్భాలను బట్టి నిబంధనలు అమలు చేస్తుంటారు.
కాగా సింహాచలం క్షేత్ర(Simhachalam Temple) పవిత్రతను కాపాడటంతో పాటు ఆలయ ఆధ్యాత్మిక వాతావరణాన్ని నిలబెట్టడం, హిందూ సంప్రదాయ ఆచార వ్యవహారాలను పరిరక్షించడమే మెయిన్ లక్ష్యంగా ఈ డ్రెస్ కోడ్ తీసుకొచ్చినట్లు ఈవో వివరించారు. కాబట్టి డిసెంబర్ 1వ తేదీ నుంచి అప్పన్న స్వామి దర్శనానికి వెళ్లే భక్తులందరూ ఈ నిబంధనలను తప్పకుండా గుర్తుంచుకుని, తగిన దుస్తులతోనే దేవాలయానికి రావడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.
Megaverse : వైరల్‌గా చిరంజీవీస్ మెగావర్స్ ప్రోమో.. నా అడ్డా అంటూ చిరు రచ్చ..
