Abhishek Sharma
నమీబియాతో విజయంతో సూపర్-8కు చేరువైన టీమిండియా ఇప్పుడు కొలంబోకు వెళ్లింది. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో తలపడబోతోంది. ఈ మ్యాచ్ పై చాలా వివాదం చెలరేగినా చివరకు పాక్ వెనక్కి తగ్గి ఆడేందుకు మొగ్గుచూపడంతో అందరి చూపు ఇప్పుడు హోరాహోరీ పోరుపైనే ఉంది. కాగా పాక్ తో మ్యాచ్ కోసం భారత తుది జట్టు ఎంపిక ఇప్పుడు సవాల్ గా మారింది. ముఖ్యంగా అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఆడడంపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
నమీబియాతో మ్యాచ్ సందర్భంగా టాస్ సమయంలో సూర్యకుమార్ యాదవ్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) పాక్ తో మ్యాచ్ ఆడడం అనుమానమేనంటూ చెప్పాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత వరుణ్ చక్రవర్తి మాత్రం అభిషేక్ ఆదివారం మ్యాచ్ కు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నాడు. ఇప్పుడు జట్టుతో పాటే కొలంబో వెళ్లిన అభిషేక్ శర్మ ప్రస్తుతం ఫిట్ నెస్ సాధించే పనిలో ఉన్నాడు.
శనివారం జరిగే ప్రాక్టీస్ సెషన్ లో ఎటువంటి ఇబ్బందీ లేకుండా బ్యాటింగ్ చేస్తే మాత్రం పాక్ బౌలర్లకు చుక్కలే. ఒకవేళ అభిషేక్ శర్మ (Abhishek Sharma) దూరమైతే మాత్రం సంజూ శాంసన్ కు మరో అవకాశం దక్కొచ్చు. వరుసగా ఎన్ని అవకాశాలిచ్చినా సంజూ నిరాశపరుస్తూనే ఉన్నాడు. మరోవైపు మిగిలిన జట్టులో మరో మార్పు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. బ్యాటింగ్ డెప్త్ ఎక్కువగానే ఉండడంతో కొలంబో పిచ్ దృష్ట్యా రింకూ సింగ్ ను తప్పించి వాషింగ్టన్ సుందర్ ను తీసుకుంటారని భావిస్తున్నారు.
వాషింగ్టన్ సుందర్ ఆల్ రౌండ్ పెర్ఫార్మెన్స్ ఖచ్చితంగా జట్టుకు కలిసొస్తుంది. ఈ రెండు మార్పులు తప్పిస్తే మిగతా కాంబినేషన్ లో మార్పులు జరిగే అవకాశం లేదు. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ కూడా ఫామ్ లోకి వస్తే తిరుగుండదు. ఇషాన్ కిషన్ , హార్థిక్ పాండ్యాా తమ నిలకడైన ఆటతీరును కొనసాగిస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు.
బౌలింగ్ లో పేసర్లుగా బుమ్రా, అర్షదీప్ సింగ్ నే కొనసాగించనున్నారు. దీంతో మహ్మద్ సిరాజ్ కు నిరాశే మిగలనుంది. స్పిన్నర్లుగా అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తిలకు తోడు వాషింగ్టన్ సుందర్ కూడా జట్టులోకి వస్తే పాక్ బ్యాటర్లకు కష్టాలు తప్పవు. కాగా పాక్ వివాదాస్పద స్పిన్నర్ తారిఖ్ ను ఎదుర్కొనేందుకు భారత్ ప్రత్యేకంగా
ఫోకస్ పెట్టినట్టు అర్థమవుతోంది. మరోవైపు కొలంబో పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుందని అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగానే తుది జట్టులో ముగ్గురు స్పిన్నర్లు ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక గత రికార్డులను చూస్తే భారత్ దే పైచేయిగా ఉంది. ఇరు జట్లు 16 సార్లు తలపడితే 13 సార్లు భారత్ గెలిచింది. ఇటీవల ఆసియాకప్ ఫైనల్లో పాక్ ను చిత్తు చేసిన టీమిండియానే ఫేవరెట్ గా చెబుతున్నారు.
భారత తుది జట్టు (అంచనా )
అభిషేక్ శర్మ/సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్.
